విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీగానే ఎందుకు కొనసాగుతోంది. నిజంగానే ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారా.. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారా. బోస్ మరణ మిస్టరీని తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదా.. బోస్ తనయ అనితా బోస్ ఏమంటున్నారు…
చరిత్రలో కొన్ని సుదీర్ఘ మిస్టరీలుగానే కొనసాగుతాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన సుభాష్ చంద్రబోస్ మరణం కూడా అలాంటిదే. 1945 ఆగస్టు 18న సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నప్పటికీ దానిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. ఈ చిదంబర రహస్యాన్ని ఛేదించేందుకు వరుసగా వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించినట్లే కనిపించినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్లుగా ఉంది. స్వాతంత్ర వజ్రోత్సవ వేళ మరోసారి బోస్ డెత్ మిస్టరీ తెరపైకి వచ్చింది. జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న బోస్ చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని జర్మనీలో ఉంటున్న ఆయన తనయ అనితా బోస్ కోరుతున్నారు. 77ఏళ్లుగా బోస్ జీవితంపై నెలకొన్న ఈ మిస్టరీని తేల్చడంతోపాటు అస్థికలను భారత్‌కు తెప్పించడమే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పుకున్నారు. త్వరలోనే భారత్, జపాన్ ప్రభుత్వాలను ఆమె సంప్రదిస్తారు. బోస్ వ్యవహారంలో ప్రభుత్వాల తీరుపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు….
ఒడిశాలోని బెంగాలీ కుటుంబంలో పుట్టిన బోస్… తొలుత మితవాదిగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ… స్వాతంత్రం కోసం పోరాడారు. రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ.. అహింసావాదాన్ని ప్రోత్సహించారు. ఒక దశలో అహింసతో తమ ధ్యేయం నెరవేరదని గ్రహించి… సాయుధ పోరాటం వైపు పయనించారు. జర్మనీ నియంత హిట్లర్ తనను ఆదరించి. సహాయం చేస్తారని నమ్మి జర్మనీ వెళ్లారు. అక్కడి మహిళను పెళ్లిచేసుకోవడంతో అనితా బోస్ పుట్టారు. సింగపూర్ కేంద్రంగా భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసినప్పటికీ…. అడుగు ముందుకు పడలేదు. తన ప్రయత్నాలు కొనసాగుతుండగానే అనుమానాస్పద మరణానికి లోనయ్యారు…
1945, ఆగస్టు 18న తైవాన్‌లోని తైపి దగ్గర విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించారనే వాదన ఉంది. నేతాజీకి చెందినవిగా చెబుతోన్న చితాభస్మం నింపిన పాత్రను 1945 సెప్టెంబరు నుంచి జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు. ఈ క్రమంలో ఆయన మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు దర్యాప్తు కమిషన్లు వేసింది. గతంలో కాంగ్రెస్ హయాంలలో ఏర్పాటు చేసిన షా నవాజ్ కమిషన్ ఖోస్లా కమిషన్ లు నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారని తేల్చాయి. విదేశాల్లో పర్యటించి వచ్చిన తర్వాతే ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాయి. తొలి ఎన్డీఏ ప్రభుత్వం 2000 సంవత్సరం ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ మాత్రం ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదని నివేదించింది. ముఖర్జీ కమిషన్ తన నివేదికను 2006లో పార్లమెంట్‌కు సమర్పించింది. దీనితో నేతాజీ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని, సన్యాసిగా తిరుగుతున్నారని, రష్యా ప్రభుత్వం జైల్లో ఉంచిందని, ఇలా ఎవరికి వారు తమకు తోచిన విధంగా కథలు అల్లారు. 1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాదులో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారు వేషంలో ఉన్నది బోస్ అంటూ కొందరు ప్రచారం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత విచారణ జరపగా అది నిజం కాదని తేలిపోయింది…
2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించినట్లే కనిపించింది. 2016 జనవరిలో బోస్ కుటుంబ సభ్యులు, బంధువులను ఆయన తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. బోస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 119 రహస్య పత్రాలను కేంద్రప్రభుత్వం బహిర్గతం చేసింది. బోస్ చితాభస్మం రెంకోజీ ఆలయంలో ఉందని నమ్ముతున్నందునే… నేతలు జపాన్ పర్యటించినప్పుడు దాన్ని సందర్శిస్తున్నారు. అయితే మోదీ ప్రయత్నాలు ఎటు వెళ్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా అస్తికలు భద్రపరిచేందుకు భారత ప్రభుత్వం అద్దె కూడా చెల్లిస్తోంది. ప్రభుత్వం భయపడుతోందని అందుకే చితాభస్మాన్ని తీసుకురావడం లేదని బోస్ కుటుంబ సభ్యులు ఆరోపించి సందర్భాలు ఉన్నాయి…
వేర్వేరు దేశాల్లో ఉన్న బోస్ ఫైల్స్ ను బహిర్గతం చేసి వాటిని క్రోడీకరిస్తే అసలు మిస్టరీ బయటపడుతుందని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 1976లో భారత ప్రభుత్వం బోస్ చితాభస్మాన్ని తెచ్చేందుకు ప్రయత్నించింది. బోస్ మరణించినట్లు ప్రభుత్వమే అంగీకరించినట్లవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడం, బెంగాల్లో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని చెప్పడంతో వెనుకడుగు వేశారు. చితాభస్మాన్ని తీసుకురావాలని 2007లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రయత్ని్ంచినా ఎందుకో జడిశారు. ఈ సారి అనితా బోస్ అభ్యర్థనకు మోదీ స్పందిస్తారో లేదో చూడాలి…