తెలంగాణలో ఇన్ని పార్టీలా ? ఎవరి వ్యూహం ఏంటి !?

By KTV Telugu On 21 May, 2022
image

తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. వరుసగా కొత్త పార్టీలు తెరపైకి వస్తున్నాయి. వన్ బై వన్ తామున్నామంటూ రాజకీయాలు చేస్తున్నాయి.  ఇన్ని పార్టీలు ఎందుకు వస్తున్నాయో సామాన్య జనానికి అర్థం కావడం లేదు. రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ అన్ని పార్టీల నేతలను టీఆర్ఎస్ చేర్చుకున్నారు. ఈ కారణంగా టీడీపీ అంతర్థానం అయింది. కాంగ్రెస్ బలహీనపడింది. కానీ ఇప్పుడు ఒక్క సారిగా సీన్ మారిపోయింది. బిలబిలమంటూ రాజకీయ పార్టీలు తెర మీదకు వస్తున్నాయి. జనాల్లో హడావుడి చేస్తున్నారు. ఇంతకూ ఈ పార్టీల తెర వెనుక ఏం జరుగుతోంది ? ఎవరి రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ పార్టీలు పుట్టుకొస్తున్నాయి ?

షర్మిల పార్టీతో ప్రారంభం !

తెలంగాణ ఉద్యమం జరిగింది స్వయం పాలన కోసం. ఫలితం సాధించింది. ఇప్పుడు ఎవరైనా ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో పార్టీ పెడతారని అనుకుంటారా? కానీ షర్మిల అలా చేశారు. ఏపీ నుంచి వచ్చి షర్మిల రాజకీయ పార్టీ పెట్టారు. పోవాలి దొర రాజ్యం.. రావాలి రాజన్న రాజ్యం అంటూ పాదయాత్ర చేస్తున్నారు. తనను చూస్తే వైఎస్ గుర్తొస్తారని.. అందుకే ప్రజలు గుండెల్లో పెట్టుకుటారన్న నమ్మకంతో ఉన్నానని షర్మిల చెబుతున్నారు. అయితే ఆమెకు ప్రజల్లో ఎంత ఆదరణఉందో తెలియడం లేదు కానీ… ప్రయత్నాలు మాత్రం సీరియస్‌గా చేస్తున్నారు. చాలా ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. షర్మిల పార్టీ వెనుక ఎరున్నారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు కానీ.. ఐదారు శాతం ఓట్ల వరకూ చీల్చినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆమెకు క్రిస్టియన్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. బ్రదర్ అనిల్ కు చర్చిల సపోర్ట్ ఉంది.

షెడ్డు నుంచి పార్టీని బయటకు తీసిన కేఏ పాల్ !

ప్రజాశాంతి పార్టీని షెడ్డులో పెట్టేసి అమెరికా వెళ్లిపోయిన కేఏ పాల్ తర్వాత వచ్చి తెలంగాణలో రాజకీయం ప్రారంభించారు. ఆయన ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. బీజేపీ నేతలతో భేటీ అయి ఇష్టం వచ్చినట్లుగా కేసీఆర్ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. ఆయన వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు అక్కడే ప్రారంభమవుతున్నాయి. కేఏపాల్‌ను ఎంత తీసి పడేసినా.. రెండు, మూడు శాతం ఓట్లయినా చీలుస్తారన్న అంచనా ఉంది. ఎందుకంటే ఆయనకూ క్రిస్టియన్ బ్యాక్ గ్రౌండ్ ఉంది.

బీఎస్పీని ముందుకు తీసుకొచ్చేందుకు ప్రవీణ్ ప్రయత్నం !

ఐపీఎస్ పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన స్వేరో ప్రవీణ్ కుమార్ .. తర్వాత కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారు. కానీ బీఎస్పీలో చేరిపోయారు. ఆయన చురుకుగా తిరుగుతున్నారు. ఆయన స్వేరో బయట పెద్దగా కనిపించదు కానీ.. భావజాలం మాత్రం విస్తృతంగా వ్యాపింప చేశారు. ఆయనను తక్కువగా అంచనా వేయలేమన్న అభిప్రాయం రాజకీయ పార్టీల్లో ఎక్కువగా ఉంది. అంతర్గతంగా ఆయన ప్రభావంపై చర్చలు జరుగుతున్నాయి.

తీన్మార్ మల్లన్నదీ అదే బాట !

జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ మల్లన్నది కూడా సొంత రాజకీయ పార్టీ బాటే. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అనుచర గణం ఉంది. కానీ తర్వాత కేసుల పాలై… బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీని కూడా వదిలేస్తున్నారు. మళ్లీ సొంత ఆందోళనలు చేపడుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన కూడా సొంత పార్టీ పేరుతో రాజకీయం చేయనున్నారు.

కొత్త పార్టీ పెడతానంటున్న బీసీ కృష్ణయ్య, విశ్వేశ్వర్ రెడ్డి !

తాము కూడా కొత్త పార్టీలు పెడతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య కూడా ఇప్పటికే ప్రకటించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ది కూడా అదే ఆలోచన. వీరు కూడా వేర్వేరుగా రాజకీయ పార్టీలు పెట్టబోతున్నారు. ఇంకా ఎన్ని రాజకీయ పార్టీలు తెర ముందుకు వస్తాయో కానీ..  ఇప్పటికే తెలంగాణ పొలిటికల్‌గా ఓవర్ లోడ్ అయిపోతోంది. దీని వల్ల ఎవరికి నష్టం జరగబోతోంది.. ఎవరి ఓట్లు చీలబోతున్నాయి.. అసలు వీరందరికి సపోర్ట్ ఎవరు అన్నది మాత్రం బయటకు రావడం లేదు.