విద్వేష వ్యాఖ్యల కేసులో పీడీ యాక్ట్‌పై అరెస్టయి జైల్లో ఉన్న బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరో షాక్ తగిలింది. ఆయనపై నమోదు చేసిన పీడీ యాక్టును అడ్వైజరీ కమిటీ సమర్ధించింది. ఓ మతాన్ని కించపరిచేలా రాజా సింగ్ వీడియో విడుదల చేశారంటూ పోలీసులు ఆయనపై పీడీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో రాజా సింగ్ ఇంకా జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉంటూనే తనపై నమోదైన పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ ఆయన అడ్వైజరీ బోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, అకారణంగా తనపై పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారని ఆయన కమిటీకి విన్నవించారు. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన కమిటీని కోరారు. రాజాసింగ్ పిటిషన్ పై అడ్వైజరీ కమిటీ విచారణ చేపట్టింది. రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయని, అందులో 18 కేసులు మత విద్వేషాలకు సంబంధించినవి పోలీసులు కమిటీకి నివేదించారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత ఆయనపై పై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్టును కమిటీ సమర్థించింది.