ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడాలంటే రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష వేయాలి.. ఆయనకు ఏడాది శిక్ష మాత్రమే విధించి కోర్టు.. ఊరటనిచ్చింది. అయినా గత ఆరు నెలల రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయ జీవితం ముగిసిపోయిందనే చెప్పాలి.. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో పూర్తిగా తెరపడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగింది…
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్.. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ల క్రితం నాటి కేసులో సిద్ధూకు అత్యున్నత న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. 1988, డిసెంబర్ 27న రోడ్డుపై సిద్ధూకు, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ క్షణికావేశంలో తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడిని వాహనంలో నుంచి బయటకు లాగి మరీ సిద్ధూ పిడిగుద్దులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సెప్టెంబర్, 1999లో నవజోత్ సింగ్ సిద్ధూను, అతని స్నేహితుడు సంధూను నిర్దోషులుగా తేల్చుతూ తీర్పిచ్చింది. హైకోర్టులో మాత్రం సిద్ధూకు శిక్షపడింది. అప్పీలుకు వెళ్లగా… సుప్రీం కోర్టు తొలుత వెయ్యి రూపాయల జరిమానాతో సరిపెట్టింది.
దానితో బాధిత కుటుంబం అభ్యంతరం తెలుపుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం వెయ్యి రూపాయల జరిమానాతో పాటు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఇప్పుడు తీర్పును వెలువరించింది.
సిద్ధూ గతం, వర్తమానం, భవష్యత్తు ?
రాజకీయాల్లో ఆయన విచిత్ర జీవి ఎక్కడా నిలకడగా ఉండరు. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుంటారు. తేల్చుకుంటాం రా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అడిగింది ఎందుకు ఇవ్వరూ అన్నట్లుగా నిలదీస్తుంటారు. బీజేపీలో ఉన్నప్పుడు గోల గోల చేశారు. పంజాబ్ శాఖను భ్రష్టు పట్టించారు 2017లో కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ ఆయన్ను నమ్మి కాంగ్రెస్ లో చేర్చుకుంటే.. పంజాబ్ కాంగ్రెస్ ను ఒక ఆట ఆడుకున్నారు. ఆయన అసమ్మతి రాజకీయాల వల్లే సీఎం అమరీందర్ సింగ్ ను సాగనంపాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా సిద్ధూ తన ధోరణి మార్చుకోలేదు.. సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటించలేదన్న కోపంతో అసమ్మతి రాజకీయాలు కొనసాగించి.. పార్టీ పరాజయానికి కారణమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధిష్టానం ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటికీ ఆయన మారలేదు. కాంగ్రెస్ లో ఉంటూనే ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ సొంత పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు.. ఛాన్స్ ఇస్తే ఆప్ లో చేరేందుకు సిద్ధమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు..
ఏడాది జైలు శిక్ష పడటంతో ఆయనకు కొంత ఊరట లభించి ఉండొచ్చు. రెండేళ్లు ఆపై శిక్ష పడితే మాత్రం శిక్షాకాలానికి మరో ఆరు సంవత్సరాలు కలిపి.. ఆ టైమ్ లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ దిశగా చూస్తే సిద్ధూ తప్పించుకున్నట్లే అవుతుంది. పార్టీల పరంగా మాత్రం సిద్ధూ అన్నింటికీ చెడ్డ రేవడిగా మారే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ నుంచి సిద్ధూను బహిష్కరించేందుకు రంగం సిద్దమవుతోంది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పంజాబ్ శాఖ కేంద్ర పార్టీకి సిఫార్సు చేసింది. బీజేపీ మరోసారి దగ్గరకు రానివ్వదు. శిక్షపడిన వ్యక్తిని ఆప్ రానిస్తుందన్న నమ్మకం లేదు..
ప్రస్తుతానికి సిద్ధూ పోలీసు స్టేషన్లో లొంగిపోవాల్సి ఉంటుంది. గతంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రోజులు పోగా… ఏడాది శిక్షలో కొంతకాలం జైల్లో ఉండక తప్పదు. బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా ఆయన ఏమైనా సాధించగలరేమో చూడాలి…