మోదీ టూర్ వైజాగ్ లో టెన్షన్ పెట్టే అవకాశం ఉందా ? సహేతుకమైన డిమాండ్లు నెరవేరని విశాఖ ప్రజలకు మోదీ పర్యటన ఒక అవకాశం అవుతుందా ? ఉత్తరాంధ్రకు ప్రధాని తాయిలాలు ప్రకటిస్తారా ? లేని పక్షంలో గట్టిగా నిరసనలు నిర్వహించే ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు ఉందా ?
నవంబరు 11న మోదీ వైజాగ్ పర్యటన
400 కోట్లతో వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
బీజేపీ నూతన కార్యాలయానికి శంకుస్థాపన, భారీ బహిరంగ సభ
మూడు రాజధానుల పేరుతో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోసం ఎదురు చూస్తున్న విశాఖ ప్రజల కంటికి ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా అద్భుతాలు జరగాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. నవంబరు 11న విశాఖ వచ్చే మోదీ, వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకస్థాపన చేస్తారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపడతారు. విశాఖలో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే మోదీ.. పనిలో పనిగా బీజేపీ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేయడంతో పాటు భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. భోగాపురం విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులకు ప్రధాని తో శంఖుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
వైజాగ్ వాసుల తీరని డిమాండ్లు
నెరవేరని ఏపీ ప్రత్యేక హోదా కల.. విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం దోబూచులాట.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా వైజాగ్ వాసులకు తీరని డిమాండ్లు చాలానే ఉన్నాయి. విభజన సమయంలో ఏపీకి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం కప్పదాటు వైఖరి పాటించారు. ప్రత్యేక హోదా గడిచిన అధ్యాయమని తేల్చేశారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. కాసేపు అవునని, కాసేపు లేదని చెబుతూ.. జనాన్ని అయోమయంలోని నెడుతోంది. ఇక విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపేందుకు చాలా రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఆ మూడు కీలకాంశాల్లో మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారోనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సానుకూల ప్రకటన రావాలని ఆకాంక్షిస్తున్నారు….
నిరసనలకు సిద్ధమవుతున్న ప్రజా సంఘాలు
బీజేపీతో దోస్తీగా ఆ మూడు పార్టీలు… ప్రధాని స్వయంగా హామీ ఇస్తే కమల వికాసమే..
కేంద్రం వైపు నుంచి రాని ప్రకటనలు
మోదీ పర్యటన సందర్భంగా నవంబరు 11న నగరమంతా నిరసనలు నిర్వహించేందుకు విశాఖ ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేయబోతున్నారు. ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పుడు సుడిగండంలో పడి కొట్టుకుంటున్నాయి. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నట్లు నటించాల్సిన అనివార్యత అధికార వైసీపీకి ఉంది. పైగా కేసుల భయం కూడా ఉంది కదా… దానితో గట్టిగా అడగలేని పరిస్తితి. పైగా సబా వేదికపై మోదీతో పాటు సీఎం కూడా ఉంటారు. మరో పక్క టీడీపీ, జనసేన లాంటి పార్టీలు బీజేపీతో ఎన్నికల పొత్తు కోసం సిద్దంగా ఉన్నాయి. ఇక ప్రధాని స్వయంగా హామీల వర్షం కురిపిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి కొంత ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడిప్పుడే బలపడుతున్న పార్టీకి జవసత్వాలు అందించినట్లవుతుంది. అయితే ప్రధాని మోదీ పర్యటనలో చేయబోయే ప్రధాన ప్రకటనలపై కేంద్రం నుంచి ఎలాంటి సంకేతమూ అందలేదు. దానితో వైసీపీ, టీడీపీ, జనసేనకు దిక్కుతోచని పరిస్తితే ఉంది….