రచ్చ గెలవాలంటే ముందు ఇంట గెలవాలి.. ఈ విషయం రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఎన్నో ఢక్కామొక్కీలు తిని.. చాణక్య రాజకీయం చేసే కేసీఆర్ లాంటి వారికి అసలు అవసరం లేదు. కానీ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి.. తెలంగాణలో పార్టీపై ఇటీవల కేసీఆర్ శ్రద్ద తగ్గించినట్లుగా కనిపిస్తోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇతర పార్టీలు తమ ఆకర్ష్ ప్రయోగాలు టీఆర్ఎస్‌పై ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఓ జడ్పీ చైర్‌పర్సన్‌నే చేర్పించేసుకుంది. బీజేపీ నేతలు కూడా అదే పనిలో ఉన్నారు. పార్టీలో చేరికలు వస్తే ఎంత ఊపు ఉంటుందో.. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతే అంతే వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ అలాంటి పరిస్థితిలోకి వచ్చింది.
కారులో ఇప్పటికే నేతలు ఓవర్ లోడ్ !
తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ కావాలని కేసీఆర్ ఇతర పార్టీల నేతల్ని విస్తృతంగా టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ జరిగింది. రాజకీయాల్లో ఊరకనే పార్టీలు మారరు. వారికి ఏదో ప్రతిఫలం అందాలి. అలాంటి ప్రతిఫలం ఆఫర్ చేసి మరీ… కేసీఆర్ వారందర్నీ పార్టీలో చేర్చుకున్నారు. చాలా మందికి అలాంటి ప్రతిఫలం దక్కింది. కొంత మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న మొన్నటిదాకా ఎవరూ పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇచ్చినా 2018లో కూడా ఎవరూ పెద్దగా బయటపడలేదు. ఎందుకంటే అప్పటికి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ఉందని ఎవరూ అనుకోలేదు. అందుకే వచ్చిన అవకాశాలు.. ఇచ్చిన చాన్సులతో సరిపుచ్చుకున్నారు.
ఇప్పుడు ఇతర పార్టీల నుంచి భారీ ఆఫర్లు !
అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు గతంలోలా లేవు. ఇప్పుడు నేతలకు చుట్టుపక్కల అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వారిలో అసంతృప్తి బయటకు వస్తోంది. అలా చేరిన నేతల్లో చాలా మంది మంచి పదవుల్లో ఉన్నారు. వారి చేరిక వల్ల అవకాశాలు కోల్పోయిన నిఖార్సైన టీఆర్ఎస్ నేతల్లోనూ ఇంకా అసంతృప్తి పెరిగింది. ఇలాంటి వారినందర్నీ తమ వైపుకు చేర్చుకోవాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి నల్లాల ఓదెలు టీఆర్ఎస్‌లో పని చేశారు. ఆయన అసంతృప్తిని గుర్తించిన కాంగ్రెస్ నేతలు … ఆపరేషన్ అమలు చేశారు. పార్టీలో చేర్చేసుకున్నారు. ఇప్పటికే చాలా మందితో చర్చలు జరుపుతున్నామని చెబుతున్నారు. పార్టీ మారిన కొంత మంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చినట్లుగా కనిపిస్తూండటంతో… ఇతర నేతల్లో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లారని అనేక పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
కేంద్ర అధికారం అండతో బీజేపీ కూడా !
ఏ పార్టీలో ఎక్కువ చేరికలుంటే ఆ పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తుందన్న ఉద్దేశంతో బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉండటంతో అడ్వాంటేజ్ తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ప్రచారం చేసుకున్నారు, కానీ ఎవరూ చేరలేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు చేరుతారని చెప్పుకున్నారు. కానీ వారి వ్యూహం వేరేగా ఉంది. బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి కలిసి కొత్త పార్టీ పెడతారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే వీరందర్నీ బీజేపీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పలువురితో చర్చలు జరుపుతున్నారు. వాళ్లూ..వీళ్లు చేరబోతున్నారని మీడియాకు లీకులు ఇస్తున్నారు.
టీఆర్ఎస్‌లో ప్రతి నియోజకవర్గంలోని విభేదాలు !
కారు ఇప్పటికే ఓవర్ లోడ్ అయింది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ విబేధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి.. ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరిన చోట పరిస్థితి మరింత సీరియస్‌గా ఉంది. తాండూరు వంటి చోట్ల రోడ్డెక్కుతున్నారు. ఇలాంటివి ఇతర పార్టీలకు అవకాశాల్లాంటివి. వెంటనే… ఇతర పార్టీల నేతలు అలాంటి వారికి టచ్‌లోకి వెళ్లిపోతున్నారు.
కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా ?
తెలంగాణలో పార్టీ గురించి కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదు. జాతీయ రాజకీయాలపైనే ఆయన దృష్టి పెట్టారు. ఢిల్లీ వెళ్తున్నారు. నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కే అన్ని బాధ్యతలు ఇచ్చేశారు. కేటీఆరే సర్దుబాటు చేస్తున్నారు. అయితే కేసీఆర్ సూపర్ విజన్ లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం అలాంటి జోక్యం కూడా చేసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు. కేటీఆర్ ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్నారు. తర్వాత దావోస్ వెళ్తారు. కేసీఆర్ ఢిల్లీకి కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రయత్నాలు మరింత జోరందుకున్నాయి. చేరికలు ఎక్కువగా అయితే మరింత పాజిటివ్ వేవ్ వస్తుంది. దీని కోసం బీజేపీ, కాంగ్రెస్ రెండూ టీఆర్ఎస్ నేతలపైనే కన్నేశాయి. ఈ పరిస్థితుల కారణంగానే తెలంగాణలో పార్టీని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆందోళన టీఆర్ఎస్ క్యాడర్‌లో కనిపిస్తోంది.