మునుగోడులో ఇంటింటికి కిలో చికెన్ ఫ్రీ

By KTV Telugu On 10 October, 2022
image

మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి రాజకీయా పార్టీలు ఓటర్లను రకరకాలుగా కాకా పడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ ఎన్నికలో గెలవడాన్ని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తన బలగాన్నంతా మునుగోడులో మోహరించింది. ఈ నేపథ్యంలోనే
చండూరు మండలం పుల్లెంల గ్రామంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఆదివారం చికెన్‌ పంపిణీ చేశారు. గ్రామంలో 700 గడపలు ఉండగా ప్రతి ఇంటికీ కిలో చొప్పున చికెన్‌ సరఫరా చేశారు. ఉదయం 8 గంటలకే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌లపై వచ్చి 10 గంటలకల్లా చికెన్‌ పంపిణీ పూర్తిచేశారు. సుమారు 2,200 ఓటర్లు ఉన్న ఈ గ్రామానికి సర్పంచ్‌గా బీజేపీకి చెందిన బొబ్బరి సంధ్యారాణి ఉండగా, ఉప సర్పంచ్‌ యాదమ్మ టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గ్రామానికి టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఓటర్లను ప్రలోభపెట్టడానికి టీఆర్ఎస్ నాయకులు పోలీసుల వాహనాల్లోనే డబ్బు సంచులను తరలిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కుట్రతో సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు పంచి పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల ఆధ్వర్యంలో జరగడం సిగ్గచేటని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడులో తీష్ట వేశారని, వారంతా ఇక్కడి ప్రజలను రకరకాలుగా ప్రలోభపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక్కో ఓటుకు టీఆర్‌ఎస్‌ 40 వేలు, బీజేపీ 30 వేలు, కాంగ్రెస్‌ 10 వేలు చొప్పున పంచిపెడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు పెడుతున్న ఖర్చు రిత్యా ఇది అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.