ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే రోజు తెలంగాణ, తమిళనాడులో పర్యటించారు. తెలంగాణలో ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరైతే.. తమిళనాడులో దాదాపుగా రూ. ముఫ్పై వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు హాజరయ్యారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పకుండా కర్ణాటక వెళ్లారని … అదే స్టాలిన్ అయితే సంప్రదాయాలు పాటించాలని కొంత మంది సోషల్ మీడియాలో కంపేరిజన్ ప్రారంభించారు. ఇలా చేస్తున్న వారిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. తటస్థుల పేరుతో కొంత మంది ఇదే వాదన తీసుకొస్తున్నారు. కానీ తెలంగాణ, తమిళనాడు పరిస్థితుల్ని మాత్రం సరిగ్గా బేరీజు వేసుకోలేకపోయారు.
మోదీ హైదరాబాద్ పర్యటనలో అసలు తెలంగాణ కోణం ఉందా !?
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చారు. ఆయన వచ్చింది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు. తెలంగాణ ప్రభుత్వానికి కానీ .. తెలంగాణ ప్రజలకు కానీ సంబంధం లేదు. ఆ కార్యక్రమం కోసం వచ్చిన మోదీ ఎయిర్ పోర్టులో సభ పెట్టుకున్నారు. వచ్చిన కొద్ది మంది కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి.. కేసీఆర్ నమ్మకాలు.. హిందూత్వ భావనాలను మూఢనమ్మకాలుగా విమర్శించారు. ఆయన హావభావాలు.. బాడీ లాంగ్వేజ్ కూడా కేసీఆర్ ను అవమానించేలా ఉన్నాయి. ఆయన పర్యటనలో అసలు తెలంగాణ ప్రయోజనల అంశమే లేదు.. పూర్తిగా రాజకీయం మాత్రమే ఉంది.
కేసీఆర్ స్వాగతం పలికి ఉంటే అవమానించి ఉండేవారు కదా !
ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలకాలి. అలా స్వాగతం పలికిన తర్వాత నేరుగా మోదీ వెళ్లి బీజేపీ సభకు హాజరై కేసీఆర్ పైనే విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది.? పూర్తిగా రాజకీయ పర్యటన కాబట్టే సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారని అనుకోవచ్చు. నిజానికి దేవేగౌడతో కేసీఆర్ భేటీ .. మోదీ పర్యటనకు ముందే ఖరారయిందని చెబుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్ స్వాగతం చెప్పకుండా కర్ణాటక వెళ్లిపోయారని విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వ కార్యక్రమం కాబట్టే స్టాలిన్ స్వాగతం చెప్పారు !
తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీకి ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. తర్వాత సభల్లోనూ పాల్గొన్నారు. ఎందుకంటే అది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. తమిళనాడులో కేంద్ర సాయంతో చేపట్టే కార్యక్రమాలు . సీఎం పాల్గొనకపోతే తమిళనాడుకే నష్టం. అందుకే స్టాలిన్ పాల్గొన్నారు. అయితే స్టాలిన్ స్టేజి మీద తమిళనాడు కు రావాల్సినవి అడిగారు. ద్రవిడ మోడల్ అంటే ఏంటో చూపిస్తామన్నారు. కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. దీంతో మోదీ పరువు రోడ్డున పడినట్లయింది. అదే తెలంగాణలో కేసీఆర్ చేస్తే.. బీజేపీ నేతలు ఎలా ఫీలయ్యేవారో అంచనా వేయడం కష్టం. తెలంగాణకు రావాల్సిన వాటిపై తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అడుగుతూనే ఉంది. మొదటి ఐదేళ్లు పూర్తిగా కేంద్రానికి సహకరించినా కూడా ఎలాంటి సాయం చేయలేదు. స్టాలిన్ పదవి చేపట్టి ఏడాది మాత్రమే అయింది. అందుకే ఆయన కేంద్ర సహకారం కోసం ప్రోటోకాల్ పాటిస్తున్నారు. రాజకీయాలు ఎవరి పద్దతిలో వారు చేస్తారు. ఆయన అలా చేశారని.. ఇక్కడ కేసీఆర్‌ను విమర్శించడం కన్నా పెద్ద అవగాహనా లోపం ఇంకోటి ఉండదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
స్టాలిన్ పదవి చేపట్టి ఏడాదే !
స్టాలిన్ పదవి చేపట్టి ఏడాది మాత్రమే అయింది . అక్కడ బీజేపీ ఏ రకంగానూ స్టాలిన్‌కు పోటీ కాదు. కుదిరితే స్నేహం చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ స్టాలినే దూరం పెడుతున్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేసి బీజేపీ రాజకీయం చేస్తోంది. తెర వెనుక చాలా కుట్రలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే నేరుగా జాతీయ రాజకీయాలపై కేసీఆర‌్ దృష్టి పెట్టారంటున్నారు. ఇన్ని జరుగుతున్నాయని తెలిసినా.. రాజకీయమే ఎజెండాగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిసినా ఆయనతో కేసీఆర్ ఎలా ఎదురు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో లాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా స్టాలిన్ కూడా మోడీని దూరం పెట్టేవారు. అంతే కాదు ఇంకా తీవ్ర స్థాయిలో నిరసనలు రుచి చూపించి ఉండేవారు. మోదీ తమిళనాడుకు వెళ్తున్న సమయంలో తెలంగాణలో కంటే ఎక్కువగా తమిళనాడు లో గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇది డీఎంకే కార్యకర్తలకు తెలియకుండానే జరుగుతుందా ?