– గుజరాత్‌లో మాటలపోరు మరింత ముదిరిందిగా!
కేజ్రీవాల్ తాను కారణజన్ముడినంటున్నారు. శ్రీకృష్ణుడిలా కంసవధ చేస్తానంటున్నారు. కానీ ఆయన కృష్ణుడు కాదు అర్బన్ నక్సలైట్ అంటున్నారు ప్రత్యర్థులు. ఎవరో కాదు..స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోడీనే ఈ వ్యాఖ్యలు చేశారు. నేరుగా కేజ్రీవాల్ పేరు ఎత్తకపోయినా మోడీ టార్గెట్ ఆమ్‌ఆద్మీ అధినేతనే. కొత్త ముసుగులో అర్బన్ నక్సలైట్లు గుజరాత్‌లోకి చొరబడాలని అనుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ.
గుజరాత్ ఎన్నికల ప్రచారం అభివృద్ధి ఎజెండాగా సాగటం లేదు. నాయకులను లక్ష్యంగా చేసుకుంటోంది. చిన్నస్థాయినుంచి ప్రధాని రేంజ్‌దాకా బీజేపీ నేతలు కేజ్రీవాల్‌ని టార్గెట్ చేసుకున్నారు. అర్బన్ నక్సలైట్ కామెంట్‌తో మోడీ ఇంకాస్త ఘాటుగా స్పందించారు. యువతను తప్పుదోవ పట్టించి తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. యువత జీవితాలతో ఆడుకునేవారిని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వొద్దని పిలుపునిచ్చారు. అలాంటివారు విదేశీ శక్తుల ఏజెంట్లంటూ నిందించారు. వారి ముందు గుజరాత్ తలవంచదన్నారు.
నేరుగా అనకపోయినా మోడీ అర్బన్ నక్సలైట్లు అన్నది కేజ్రీవాల్‌ని, ఆయన పార్టీనేతలనే. ఎందుకంటే కొత్తగా గుజరాత్‌కొస్తోంది ఆమ్‌ఆద్మీ పార్టీనే. మార్పు కోసం ప్రజలు ఆప్ వైపు చూస్తున్నారని కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆప్‌తో బీకేర్‌ఫుల్ అంటూ మోడీ హెచ్చరికలు చేశారు. కాషాయదళం తమమీద విరుచుకుపడుతుంటే బీజేపీ నేతల్ని కేజ్రీవాల్ మరింత కవ్విస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా తమతో కలిసొస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారు ఆప్‌కు మద్దతుగా రహస్యంగా పనిచేయాలని కేజ్రీవాల్ కోరుతున్నారు. కొండకి వెంట్రుకేస్తున్నాడు. వస్తే కొండ లేకపోతే వెంట్రుక. తగ్గేదేలే!