ఆయన పార్టీలో ఉంటారా.. ఉండరా.. ఉంటే ఏ పార్టీలో ఉంటారు… ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇన్ని ప్రశ్నలు వచ్చేది ఒకే ఒక్క నేత గురించి. పైగా ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతం ఉన్న పార్టీ కేడర్ ను కూడా అయోమయంలో పడేశారాయన. ఇదంతా. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్న ఒక్కే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గురించి. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో ఏ పార్టీ గెలవబోతోంది.. ఉన్న స్థానాన్ని హస్తం పార్టీ పోగొట్టుకుంటుందా. నిలబెట్టుకుంటుందా. టీఆర్ఎస్ షాకిస్తుందా… ఓసారి చూద్దాం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక నియోజకవర్గం మునుగోడు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో అనే అనుమానాన్ని కంటిన్యూ చేస్తుంటారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ పొగడటం రాజగోపాల్ రెడ్డికి సాధ్యం. ఆయన మాటలతో కేడర్ అయోమయంలో పడింది. తాము ఎవరి కోసం పనిచేస్తున్నామో తెలియని స్థితి. చాలామంది నేతలు పార్టీ విడిచి వెళ్లిపోయారంటే అది రాజగోపాల్ రెడ్డి వల్లేనన్న టాక్ ఉంది. టఫ్ ఫైట్ లో గెలిచినా ప్రజల్ని పట్టించుకోవడం లేదన్న అపవాదు ప్రస్తుత ఎమ్మెల్యేపై బాగానే ఉంది. నియోజకవర్గం కోసం ఇప్పటి వరకు పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ఉంది. ఏక్షణాన పార్టీ మారతారో చెప్పలేని పరిస్థితి.
ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఫేవరెట్ గా ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ఒకవేళ బీజేపీలో చేరితే భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆలోచనలు చేస్తున్నారు.
ఈసారి బరిలో నిలిచేదెవరు?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనేది చెప్పడం కష్టమైన విషయమే. రాజగోపాల్ రెడ్డి పార్టీ జంప్ అయితే మాత్రం పోటీలో వచ్చే నేతలెవరనేది తేలనుంది. పార్టీలో రాజగోపాల్ రెడ్డి స్థాయిలో అంత అంగబలం, అర్ధబలం ఉన్న నేత లేరనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కేడర్‌తో సత్సంబంధాలు ఉండేలా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 30 వేల ఓట్లు పొందారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో దగ్గరి బంధుత్వం ఉంది. వచ్చే ఎన్నికల్లో మునుగోడు టికెట్ స్రవంతి ఆశిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. బీజేపీకి నియోజకవర్గంలో పట్టులేకపోయినప్పటికీ ఈసారి ఒకరిద్దరు పోటీ చేసేందుకు ఉత్సాహ పడుతున్నారు. 2018 ఎన్నికల్లో డాక్టర్ మనోహర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ నేత కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ సారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరో ఐదారుగురు కూడా టికెట్ కోసం పోటీపడుతున్నారు.
జనం మూడ్ ఎలా ఉందంటే..
నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఏపని ముందుకు సాగనీయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు కాంగ్రెస్ పెద్దగా ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నుంచి దళితబంధు వరకు ఏ పథకం పూర్తిగా అందడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. తమ సమస్యల్ని పూర్తిగా పట్టించుకునే వారినే గెలిపించాలని కోరుకుంటున్నారు.
నియోజకవర్గంలో బీజేపీకి కేడర్ బలంగా కూడా లేదు. ఎన్నికలు జరిగితే పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉండటం ఖాయం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు విజయం సాధించిన స్థానం ఇదొక్కటే. ఉత్తర తెలంగాణలో పట్టున్న టీఆర్ఎస్ ఈసారి దక్షిణ తెలంగాణ పట్టు పెంచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
కేసీఆర్ ఈసారి గజ్వేల్ నుంచి కాకుండా మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఈ ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని
అన్ని నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలపై కూడా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి ఈస్థానం నుంచి పోటీ చేస్తే అన్ని రకాలుగా పార్టీకి కలిసొస్తుందన్న అంచనాలు గులాబీ బాస్ మదిలో ఉన్నాయనేది కేసీఆర్ సన్నిహితుల మాట.
రాజగోపాల్‌రెడ్డి స్థానికేతరుడైనప్పటికీ కోమటిరెడ్డి కుటుంబానికి ఉన్న క్రేజ్‌తో గత ఎన్నికల్లో విజయం సాధించి పెట్టింది. ప్రస్తుతం కోమటిరెడ్డి హవా గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు లేదు. ఈ పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్, టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి.