రిజర్వేషన్లు కల్పిస్తే మహిళా సాధికారిత వస్తుందా

By KTV Telugu On 15 March, 2023
image

మహిళా రిజర్వేషన్ల అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన భారత జాగృతి ద్వారా మరోసారి హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ డిమాండ్ చేశారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అత్యున్నత చట్టసభలు అయిన లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీల్లో మాత్రమే మహిళా రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి అక్కడ రిజర్వేషన్లు మహిళా నాయకులను తయారు చేశాయా ఆ రిజర్వేషన్లకు ఫలితం లభిస్తుందా.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగసభ లేదా పరిషత్‌ లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు. ఈ అంశం 1931 లోనే చర్చకు వచ్చింది. గాంధీజీ కూడా మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. 1931లో నాటి బ్రిటిష్‌ ప్రధానికి సరోజినీ నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం రిజర్వేషన్లు కో ఆప్షన్‌ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ హానికరమైనవిగానూ పరిగణిస్తున్నా మని పేర్కొన్నారు. ఇలా రిజర్వేషన్లతో కాకుండా మహిళలు స్వయంశక్తితో నాయకులుగా ఎదుగాలని కోరుకున్నారు.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం 1974లో ముందుకు వచ్చింది. రాజ్యసభలో 2010లో ఆమోదం పొందింది బిల్లు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992-93 సంవత్సరాలలో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మూడో వంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50 శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి. తెలంగాణలో స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాని ప్రభుత్వం కేంద్రానికి లేఖ ద్వారా తెలిపింది.

స్థానిక సంస్థల్లో ఇప్పుడు సగం మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. కానీ వారిలో నిజానికి ఎంత మంది యాక్టివ్ గా ఉన్నారు. పది శాతం కూడా ఉండరు. మిగతా వారంతా భర్తల చాటునో లేకపోతే పెత్తందారుల తరపున డమ్మీలుగానో ఉంటారు. అంటే ఈ రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేకుండాపోయింది. నిజానికి నేతల్ని ఒక్క సారిగా రిజర్వేషన్ ఇవ్వడం కన్నా ఇలా దిగువస్థాయిలో అవకాశాలు కల్పించడం ద్వారా ఎగువ సభలకు వచ్చేలా నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకునే మహిళలు ఎక్కువ కాలం సమర్థంగా రాజకీయాలు చేయగలుగుతారు. పరిపాలనా సామర్థ్యం చూపుతారు. కానీ కింది స్థాయిలో మహిళా నాయకుల్ని తీర్చిదిద్దడానికి రిజర్వేషన్లు పెద్దగా ఉపయోగపడటం లేదు. లోక్‌సభలో మూడో వంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి. లోక్‌సభలో 78 మంది అంటే 14.3 శాతం ఉన్నారు. నిజానికి మహిళలకు వివిధ పార్టీలు కాస్త విస్తృతంగానే టిక్కెట్లు ఇస్తున్నాయి. కానీ వారిని ప్రజలు మహిళా కోటాలో చూసి గెలిపించడం లేదు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిది శాతమే ఉన్నారు.

మహిళలకు రిజర్వేషన్లు పెడితే అందులో మళ్లీ పేదలు ధనికులు కులం వంటివి చూడాలి. అలా చూడకుండా మహిళలకు రిజర్వేషన్లు అంటే ఎన్నో సమస్యలు వస్తాయి. బిల్లు పాస్ కాకపోవడానికి ఇదే కారణం. ప్రస్తుత బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే అగ్రకుల ధనిక మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. రిజర్వేషన్లు అడగటం ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమేనని వాదించిన వారూ ఉన్నారు. మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు సాధికారత ఆత్మగౌరవం పెరిగుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ అది రిజర్వేషన్లు ఇచ్చి కూర్చోబెట్టడం వల్ల రాదు. మహిళల్లో నాయకత్వ సామర్థ్యం పెంచగలిగే వాతావరణం ఏర్పాటు చేసి వారంతటకు వారు నాయకులయ్యేలా చేయడమే కీలకమని కొంత మంది వాదిస్తారు. కారణం ఏదైనా రిజర్వేషన్లు అనేది మహిళా సాధికారితకు జిందాతిలిస్మాత్ మాత్రం కాదనేది అందరూ ఒప్పుకునే నిజం కానీ అది ఓ అవకాశాన్ని కల్పిస్తుందంటున్నారు. అందుకే రిజర్వేషన్ల బిల్లు కోసం పట్టుబడుతున్నారు.