. మునుగోడులో కాంగ్రెస్ మునుగుతుందా..!
. సొంత పార్టీ నేతలపై రేవంత్ విమర్శల దాడి
. తనను తప్పించే కుట్ర జరుగుతోంని ఫైర్
. విరోధులపై విమర్శలు..సెంటిమెంట్ అస్త్రం?
మునుగోడులో కాంగ్రెస్ మునుగుతుందా..!
కేసీఆర్ తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారా?
సొంత పార్టీ నేతలపై రేవంత్ విమర్శల దాడి
తనను తప్పించే కుట్ర జరుగుతోంని ఫైర్
మునుగోడులో కాంగ్రెస్ నిండా మునుగుతోందా? ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుంటే….కాంగ్రెస్ నాయకులు మాత్రం తమలో తామే కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మునుగోడు బై పోల్ కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ సెమీఫైనల్ గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక్కడ చేతులెత్తేస్తే ఆ ఎఫెక్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది. హస్తం పార్టీ మరింత అస్తవ్యస్తంగా మారుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నిక రేవంత్ రెడ్డికి సవాల్ గా మారింది. ఇప్పటికే రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ హుజూరాబాద్ ఓడిపోయింది. ఇప్పుడు మునుగోడులోనూ టీఆర్ఎస్, బీజేపీలతో పోలిస్తే వెనుకబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో, సెంటిమెంట్ అస్త్రం సంధిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మునుగోడు కాంగ్రెస్ అడ్డాని చెప్పుకుంటున్న కాంగ్రెస్…ఆ స్థాయిలో ప్రచారం నిర్వహించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రచారానికి రావాలని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చేతులు జోడించి అభ్యర్థించినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు వైపు కన్నెత్తి కూడ చూడడం లేదు. తనలాంటి హోంగార్డు పార్టీకి అవసరం లేదంటూ రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పస్తున్నారు. ఇక, కొందరు సీనియర్లు అటువైపే చూడకపోగా, వెళ్లినవారు సైతం సీరియస్ గా ప్రచారం చేయడం లేదు. దీంతో, మునుగోడు ఉపపోరులో స్రంవతి ఎదురీదుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ లాంటి బలమైన అభ్యర్థులను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సెంటిమెంట్ పండిస్తోంది. స్రవంతి గ్రామగ్రామాన తిరుగుతూ..భావోద్వేగానికి గురవుతున్నారు. తండ్రిని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.
మునుగోడులో అంతా తానై వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాక రేపాయి. తనను టార్గెట్ చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని హాట్ కామెంట్స్ చేశారు. తనను ఒంటరిని చేశారని, పీసీసీ పదవి కోసం కొందరు కేసీఆర్ తో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతే ఆనెపాన్ని తనపై వేసి తప్పించాలని సొంత పార్టీ నేతలే కుట్ర పన్నుతున్నారంటూ కలకలం రేపారు. తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అయితే, మునుగోడు గెలవడం పక్కనబెట్టి….ముందే ఓటమిని అంగీకరించినట్లుగా హస్తం నేతల తీరుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.