ప్రభుత్వంపై మరింత దూకుడు పెంచిన పవన్
అడ్డుకున్న ప్రయత్నాల్లో జగన్ సర్కార్
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై రచ్చ రచ్చ
ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ వార్నింగ్
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేనగా సాగుతున్న రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వం లక్ష్యంగా మరో పోరాటానికి సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతల అంశం రచ్చరచ్చ అవుతోంది. మంగళగిరి నుంచి ఇప్పటం బయలుదేరిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసు వలయాన్ని ఛేధించుకొని పవన్ ఇప్పటం చేరుకున్నారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ పై ఆగ్రహంతో ఊగిపోయిన జనసేనాని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కరెక్ట్ అంటూ రెచ్చిపోయారు. రోడ్లపై గుంతలు పూడ్చరు గానీ రోడ్ల విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూలుస్తారా అంటూ పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ గూండాలు ఇలాగే ప్రవర్తిస్తే ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. అత్యాచారాలు చేస్తున్న వారిని వదిలేస్తూ కూల్చివేతలకు పాల్పడిన వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ పవన్ ఫైర్ అయ్యారు. కూల్చివేతలకు పాల్పడుతున్న ప్రభుత్వం కూలిపోవడం తథ్యమంటూ పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు సిద్ధమవుతున్న జనసేనాని ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో పవన్ పర్యటనలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. విశాఖలో మాదిరే ఇప్పటం వెళ్లకుండా పవన్ ను పోలీసులు మంగళగిరిలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కాలినడికన కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లిన పవన్ కల్యాణ్ ఆతర్వాత తన వాహనంలో ఇప్పటం చేరుకున్నారు. కూల్చిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. గొడవ ఎక్కడ మొదలైందంటే… జనసేన మీటింగ్ కోసం స్ధలం ఇచ్చిన ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఆ మొత్తంతో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకున్నారు. అయితే రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో అధికారులు పలు ఇళ్లను కూల్చేయడం వివాదాస్పదమైంది. ఆ ఇళ్లన్నీ టీడీపీ, జనసేన సానుభూతిపరులవిగా చెబుతున్నారు. జనసేన సభ కోసం స్థలం ఇచ్చినందుకే గ్రామస్తులపై ప్రభుత్వం కక్ష కట్టిందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభాల ఎపిసోడ్ దుమారం రేపుతోంది. మోడీ సర్కార్ ఓ దొంగల ముఠాను పెట్టుకొని ప్రభుత్వాలను పటగొడుతుందంటూ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ వేదికగా వీడియోలను బయటపెట్టారు. అంతకుముందే విడుదలైన ఆడియో ప్రకంపనలు సృష్టించింది. తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ లతో పాటు ఏపీ కూడా వీరి హిట్ లిస్టులో ఉందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కూల్చేయడమే కరెక్ట్ అంటూ వైసీపీపై చేసిన కామెంట్స్ ఆంధ్రా రాజకీయాలను మరింతగా కుదిపేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ పార్ట్ నర్ గా ఉన్నారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఆయన చంద్రబాబు పంచన చేరినప్పటికీ కాషాయపార్టీతో ఇంకా తెగదెంపులు మాత్రం చేసుకోలేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఈమూడు పార్టీలు జతకట్టే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ దుందుడుకు చర్యలు ఒక్కోసారి ఆయనకు మైనస్ గా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ తనపై రెక్కీ నిర్వహిస్తోందంటూ జనసైన్యం ఆరోపణలు గుప్పించి అభాసుపాలైంది. చంద్రబాబు కూడా చంపేస్తారా అంటూ పవన్ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. అయితే అదంతా ఉత్తదే అని తెలంగాణ పోలీసులు తేల్చేయడంతో తెల్లమొహం వేశారు .