* ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణలో విఫలమయ్యారన్న ఎన్జీటీ
* రెండు నెలల్లో రూ. 3,800 కోట్ల జరిమానా కట్టాలని ఆదేశం
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల భారీ జరిమానా విధించింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకపోవడం, తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ నిర్వహణ సరిగాలేదంటూ 1996లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సురక్ష అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తదనంతర కాలంలో ఎన్జీటీకి బదిలీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జీటీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు పంపింది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కూడా నోటీసులు పంపగా, ఆయన ఇచ్చిన వివరణ పట్ల ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇంత భారీ మొత్తం జరిమానా విధించింది. రెండు నెలల్లో ఈ జరిమానా మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇకనుంచైనా వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని, వాటికి సంబంధించిన పురోగతిని తమకు నివేదించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిది. ఇతర రాష్ట్రాలకు కూడా ఎన్జీటీ భారీ జరిమానాలు విధించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాలు అమలు పరచడంలో విఫలమయ్యారంటూ మహారాష్ట్రకు రూ.12 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.3,500 కోట్లు, రాజస్థాన్ కు రూ.3 వేల కోట్లు, పంజాబ్ కు రూ.2,080 కోట్ల జరిమానా విధించింది.