ప్రధానితో పవన్ భేటీ ఉంటుందా?

By KTV Telugu On 8 November, 2022
image

విశాఖలో మోడీ టూర్ పై రాజకీయం
విపక్షాలను దూరం పెడుతున్న జగన్
ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ విమర్శలు
మోడీతో పవన్ భేటీపై ఆసక్తికర చర్చ

ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వస్తున్న వేళ ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. మోడీ పర్యటనకు విపక్షాలను దూరంగా ఉంచే ప్రయత్నాల్లో వైసీపీ ఉంటే, వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు ట్రై చేస్తున్నాయి. పెద్దన్న రాష్ట్రానికి వస్తున్నా ఏపీ బీజేపీ నేతలు ప్రేక్షకపాత్ర పోషించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల ప్రధాని భీమవరం వచ్చినప్పుడు కూడా విపక్షాలకు తావివ్వకుండా ప్రభుత్వమే అంతా తానై వ్యవహరించింది. ఇక ఇప్పుడు రాజధాని రాజకీయం నడుస్తున్న వేళ ప్రధాని టూర్ ను మరోసారి తమకు అనుకూలంగా మలుచుకుంటోంది వైసీపీ. ప్రధాని రెండ్రోజుల పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాది మందితో పెద్ద ఎత్తున సభకు ప్లాన్ చేసింది. ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్న ప్రధాని పలు అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయనున్నారు. ఈ టూర్ రాష్ట్రంలో అధికార వైసీపీకి చాలా కీలకంగా మారింది. కార్యనిర్వాహక రాజధానిగా తెరపైకి తెచ్చిన విశాఖకు ప్రధానిని రప్పిస్తే కొత్త రాజధానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర పడినట్లు ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మోడీ టూర్ ను ప్రభుత్వం హైజాక్ చేస్తోందని ఆరోపిస్తోన్న బీజేపీ నేతలు ప్రభుత్వానికి పోటీగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మోడీ టూర్ షెడ్యూల్ విడుదల చేశారు. విశాఖ పర్యటనలో మోడీ వెంట ఉండేలా చూసుకునేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పరంగా రోడ్ షో ల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపారు. అదేసమయంలో వైసీపీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. విశాఖపట్నంలో కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్న కమలనాథులు కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రజల్ని మోసం చేస్తోందని దుయ్యబడుతున్నారు. ఈనేపథ్యంలో రాజధాని విషయంలో ప్రధాని ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మోడీ టూర్ విషయంలో ఏపీ బీజేపీ నేతలే నిమిత్త మాత్రులుగా మిగిలితున్న పరిస్థితుల్లో ప్రధానితో పవన్ అపాయింట్ మెంట్ ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ సపోర్ట్ చేయడం లేదని రూట్ మ్యాప్ ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ అసహనంతో ఉన్నారు. బీజేపీతో కటీఫ్ అన్నట్టుగా చూచాయిగా చెప్పేసిన ఆయన చంద్రబాబుకు దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంపై పోరాడేందుకు విపక్షాలన్నీ కలిసిరావాలని బాబు, పవన్ లు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరితో బీజేపీతో జతకడుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. అటు బీజేపీలోని ఓవర్గం బాబుతో కలిసి నడిచే ప్రసక్తే లేదని చెబుతుంటే, మరో వర్గం మాత్రం ముగ్గురం కలిస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో మోడీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పొత్తుల అంశం ఇప్పుడు హీటెక్కిస్తోంది. ఇటీవల భీమవరంలో మోడీ పర్యటనకు కిషన్ రెడ్డి నుంచి పవన్ కు ఆహ్వానం అందింనా ఆయన హాజరుకాలేదు. ఈసారైనా ప్రధానితో జనసేనాని అపాయింట్ మెంట్ ఉంటుందా  అనేది చూడాలి. ప్రధానితో పవన్ భేటీపైన అటు టీడీపీలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. దీనిపై బీజేపీ నేతలు కూడా ఎటూ చెప్పలేకపోతున్నారు.