అమ్మ పాలు స్వచ్ఛమే.. ఆ ఆహారంతోనే ప్రమాదం
అమ్మపాలు అమృతం. తల్లి గర్భంనుంచి ఊపిరిపోసుకునే ప్రతీ ప్రాణానికీ తల్లిపాలే శ్రీరామరక్ష. కానీ ఆ తల్లిపాలు కూడా కలుషితమవుతున్నాయి. ఇటలీ బృందం పరిశోధనలో బయటపడ్డ విషయాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల తల్లి పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. దీంతో తల్లిపాలు శ్రేష్టమని చెప్పాలా వద్దా అన్న సందిగ్ధం మొదలైంది. ఎందుకంటే ప్లాస్టిక్ కణాలున్న పాలతో ప్రయోజనాలకంటే ప్రమాదమే ఎక్కువ.
ఇంతవరకు సుమారు 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను కణతంతుల్లో, జంతువుల్లో, సముద్ర జీవుల్లో పరిశోధకులు గుర్తించారు. చనిపోయిన వాటిపై పరిశోధనలు జరిపినప్పుడు ఈ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇప్పుడు గర్భిణుల్లో ప్లాస్టిక్ కణాల గుర్తింపుతో శాస్త్రవేత్తలు అప్రమత్తం అయ్యాయి. గర్భధారణ సమయంలో ప్లాస్టిక్వాటిల్లో ఇచ్చే ఏ ఆహారాన్ని కూడా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
కొన్ని రకాల ఆహారంతోనే శరీరంలోకి ప్లాస్టిక్ కణాలు చేరుతున్నాయి. మనుషుల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయి. అందుకే గర్భిణులు పాలు, సీ ఫుడ్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్లాస్టిక్‌తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్‌లు, సింథటిక్ ఫ్యాబ్రిక్ దుస్తులు వాడొద్దని గర్భిణి మహిళలకు శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. కాలుష్యం, కలుషిత ఆహారంతో ఎంత ప్రమాదమో అర్ధమైందిగా..పారాహుషార్.