కూరగాయల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు.. ఆ తప్పు ఎవరిది ?

By KTV Telugu On 22 December, 2022
image

ఏది తినేటట్టు లేదు.. ఏది కొనేటట్టు లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసరాలు చక్కునంటుతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా మార్కెట్లలో కూరగాయల రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉంటే కొండంత లేకపోతే గోరంత అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అనంతపురం, కర్నూలు సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల టమాట కిలో అర్థరూపాయిల కూడా పోక రైతులు రోడ్ల మీద పడేసి పోతున్నారు. అదే టమాట సామాన్య వినియోగదారులు కొనడానికి భయపడే స్థాయిలో రేట్లు పెరిగిన సందర్భాలున్నాయి. రామములగ వంద రూపాయలు పలికిన రోజుల్లో కస్టమర్ల ఫేస్ కలర్ పోయిన సందర్భాలూ అనేకం. ఒక్క టామట మత్రమే కాదనుకోండి ఆలు, ఉల్లి, బీన్స్, వంకాయ, క్యారెట్, కాలిఫ్లవర్ ఏదైనా సరే రేట్ల హెచ్చుతగ్గులకు అదుపు అడ్డూ ఉండటం లేదు. ఇందులో మార్కెట్ దళారీల పాత్ర ఉన్న మాట వాస్తవమే అయినా ద్రవ్యోల్బణ రేటుతో పాటు ప్రభుత్వ ద్రవ్య విధానం కూడా కారణమని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

రాబోయే వార్షిక బడ్జెట్ ఎలా ఉంటుందనే చర్చ సందర్భంగా ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు పూనమ్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూరగాయల ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసేందుకు మానిటరీ పాలసీని వాడుకోవడం మూసవిధానమే అవుతుందని పూనమ్ గుప్తా అభిప్రాయపడ్డారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో కూరగాయల ధరల నియంత్రణకు వేరు మార్గాలున్నా ద్రవ్య విధానం ఆధారంగా అంచనాలు వేయడమేమిటన్న ప్రశ్నను ఆమె లెవనెత్తిన పరిస్థితుల్లో అసలు కూరల రేట్లు ఎప్పుడు, ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకోవడం కూడా అనివార్యమవుతుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి చేయాల్సిన చర్యలను కూడా చర్చించక తప్పదు.

ఆహార ధాన్యాలు, కూరగాయల రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగా భారత ఆర్తిక వ్యవస్థ వత్తిడికి గురి కావడం ప్రతీ ఏటా జరుగుతున్నదే. ధరలు బాగా పెరిగినప్పుడు వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతుంటే ధరలు బాగా తగ్గినప్పుడు దివాలా తీసిన రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకుంటేనే ధరల హెచ్చుతగ్గులను అంచనా వేసుకునే వీలుంటుంది. గత ఎనిమిదేళ్ల కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం లోపే. ఖచితంగా చెప్పాలంటే 8 పాయింట్ ఆరు శాతంలోపే ఉంటోంది. కూరగాయల ద్రవ్యోల్బణం మాత్రం నియంత్రణ కోల్పోయి 60 శాతానికి చేరిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ధరలు బాగా తగ్గినప్పుడు అది మైనస్ 22 అంటే డీఫ్లేషన్ స్టాయికి పడిపోయిందని తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. అలాంటి సందర్భాల్లో రైతులకు పెట్టుబడిలో పది శాతం కూడా రావడం లేదు.

ఒక ఏడాది ధరలు బాగా తక్కువగా ఉంటే మరుసటి ఏడాది విపరీతంగా పెరిగిపోవడం నిత్యకృత్యమైంది. ఈ విష విలయం ప్రతీ రెండేళ్లకోసారి పునరావృతమవుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో అస్థిరతకు కారణమవుతోంది. శిఖరాగ్రంలో ఉన్న ద్రవ్యోల్బణానికి, అథపాళానికి చేరిన డీ ఫ్లేషన్ కు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటోంది. మనకు సులభంగా అర్థమయ్యే టమటాల రేట్లలో మాత్రమే కాకుండా అన్ని కూరగాయల్లోనూ ఈ ఇన్ ఫ్లేషన్ డీఫ్లేషన్ సృష్టించిన అంతరం ప్రతీ ఏటా కనిపిస్తూనే ఉంటుంది. 2015లో ఎనిమిది శాతం ఉన్న క్యారేట్ ద్రవ్యోల్బణం 2017 నాటికి 50 శాతానికి చేరింది. అంటే ధరలు ఎంత మేర పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.

ఒక ప్రాంతంలో నెలను బట్టి కాలాన్ని బట్టి కూరగాయల రేట్లు మారుతూ ఉంటాయి. వేసవి నెలలైన మార్చి నుంచి మే వరకు కూరల రేట్లు కనిష్టంగా ఉంటాయని దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలు చెబుతున్నాయి. నైరుతీ రుతుపవనాల ఆగమనంతో జూన్ సెప్టెంబరు మధ్య క్రమంగా రేట్లు పెరగడం మొదలవుతోంది. శీతాకాలనికి రేట్లు ఆకాశంలో ఉంటాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ధరలను అదుపు చేయడం ఎవరి వల్లా కావడం లేదు. శీతాకాలం చివరి నాటికి జనవరి, ఫిబ్రవరిలో కూరల ధరలు తగ్గడం మొదలువుతుంది. ఈ ప్రక్రియ ప్రతీ సంవత్సరం మన కంటికి కనిపించేది. ఖరీఫ్, రబీ పంటల సీజన్ కు ధరలకు విడదీయరాని సంబంధం ఉందని చెప్పక తప్పదు. ఇందులో డిమాండ్ సప్లై సిద్ధాంతం కూడా పనిచేస్తుందడనంలో సందేహం లేదు. ఒక సారి పంటలు బాగా వస్తే మార్కెట్లోకి కూరగాయలు విపరీతంగా వచ్చి పడతాయి. అప్పుడు సరఫరా పెరిగి డిమాండ్ తగ్గి స్వతహాగానే ధరలు పడిపోతాయి.

ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా కూరగాయల ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతుందనేందుకు వెనుకాడాల్సిన పని లేదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థీరీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోవడం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదంగా చెప్పుకోవాలి. భారీగా కోల్డ్ స్టోరేజీల వ్యవస్థను సృష్టించగలిగి ఉంటే నామమాత్ర రుసుము చెల్లించి రైతులు వాటిని నిల్వ ఉంచుకునే అవకాశం కలిగేది. 15 నుంచి నెల రోజుల తర్వాత సరఫరా తగ్గినప్పుడు వాటిని బయటకు తీసి విక్రయిస్తే సహేతుకమైన ధర లభించి రైతులకు గిట్టుబాటు అయ్యేది. దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నందునే రైతులు మునిగిపోతున్నారు. రైతు బజార్ల వ్యవస్థ ఫెయిల్ కావడం కూడా అన్నదాతలకు ఇబ్బందిగా పరిణమించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటే సమాజానికి మంచిది.