– ఆకలిదప్పులతో చచ్చే దిన్ ముందున్నాయా?
ప్రపంచం సమీప భవిష్యత్తులో ఆకలితో అలమటించబోతోంది. సువిశాల భారత్దేశం కూడా తిండిగింజల కొరత ఎదుర్కోబోతోంది. ఆర్థికమాంద్యం ప్రభావం అప్పుడే కనిపిస్తోంది. మన దేశంలో ప్రజల ప్రధాన ఆహారమైన బియ్యం, గోధుమ నిల్వలు తరిగిపోతున్నాయి. ఐదేళ్ల కనిష్టానికి వాటి నిల్వలు పడిపోయాయి. ఇప్పటికే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతూ సామాన్యుడిని భయపెడుతున్నాయి. ఏ పచ్చడో వేసుకుని తినే అవకాశం కూడా లేకుండా తిండిగింజల కొరత తప్పదన్న సంకేతం అందరినీ వణికిస్తోంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. అయినా వరిసాగువిస్తీర్ణం గణనీయంగా అంటే దాదాపు ఆరేడుశాతం దాకా తగ్గిపోయింది.
ఎఫ్‌సీఐ గోదాముల్లో అక్టోబర్ 1 నాటికి బియ్యం, గోధుమ నిల్వలు 511.41 లక్షల టన్నులకు పడిపోయాయి. స్వయానా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే ఈ విషయాన్ని వెల్లడించింది. 2017 అక్టోబర్ 1 తర్వాత దేశంలో అతితక్కువ ఆహారపదార్థాల నిల్వలు ఇవే. ఏడాదిక్రితం 2021 అక్టోబర్ 1న ఎఫ్‌సీఐ దగ్గర 816 లక్షల టన్నుల నిల్వలున్నాయి. ఇప్పుడవి ఏకంగా 305 లక్షల టన్నులు తగ్గిపోయాయి. కేంద్రప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఎఫ్‌సీఐ గోదాముల్లో ఏడాదిలో ఏ ఒక్కరోజు కూడా గోధుమలు 205.2 లక్షల టన్నులకు తగ్గకూడదు. బియ్యం నిల్వలు బాగానే ఉన్నా అవి కూడా నాలుగేళ్ల కనిష్టానికి పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
కేంద్రప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ నుంచి తప్పుకునే దిశగా అడుగులేస్తోంది. రైతులు పంట ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే అనివార్య పరిస్థితిని కల్పిస్తోంది. మూడ్నెల్లక్రితమే మంత్రి పీయూష్ గోయల్ దేశంలో నాలుగేళ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. నిల్వలు పుష్కలంగా ఉండటంతో రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనలేమని తేల్చేశారు. ఇప్పుడేమో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. ఎఫ్‌సీఐ దగ్గర నిల్వలు తగ్గిపోయాయని అంగీకరిస్తున్నారు.
భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేలా ఉంది. దీంతో సరఫరా వ్యవస్థకు విఘాతం కలుగుతోంది. ప్రపంచం ఆర్థికమాంద్యం అంచున ఉందని వరల్డ్‌బ్యాంక్ అధ్యక్షుడు కూడా హెచ్చరించటంతో భారత ప్రజల ఆహార భద్రత ఆందోళన కలిగిస్తోంది. గోదాముల్లో నిల్వలు తగ్గుతున్నకొద్దీ బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఆహార ధాన్యాల నిల్వలు తగ్గితే వినియోగదారుల ధరల సూచీ పెరుగుతుంది. ఇది మాంద్యానికి దారితీస్తుంది. పరిస్థితి చేజారిపోకముందే కేంద్రప్రభుత్వం కదలకపోతే 137కోట్ల మంది భారతీయులు అన్నమో రామచంద్రా అని అలమటించాల్సి వస్తుంది.