కంగనా సినిమాతో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి… ఎమర్జన్సీ బిహైండ్ స్టోరీ

By KTV Telugu On 25 July, 2022
image

శత్రు శేషం లేకుండా చూడాలనుకుంటున్నారా.. కాంగ్రెస్ ను మోదీ ఫినిష్ చేయాలనుకుంటున్నారా…. ముప్పేట  దాడిని  తుది అంకానికి తీసుకొచ్చారా… 1970ల నాటి సంగతులు కూడా ప్రస్తావిస్తూ.. హస్తం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారా…

దేశంలో కాంగ్రెస్ ఇప్పుడు బలహీనంగా ఉంది. లోక్ సభలో యాభై సీట్లు మాత్రమే ఉన్నాయి. పార్టీ రాజ్య సభ బలం రోజు రోజుకు తగ్గిపోతోంది. పార్టీలో కీలక నేతలంతా ఒక్కొక్కరుగా వేరు దారులు వెదుక్కుంటున్నారు. అయినా హస్తం పార్టీ పట్ల ప్రత్యర్థులకు భయం.. ఆ పార్టీ పుంజుకుంటే తమ పనైపోయిందన్న అనుమానం. అందుకే పూర్తిగా భూస్థాపితం చేయాలన్న సంకల్పంతో పాచికలు వేస్తున్నారు. కాంగ్రెస్ ను కంటికి కనిపించకుండా చేయాలన్న  వ్యూహంతోనే ప్రధాని మోదీ రోజుకో రూట్లో వస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసును తవ్వితీసి సోనియా ఆమె తనయుడు రాహుల్ ను 24 గంటలు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ ను ఐదు రోజుల పాటు 55 గంటల పైగా ప్రశ్నించిన ఈడీ .. ఇప్పుడు సోనియాను అదే స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఉంది.

సీబీఐ, ఈడీ లాంటి  కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడం బహుశా మెదీకి తెలిసినట్లు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. పైగా జంట కవుల్లా… పక్క అమిత్ షా ఉంటే ప్రధాని మరింతగా రెచ్చిపోతారు. ఇప్పటికే ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ కు కాంగ్రెస్ ను పరిమితం చేసిన బీజేపీ నేతలు లోక్ సభ ఎన్నికల నాటికి ఆ రెండు రాష్ట్రాలను కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు. వరుసగా రెండు సార్లు కేంద్రంలో మోదీ అధికారానికి వచ్చారు. మూడోసారి ఢిల్లీ పీఠం తనదేనంటున్నారు .

ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ధరల నియంత్రణ కోల్పోయాయి. జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో జనం గగ్గోలు పెడుతున్నారు. పెరుగు, పన్నీరుకు కూడా ఏమిటీ పన్ను అని ప్రశ్నిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఏడు శాతం దాటింది. రోజురోజుకు పైకి ఎగబాకుతోంది. గ్యాస్ బండ వెయ్యి రూపాయలు దాటి చాలా రోజులైంది. దీనితో ప్రజాగ్రహం గోదావరి వరదలా కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం కుదరని పని అని మోదీకి తెలుసు. పైగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు నిరసనలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి. ఇంకో ఏడాదైనా ధరాఘాతం కొనసాగుతుంది. ధరలు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో సగటు ఓటరు పక్కచూపులు చూసే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉన్నందున ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీస్తే తమకు ఇబ్బంది ఉండదని అంచనా వేస్తున్నారు.

1975ల నాటి ఎమర్జెన్సీని మోదీ ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యంతో పాటు జీవించే హక్కును ఎవరు హరించారో గుర్తుచేసుకోవాలని అంటూ ప్రజలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయినా ప్రజాస్వామ్యమే గెలిచిందని ఎమర్జీన్సీ ఓడిందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. భవిష్యత్ తరాలు కూడా ఎమర్జన్సీని మరిచిపోకూడదని అంటూ కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.. పైగా ఎమర్జెన్సీ కథాశంగా సినిమా కూడా రాబోతోంది. వివాదాలకు కేంద్ర బిందువుగా నటన సాగించే కంగనా రనౌత్… ఆ సినిమాలో ఇందిరాగాంధీగా పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెట్టేవిగా ఉంటాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ సినిమాపై అభ్యంతరం చెప్పగా… ఎమెర్జెన్సీ చీకటి రోజులు అంటూ.. బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. నిజానికి కంగనా మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆమె దర్శక నిర్మాతగా ఎమర్జెన్సీ పేరుతో సినిమా వచ్చినా.. దాని వెనుక ఎవరున్నారనేది పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా మాధ్యమంగా ఎమర్సెన్సీని ఎక్స్ పోజ్ చేసి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచడమే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏదో విధంగా పార్టీని పలుచన చేయడమే బీజేపీ లక్ష్యమని ప్రత్యేకంగా చెప్పాలా…

అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. మోదీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని అస్త్రాలు ప్రయోగించేశారు. బ్రహ్మాస్త్రం ఇంకా అమ్ములపొదిలోనే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది….