జగన్ రికార్డుపై లోకేష్ గురి

By KTV Telugu On 25 November, 2022
image

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు
400రోజులు.. 4000 కి.మీ. పాదయాత్ర
జగన్ 341 రోజుల్లో 3,648కి.మీ. మేర యాత్ర

పాదయాత్ర ఓ బ్రహ్మాస్తం. అధికారంలోకి రావాలనుకునే ఏ పార్టీకైనా అది ఓ బలమైన టానిక్ లా పనిచేస్తోంది. నిరంతరం జనంతో మమేకమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగడమే గాక వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపే వేదిక అవుతోంది. నడిచే దారిలో అలా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీసుకొని మేనిఫెస్టోను రూపొందించుకునే అవకాశాన్ని కలిపిస్తుంది. జనంలోంచి వచ్చిన వాడే నాయకుడవుతాడు. నాటి వైఎస్సార్ నుంచి మొన్నటి జగన్ పాదయాత్రవరకు అది రుజవైంది కూడా. పాదయాత్రలో వైఎస్సార్ ఫ్యామిలీది ట్రాక్ రికార్డ్. వైఎస్సార్, ఆ తర్వాత షర్మిల, అనంతరం జగన్ ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసి రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం తెలంగాణలో షర్మిల రెండోసారి పాదయాత్ర చేపడుతున్నారు. అయితే ఆమె పాదయాత్ర అధికారం ఇవ్వకపోవచ్చు గానీ ఎంతోకొంత ప్రజల మద్దతు కూడగడుతుందనే ఆశతో వైఎస్సార్టీపీ ఉంది. ఇక ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఇక నారా ఫ్యామిలీ నుంచి కూడా రెండో పాదయాత్ర మొదలవుతోంది. నాడు వస్తున్నా మీకోసమంటూ పాదయాత్ర చేశారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ తండ్రిబాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 27నుంచి పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికలు చావోరేవోగా మారిన పరిస్థితుల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టేందుకు డిసైడ్ అయ్యారు. లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్ షెడ్యూల్ కు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. గతంలో జగన్ చేసిన పాదయాత్ర రికార్డులపై గురి పెట్టారు లోకేష్. జగన్ నాడు ప్రతిపక్ష నేతగా 341 రోజుల్లో 3,648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేసారు. ఇప్పుడు లోకేశ్ 400 రోజుల్లో మొత్తం 4వేల కిలీ మీటర్ల మేర పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే తాను పోటీ చేయదల్చుకున్న మంగళగిరికి కేవలం 4 రోజులే సమయం కేటాయించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమిపాలైన లోకేష్ వచ్చే సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటనలు చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాదయాత్రకు వెళ్తున్న సమయంలో మంగళగిరిలో పార్టీ బాధ్యతలను అక్కడి పార్టీ శ్రేణులకు అప్పగించారు.

రాబిన్ శర్మ డైరెక్షన్‌లో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు ప్లాన్ చేస్తూనే లోకేష్ పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 175 నియెజకవర్గాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్రకు ప్రణాళిక రూపొందించారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం టికెట్లు యువతకు ఇవ్వాలనే ఆలోచనతో టీడీపీ ఉంది. లోకేశ్ కూడా తన పాదయాత్రలో యువతను ప్రత్యేకంగా ఆకర్షించేలా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. యాత్రలోనూ యువతకు ఎక్కువగా భాగస్వామ్యం కల్పించనున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు. నిరుద్యోగం ప్రధాన అంశాలుగా ఈ యాత్ర సాగనుందని తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర ఆయన రాజకీయ భవిష్యత్‌కు బలమైన పునాదులు వేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం కట్టబెడుతుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారు.