ఉదయమే త్వరగా పనైపోతుందని నుడుల్స్ తిన్నారా… రుచి కోసం చిప్స్ నంజుకున్నారా…. పిల్లల్ని బడికి పంపుతూ రెండు కేకులు టిఫిన్ బాక్స్ లో వేసి పంపారా.. ఆఫీసుకెళుతూ.. ఫ్రిజ్లోంచి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసి వండుకుని వెళ్లారా… దారిలో ప్రొటీన్ బార్ నములుతూ ఎంజాయ్ చేశారా…అయితే మీరు కష్టాలను కొనితెచ్చుకున్నట్లే… మీ ఆయుర్దాయాన్ని తగ్గించుకున్నట్లే… ఎందుకంటారా.. చూడండి మరీ…
సగటు భారతీయుడి జీవితం మారిపోయింది. బద్దకం పెరిగిపోయి త్వరగా పనైపోవాలని ఎదురు చూస్తున్నాడు. మూడు పూటలా వంట చేసుకునే ఒపిక లేక ప్యాకేట్లలో విక్రయించే ఆహార పదార్థాలను తెచ్చుకుని తిసేస్తున్నాడు. రంగు, రుచి, వాసన కోసం టైమ్ దొరికినప్పుడల్లా పాప్ కార్న్ వేడి చేసుకుని తింటూ ఏదో సాధించిన అనుభూతిని పొందుతున్నాడు. రాను రాను ఇడ్లీ, దోసె,చపాతీలు తినాలన్న కోరిక తగ్గిపోయి.. జంక్ ఫుడ్ లోనే ఆనందాన్ని వెదుక్కుంటున్నాడు.ఈ క్రమంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఆహ్వానించేస్తున్నాడు….
ఏవేవో రసాయనాలు కలిపేసి.. ఆహారానికి నిల్వ ఉండే గుణాన్ని పెంచేసి… జనంలోకి వదిలితే వాటిని తిన్న వారికి అనారోగ్యం తప్పదని గుర్తిస్తే మంచిది. ప్రపంచ జనావళికి ఇప్పుడు ఆరోగ్యం పెద్ద సమస్యగా మారింది. ఐదు ప్రాంతాల్లో ఉన్న వాళ్లు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తాజా సర్వేలు చెబుతుండగా.. మిగతా 700 కోట్ల మంది పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జపాన్లోని ఒకినావా, గ్రీస్ లోని ఐకారియా, సార్డీనియాలోని ఓగ్లియాస్ట్రా, కోస్టారికా దేశంలోని నికోయా పెనిన్సులా, కాలిఫోర్నియాలోని లోమా లిండా ప్రాంతాల ప్రజలు వందేళ్ల కంటే ఎక్కువ జీవిస్తున్నారు. ఆ ఐదు ప్రాంతాల ప్రజలు సగటు ఆయుర్దాయం 73 పాయింట్ నాలుగు సంవత్సరాలంటే ఆశ్చర్య పోవాల్సిందే కదా…వాళ్లు సంప్రదాయ వంటలను మాత్రమే తినడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తున్నారని వైద్య పరిశోధకుు తేల్చారు. అక్కడే పండించిన ధాన్యం, కూరగాయలే ఇంట్లో వండుతారు. తరాతరాలుగా వస్తున్న ఆహార అలవాట్లను వదులుకోకుండా కొనసాగిస్తున్నారు. చివరకు గానుక నూనెనే వాడుతున్నారు. మన భారతీయులు మాత్రం స్టోర్స్ కి వెళ్లి ప్యాక్డ్ ఫుడ్ తెచ్చుకుని తింటూ రోగాల బారిన పడుతున్నాం….
మన పూర్వీకులు ఇంటి పెరట్లో దొరికే మూలికలు వాడుతూ ఆరోగ్యంగా ఉండేవారు వంటింటి పోపుల పెట్టెలో దాచిన మసాలాలతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వారు. సంప్రదాయ వంటకాల్లోనూ వైద్యం ఉందని గుర్తించేవారు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి…కూరల్లో వేసుకునే పసుపులో ఉదరకోశ సమస్యల నుంచి బయటపడేసే గుణం ఉందని గుర్తిస్తే మంచిది. యాలకుల్లో దంతక్షయం నుంచి కేన్సర్ వరకు అన్ని రోగాలను నయం చేసే లక్షణం ఉందని గ్రహిస్తే మేలే కదా…. దాల్చిన చెక్కలో కొలెస్ట్రాల్ తగ్గించే అవకాశం ఉంటుంది. ధనియాలు.. జీలకర్ర లాంటివి బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తాయని తెలుసుకోవాలి.మరి ఇవన్నీ ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కాదు కదా..
మన వంటగదిలో ఉండే పోషకాలు పొట్లం కట్టిన ఆహార పదార్థాల్లో ఉండటం లేదని గుర్తించాలి. ప్యాక్డ్ ఫుడ్స్ లో వాడే పదార్థాలు, ప్యాకేజింగ్ చేసున్న విధానం ఆరోగ్యానికి హానికరమని అర్థం చేసుకోవాలి. ప్యాక్డ్ ఫుడ్ లో మూడు హానికారక పదార్థాలుంటాయి. ఆహారాన్ని ఎంతకాలమైనా నిల్వ చేసే గుణం, అధికంగా ఉప్పు వాడకం, ఆహార పదార్థాల రంగులు మనల్ని రోగాల పాలు చేస్తాయి. అందులో వాడే ప్రిజర్వేటివ్స్ కారణంగా దేహంలోని మంచి బ్యాక్టీరియా చచ్చిపోయి, మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. గుండెల్లో కణజాలం దెబ్బతింటోంది. శ్వాసకోశ సమస్యలు వస్తాయి. పిల్లలు మితిమీరిన ఉత్సాహంతో ఉంటే సంతోష పడే తల్లిదండ్రులు తర్వాత వచ్చే సమస్యలను అర్థం చేసుకోలేకేపోతున్నారు. ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలు ఒకటి రెండు వారాలకు మించి నిల్వ ఉండనప్పుడు.. షాపుల నుంచి తెచ్చుకునేవి నెలల తరబడి ఉంటున్నాయంటే అందులోని మర్మం మనమే అర్థం చేసుకోలి…
సాస్, సూపులు, డైరీ మిల్స్, బిస్కెట్లు అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. నెలల తరబడి బిస్కెట్ ప్యాకెట్లు చెక్కు చెదరకుండా ఉంటున్నాయంటే వాటిలో ఎన్ని రసాయనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మైక్రోవేవ్ లో వండుకున్న ఆహారం కంటే..సంప్రదాయ వంటకాలు మంచివని గుర్తించాలి. ఉప్పు కూడా ప్రిజర్వేటివ్ గా పనికొస్తుంది. అందుకనే చిప్స్, ఫ్రెంచ్ ఫ్లైస్ లో ఉప్పు ఎక్కువగా వాడుతున్నారు. తినడానికి రుచిగా ఉన్నా ఉప్పులో నిక్షిప్తమై ఉన్న సోడియంతో రక్తపోటు, పొట్ట కేన్సర్, గుండె జబ్బులు ఖాయం. మనిషి త్వరగా చనిపోవడం అనివార్యం.
ఒక విషయం అర్థం చేసుకోండి, సమోసా తింటే రుచిగానే ఉంటుంది. ఆరోగ్యం గతి తప్పుతుంది. ప్యాక్డ్ ఫుడ్స్ కూడా అంతే. అవి నిల్వ ఉండేందుకు కంపెనీలు తొక్కే అడ్డదారులు అన్నీ ఇన్ని కావు. పైగా వినియోగదారుడిని ఆకర్షించేందుకు వాడే రంగులు కూడా హానికరమే అవుతుంది. అలాగని ఒక్క రోజులో అలాంటి ఆహార పదార్థాలను మానుకోవడం కష్టం. అందుకే దశలవారీగా తగ్గించాలి. ఆ క్రమంలో సంప్రదాయ వంటకాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే .. ఏదోక రోజున జంక్ ఫుడ్ ను పూర్తిగా మానుకునే వీలుంటుంది..