ఎవరీ మునావర్ ఫారుఖీ?

By KTV Telugu On 22 August, 2022
image

స్టాండప్ కమెడియన్ కు అంత ధైర్యం ఉందా.. హైదరాబాద్ లో మునావర్ ఫారుఖీ షో జరుగుతుందా.. బీజేపీ అడ్డుకుంటుందా… తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రత ఇస్తుందా… ఆగస్టు 20న టెన్షన్ తప్పదా….

మునుగోడు బైపోల్స్ పై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రజలకు తెలియకుండానే నివురు గప్పిన నిప్పులా మరో సమస్య తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ఒక కామెడీ షోపై దుమారం రేగుతోంది. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ…. ఈ నెల 20న హైదరాబాద్లో ఒక షో చేయబోతున్నారని తెలియడమే ప్రస్తుత వివాదానికి కారణమవుతోంది. మునావర్ ఫారుఖీ… షో జరిగితే అల్లకల్లోలమేనని . ఘోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపిస్తున్నారు. సిటీలో ఎక్కడ షో నిర్వహించినా… ఆ వేదికను తగులబెడతామని రాజాసింగ్ హెచ్చరించడంతో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు…

జుకో ఆరోపణతో, రోజుకో ఉద్యమంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. బండి సంజయ్ పాదయాత్ర కూడా ఉద్రిక్తంగా మారుతోంది. బీజేపీ ఆడుతున్న ఈ రాజకీయ నాటకాన్ని కొనసాగించేందుకు మునావర్ ఫారుఖీ షో… వారికి అవకాశంగా పరిణమించింది. హైదరాబాద్లో ఆగస్టు 20న షో నిర్వహిస్తానని ఫారుఖీ ప్రకటించినప్పటికీ.. వేదకను ఇంకా వెల్లడించలేదు. దానితో బీజేపీ ఇప్పుడు ఆలోచనలో పడినట్లు సమాచారం. వెన్యూను తగులబెడతామని రాజా సింగ్ హెచ్చరించిన వెంటనే ప్రభుత్వం కంటే ముందు నెటిజెన్స్ స్పందించారు. మునావర్ ఫారుఖీకి వాళ్లు మద్దతిచ్చారు. షో నిర్వహించడంలో తప్పేమిటని ప్రశ్నించారు. రాజా సింగ్ వీడియోను తెలంగాణ మంత్రి కేటీయార్ కు ట్యాగ్ చేస్తూ… షోకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు.

మునావర్ ఫారూఖీ గత జనవరిలోనే హైదరాబాద్‌లో షో నిర్వహించాలనుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్‌మీడియా వేదికగా స్వాగతం పలికారు. దీంతో అప్పట్లోనే రాజాసింగ్ సహా బీజేపీ నేతలు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ సమాజాన్ని అపహాస్యం చేసే వారికి మద్దతిస్తున్నారంటూ ఆరోపణలు సంధించారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని, మునావర్ ఫారూఖీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో కొన్ని కారణాల వల్ల మునావర్ షో రద్దు కావడంతో వివాదానికి తెరపడింది 2021 నుంచి మునావర్ ఫారుఖీ షోలపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ షో ప్లాన్ చేసినా హిందూ సంస్థలు అడ్డుకోవడంతో వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. గతేడాది డజనుకు పైగా షోలు రద్దయ్యాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు….

మునావర్ ఫారుఖీ.. హిందూ సెంటిమెంట్ ను కించపరిచారంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మాలిని సింగ్ గౌర్ తనయుడు ఏకలవ్య గౌర్ కేసు వేశారు. దాని ఆధారంగ్ ఫారుఖీని 2021 జనవరి 1న అరెస్టు చేశారు. నెల తర్వాత కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఫిబ్రవరి ఏడున సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ…. ఉత్తర్వులు అందలేదని,. ప్రయాగ్ రాజ్ కోర్టులో ప్రొడక్షన్ వారెంట్ ఉందని చెబుతూ ఇండోర్ జైలు అధికారులు తాత్సారం చేశారు. దానితో సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని మొట్టికాయలు వేయడంతో రాత్రి 11 గంటల తర్వాత అతడ్ని విడుదల చేశారు. తర్వాత మునావర్ ఫారుఖీ షోలు పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం అతని వీడియోలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హైదారాబాద్లో ఒక షో చేయబోతున్నట్లు ఫారుఖీ స్వయంగా వెల్లడించాడు. మరి ఆగస్టు 20న ఏం జరుగుతుందో చూడాలి….