తాము అధికారంలోకిరాగానే రైతు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రకటింటారు. తాము రాగానే ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అంటూ కొన్ని వర్గాలుక ఏపీ పాదయాత్రలో లోకేష్ హామీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకా ఉచిత హామీలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారా. ఉచిత హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు గెలుపొందిన తరవాత మోసం చేస్తున్న విషయం కళ్ల ముందే ఉంది. అయినా ఇంకా అన్ని రాజకీయ పార్టీలనూ ప్రజలు నమ్ముతారా. నమ్ముతారని రాజకీయ పార్టీలే ఆశపడుతున్నాయా.
ఉచితాలు అనుచితమా కాదా అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి ఒకటే మార్గం ఎంచుకుంటుంటున్నాయి అవే ఉచిత పథకాలు. మొన్నటి వరకూ వివిధ రకాల స్కీమ్స్ ప్రవేశ పెట్టేవారు. ఇప్పుడు నేరుగా నగదు బదిలీ అంటున్నారు. కారణం ఏదైనా అంతా ఉచితంగా ఇవ్వడమే కాన్సెప్ట్. గత పదేళ్లుగా ఈ ఒరవడి విపరీతంగా పెరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తాము ఇచ్చిన హామీల్ని నేరవేర్చాయా అని విశ్లేషించుకంటే నెరవేర్చకపోగా పచ్చి మోసం చేశాయని సామాన్యులకైనా అర్థం అయిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆర్థిక నిపుణులు కానవసరం లేదు.
తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో చాలా పథకాల్ని ప్రకటించింది. అందులో రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళలకు సాయం వంటివి ఉన్నాయి. కానీ మళ్లీ ఎన్నికల గడువు సమీపించినా ఆ పథకాలను మాత్రం అమలు చేయలేదు. చేస్తుందన్న నమ్మకం లేదు చేస్తున్నామని చెప్పడానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు. కొంత మందికి చేసి పథకం అమలు చేస్తున్నామన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలోనూ అంతే. అక్కడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో లబ్దిదారులు ఏ నియోజకవర్గంలో కూడా వెయ్యి మంది కంటే ఎక్కువ ఉండరు. ఎంత మందిని అనర్హుల్ని చేయవచ్చో అన్ని నిబంధనలు పెట్టి అమలు చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో అత్యధిక మంది నిరాశకు గురవుతున్నారు. ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు కేంద్రం కూడా ఉంది. రైతులకు ఏడాదికి ఆరు వేలు ఇస్తామని పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. రాను రాను లబ్దిదారుల సంఖ్య తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గించారు. అంటే వచ్చే ఏడాది మరింత మంది తగ్గిపోతారన్నమాట.
రాజకీయ పార్టీలు ఇలా హామీలు ఇచ్చి ఓట్లు పొందుతున్నాయి కానీ అమలు చేయలేకపోతున్నాయి. అరకొరగా కొంత మందికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఉంది. దీనికి కారణం ఆర్థిక పరిస్థితులే. ప్రభుత్వాల దగ్గర ఆదాయానికి కొదవ లేదు. కానీ ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చు పెట్టుకున్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది. ఆదాయం వంద పెట్టుకుని రూ. వెయ్యి పంచుతానంటే ఎలా సాధ్యమవుతుంది. అందుకే ఇవ్వలేకపోతున్నారు. ఇష్టారీతిన అప్పులు చేసి తాత్కలికంగా అనుత్పాదక వ్యయం చేస్తున్నారు. దీని వల్ల పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి కానీ పెరిగే అవకాశం లేదు.
ప్రజలకు కూడా అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు పన్నుల రూపంలో తమ దగ్గర నుంచి వసూలు చేస్తున్న డబ్బులు తమను తాకట్టు పెట్టి చేసుకొస్తున్న అప్పులతోనే తమకు చిల్లర వేస్తున్నారని వారికి అర్థమవుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం ఇలా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఏదైనా ఆర్థిక వ్యవస్థలోకి ఉచితంగా నగదు ప్రవాహం ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు చేసే చేటు ఎంత ఉంటుందో నిపుణులకే తెలుసు. డబ్బులు ఎక్కవై వస్తువులకు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ధరలు పెరుగుతాయి. అదే జరుగుతోంది. దీన్ని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు.
ఓ వైపు ఈ మాత్రం ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడమే కష్టమని తెలిసినా రాజకీయ పార్టీలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇష్టారీతిన ఉచిత హామీలు ఇస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం ఈ హామీలకు స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కానీ ప్రజలు ఆశా జీవులని ఆశ పెడితే వచ్చి ఓట్లు వేస్తారని రాజకీయ పార్టీలు నేతలకు గట్టి నమ్మకం. అందుకే తెలంగాణలో జీతాలివ్వలేకపోతున్నారని అంటున్న బీజేపీ, కాంగ్రెస్ తాము వస్తే లెక్కలేనన్ని ఉచిత హామీలిస్తామని అంటున్నాయి. ఏపీ మరో శ్రీలంక అవుతుదని చెబుతున్న టీడీపీ తాము వస్తే జగన్ కన్నా రెట్టింపు స్కీములిస్తామని అంటున్నారు. ప్రజలు అంతమంగా మేలుకుంటే ఈ రాజకీయ పార్టీల ఉచిత ఆటలకు అడ్డుకట్ట పడుతుంది.