ఎవరు గెలిచినా రాజకీయం లెక్కమారబోతోంది!
ముచ్చటగా మూడు..మునుగోడును చూడు!
మునుగోడులో ప్రచారపర్వానికి తెరపడింది. 3వతేదీ పోలింగ్ ముగిసేదాకా ఎన్ని నిఘాలున్నా ప్రలోభాల పర్వం ఆగేలా లేదు. ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఓ లెక్క, మునుగోడు మరో లెక్క అన్నట్లుంది వాతావరణం. మైకుల మోత ఆగడానికి కొన్ని గంటలముందు మునుగోడులో టీఆర్ఎస్-బీజేపీ ఘర్షణపడ్డాయి. కర్రలు లేచాయి. రాళ్లు పడ్డాయి. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈటల కాన్వాయ్మీద దాడి జరిగితే, బీజేపీ కూడా ప్రతిదాడికి దిగింది. దీంతో కొందరి తలలు పగిలాయి. ఇన్నాళ్లూ మాటలయుద్ధం దగ్గరే ఆగిన ప్రచారం చివరి అంకంలో రక్తం కళ్లచూసింది.
ఎన్నో ఉప ఎన్నికల్ని తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టిన టీఆర్ఎస్కి మునుగోడు అగ్నిపరీక్షలా ఉంది. వాస్తవానికి ఇది కాంగ్రెస్ సీటు. ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి పదవికి రాజీనామా చేసి బీజేపీనుంచి పోటీకి దిగారు. దుబ్బాకలా సిట్టింగ్ సీటు చేజారుతుందని గులాబీపార్టీ టెన్షన్ పడాల్సిన పన్లేదుగానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల భవితవ్యాన్ని నిర్దేశించేలా మారిపోయింది మునుగోడు ఎన్నిక. దుబ్బాక, హుజూరాబాద్ గెలుపు తర్వాత దూకుడుమీదున్న బీజేపీ మునుగోడులో కూడా జెండా ఎగరేసి ట్రిపులార్‌తో పొలిటికల్ సీన్ మార్చేయాలనుకుంటోంది. అందుకే మొత్తం యంత్రాంగాన్నంతా మోహరించింది.
18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయాడని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించింది. ఆయన కొడుకు కంపెనీనుంచి కొన్ని ఖాతాలకు కోట్ల నిధులు వెళ్లాయని ఈసీకి ఫిర్యాదుచేసింది. టీఆర్ఎస్ ఆరోపణలకు ఆధారాలు లేవని ఈసీ స్పష్టంచేయటంతో బీజేపీ దూకుడు పెంచింది. మూడువారాలనుంచి మునుగోడులో కోట్ల రూపాయల మందు ఏరులైపారింది. వద్దంటే దావత్‌లు నడిచాయి. ఓటుకు నోటు వ్యవహారంలో మునుగోడు దెబ్బకి పాత రికార్డులన్నీ బద్దలయ్యేలా ఉన్నాయి. దున్నపోతుల పొట్లాటలో చిక్కిన లేగదూడలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఓటరు ఎటు మొగ్గినా మునుగోడు ఫలితం మాత్రం కొత్త సమీకరణాలకు తెరలేపబోతోంది.