అమ‌రావ‌తి పాద‌యాత్రను అటకెక్కించిన చంద్రబాబు

By KTV Telugu On 19 November, 2022
image

లోకేష్ పాదయాత్ర కోసం అమరావతి పాదయాత్ర బలి
అమరావతి పాదయాత్ర ఖర్చులు భరించలేమన్న బాబు

అమరావతే ఏకైక రాజధాని. అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి నుంచి అరసవల్లి వరకు మొదలెట్టిన యాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి. అది మొళ్లీ మొదలవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లూ యాత్రను వెనకనుంచి నడిపించిన చంద్రబాబే ఇప్పుడు తన కొడుకు కోసం ఆ యాత్రను బలిపెట్టడానికి సిద్ధమయ్యారని సమాచారం. నిజానికి ఈ పాదయాత్రలో రైతులెవరూ లేరని ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారలు చేస్తున్న యాత్ర అని వైసీపీ మొదటినుంచి విమర్శలు గుప్పిస్తోంది. యాత్రలో పాల్గొన్నవారు కూడా ఎక్కడా తగ్గలేదు. దారి పొడవునా వైసీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను దూషిస్తూ, ఎగతాళి చేస్తూ ఛాలెంజులు చేస్తూ, తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ, చెప్పులు చూపిస్తూ ఓవరాక్షన్ చేశారు.

వాస్తవానికి పాద‌యాత్ర‌లో 600 మంది మాత్రమే పాల్గొనేందుకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. అందరి దగ్గరా గుర్తింపు కార్డులు ఉండాలని ఆదేశించింది. అయితే పాద‌యాత్ర చేస్తున్న వారి గుర్తింపు కార్డుల్ని పోలీసులు ఎప్పుడూ అడ‌గ‌లేదు. రాను రాను వారి ఓవ‌రాక్ష‌న్ భరించలేక ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్‌గా తీసుకుంది. యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం దగ్గరకు చేరుకున్నప్పుడు పోలీసులు అడ్డుకుని 600 మంది ఐడీ కార్డులు చూపాల‌ని ప‌ట్టుప‌ట్టారు. అయితే ఐడీ కార్డులున్న వారు ప‌ది శాతం మాత్ర‌మే తేలారు. దాంతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ యాత్రను వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. ఒక‌వైపు 33 వేల ఎక‌రాల‌ను త్యాగం చేశామ‌ని చెబుతూ, మ‌రోవైపు పాద‌యాత్ర చేయ‌డానికి క‌నీసం 600 మంది రైతులు కూడా లేరంటే చంద్రబాబు చేసిన మాయాజాలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. యాత్రను వాయిదా వేసుకుని వెళ్లిపోయిన అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ప్ర‌భుత్వం అణ‌చివేత చ‌ర్య‌లకు పాల్ప‌డుతోందంటూ హైకోర్టును ఆశ్ర‌యించింది. నిబంధ‌న‌లు పాటించాల్సిందే అని, స‌డ‌లింపులు ఉండ‌వ‌ని తేల్చి చెప్పింది.

దాంతో త్వరలోనే పాద‌యాత్ర ప్రారంభిస్తామ‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌లు ప్ర‌క‌టించారు. పాద‌యాత్ర‌పై హైకోర్టు ఫైన‌ల్ తీర్పు కూడా వ‌చ్చింది. అయినా పాద‌యాత్ర ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పడం లేదు. ఇంత కాలం పాద‌యాత్ర‌ను వెనుక నుంచి న‌డిపిస్తున్నది టీడీపీయే అనేది అందరికీ తెలుసు. పాదయాత్ర ఏ నియోజ‌క‌వ‌ర్గంలో వెళ్తే ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ ఖ‌ర్చుల్ని భ‌రించేలా చంద్ర‌బాబు ఆదేశం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాద‌యాత్ర ఆగిపోయేంతవరకు అదే జ‌రిగింది. ఇప్పుడు రాజ‌కీయ ప్రాధాన్యతలు మారిపోయాయి. ఇకపై అమ‌రావ‌తి పాద‌యాత్ర‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డ‌కూడ‌ద‌ని చంద్రబాబు త‌న వాళ్ల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం. ఎందుకంటే.

జ‌న‌వ‌రి 27 నుంచి లోకేష్ పాద‌యాత్ర ప్రారంభించ‌బోతున్నారు. లోకేష్ యాత్ర ప్రారంభమైతే ఆ ఖ‌ర్చంతా ఆయా నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లే భరించాల్సి ఉంటుంది. ఇటు అమ‌రావ‌తి పాద‌యాత్ర, అలాగే లోకేష్ పాద‌యాత్ర ఖ‌ర్చులు భ‌రించ‌డం టీడీపీ నేత‌ల‌కు త‌ల‌కు మించిన భార‌మ‌వుతుంద‌నే చ‌ర్చ టీడీపీలో జ‌రుగుతోంది. దీంతో అమరావతి రెండో ద‌శ పాద‌యాత్రను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చంద్ర‌బాబు టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం. పాద‌యాత్ర పేరుతో అమ‌రావ‌తి జేఏసీ వంద‌ల కోట్లు వ‌సూలు చేసింద‌ని, క‌నీసం సొంత ఖ‌ర్చులు కూడా పెట్టుకోకుండా ఆ మొత్తాన్ని ఏం చేస్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించిన్న‌ట్టు తెలుస్తోంది. పైగా అమ‌రావ‌తిని న‌మ్ముకుంటే ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో టీడీపీకి న‌ష్ట‌మ‌ని ఆయన అలోచిస్తున్నారట. అందుకే ఇక‌పై రాజ‌ధాని పాద‌యాత్ర‌కు క‌నీసం న్యాయ స‌హాయం కూడా అందించ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వచ్చారు. చంద్రబాబు వైఖరి అమ‌రావ‌తి జేఏసీ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తోంది. ఫలితంగా అమరావతి పాద‌యాత్ర ముందుకు సాగ‌డంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోంది. లోకేష్ కోసం అమ‌రావ‌తి యాత్రను చంద్ర‌బాబు బ‌లి పెడుతున్నారని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు సహకారం లేకుండా సొంతంగా అమరావతి పాదయాత్ర కొనసాగిస్తారా లేదా చూడాలి.