మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
అయితే ఈ విజయం టీఆర్ఎస్ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల్లో ఒక్క ఓటు తేడా గెలిచినా గెలుపు గెలుపే. అయినా మునుగోడు గెలుపు మాత్రం టీఆర్ఎస్ కు అంతగా సంతృప్తి కలిగిచడంలేదు. తమ మెజార్టీని బీజేపీ తగ్గించగలిగిందని స్వయంగా మంత్రి కేటీఆర్ అన్నారంటే బీజేపీ టీఆర్ఎస్కు ఎంత దగ్గరగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ తెలంగాణలో తమకు ఎదురులేదనుకున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు భవిష్యత్ గురించి భయం పట్టుకుంది. మునుగోడులో సర్వశక్తులూ ఒడ్డితే ఆ పార్టీకి వచ్చిన మెజార్టీ 10,309 ఓట్లు. కేసీఆర్ కేబినెట్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఇలా చిన్నాపెద్దా అధికార పార్టీ నేతలంతా మునుగోడులో దాదాపు నెల రోజుల పాటు తిష్ట వేశారు. ఇంటింటికి తిరిగారు. ఇంతా చేస్తే చివరికి వచ్చిన మెజారిటి 10 వేలు. అది కూడా కౌంటింట్ చివరి రౌండు వరకు ఉత్కంఠ తప్పలేదు. మొత్తానికి టీఆర్ఎస్ బతికి బట్ట కట్టింది. అటు బీజేపీ ఓడిపోయినా తెలంగాణలో టీఆర్ఎస్ కి బలమైన ప్రత్యర్థి తామేనని నిరూపించుకుంది. 2018లో బీజేపీకి 12,725 ఓట్లు వస్తే ఇప్పుడు మునుగోడులో 86,697 ఓట్లు దక్కాయి. అంటే నాలుగేళ్లలో అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓట్లు టీఆర్ఎస్కు ప్రమాద సూచికలే అని చెప్పవచ్చు. మామూలుగా ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిందంటే ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఎలా వుంటుందో అని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ చాప కింద నీరులా బలపడుతోందన్నది మాత్రం వాస్తవం.