పవన్ ఓడించాలనుకుంటున్నారా ? గెలవాలనుకుంటున్నారా ?

By KTV Telugu On 18 March, 2022
image

పవన్ కల్యాణ్ గెలవలేకపోవచ్చు కానీ ఓడిస్తానని చాలా గొప్పగా చెప్పేవారు. గత ఎన్నికలకు ముందు టీడీపీతో సవాల్ చేస్తూ తాను గెలవకపోయినా ఓడిస్తానని సవాల్ చేసి .. కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. ఆయన గెలవలేదు కానీ ఆయన సవాల్ చేసినట్లుగా టీడీపీ ఓడిపోయింది. కొన్ని సీట్లలో ఆయన టీడీపీని ఓడించారన్నది నిజం. అక్కడ చీలిపోయిన ఓట్లను బట్టి తెలుస్తుంది. అదేసమయంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోయారు. బహుశా ఆయన ఉద్దేశం తాను ఎమ్మెల్యేగా గెలుస్తాను కానీ.. పార్టీ ఓడిపోవచ్చు అని… కానీ నిజానికి ఆయనకూడా ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ముందుకు మరోసారి అలాంటి చాయిస్ వస్తోంది.. అదే ఓడించడమా..? గెలవడమా ?

Pawan Kalyan

పవన్‌ కల్యాణ్‌ది నిర్ణాయక శక్తి !

రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండు కావు. ఒక్కో సారి సున్నా అవుతాయి. ఒక్కో సారి పదకొండు అవుతాయి. జనసేన కూడా అలాంటిదే. ఆ పార్టీతో ఎవరితో కలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో లెక్క వేరేగా ఉంటుంది. ఆ పార్టీకి ఆరు శాతం ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ ప్రజల్లోకి వచ్చినా రాకపోయినా ఆయనకు ఓటేసేవారు ఉన్నారు. ఆ ఆరు శాతం నిర్ణాయక శక్తి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వైసీపీకి యాభై శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి నలభై.. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. కానీ జనసేన – టీడీపీ కలిసి ఉంటే పరిస్థితి మారిపోయేదనేది ఎక్కువ మంది చెప్పేమాట. ఎలా చూసినా జనసేన నిర్ణయాక శక్తి . ఎప్పుడంటే… సరైన జోడితో కలసినప్పుడు మాత్రమే .

బీజేపీతో కలిస్తే ఎంటి ? ఒంటరిగాపోటీ చేస్తే ఏంటి ?

తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి పోటీ చేసింది. ఫ్లాప్ షో చేసింది. గత ఎన్నికల్లో బీజేపీకి ఇరవై వేల ఓట్లు వస్తే.. జనసేన మద్దతుతో 55వేల ఓట్లు సాధించింది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. మోడీ చరిష్మాలు.. హిందూత్వ వాక్యాలు… ఆలయాలపై దాడులు ఇలా అన్నింటిని ప్రయోగించినా… చివరికి దక్కింది అదే. అంటే.. బీజేపీ -జనసేన పొత్తును ఎవరూ పట్టించుకోవడం లేదనే అర్థం. బీజేపీకి వచ్చిన ఓట్లతో పాటు జనసేన ఓటర్లలో కొంత మంది బీజేపీకి ఓటేశారు. చాలా మంది వేయలేదు. ఆ కూటమి ఎక్కడ పోటీ చేసిన వైసీపీ గెలుపు కోసం ఓట్లు చీల్చడానికి… పోటీ చేస్తున్నట్లుగా ప్రజలు భావించే పరిస్థితి ఉంది. అదే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే అంత కంటే ఎక్కువే ఓట్లు సాధించేవారనడంలో సందేహం లేదు.

actor-pawan-kalyan

గెలవాలంటే కలవాల్సిన పరిస్థితి !

పవన్ కల్యాణ్ బీజేపీతో ఏ ఉద్దేశంతో కలిశారో కానీ అప్పట్నుంచి ఆయన రాజకీయంగా నిర్వీర్యం అయిపోతూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌తో పొత్తును టేకిట్ గ్రాంట్‌గా తీసుకుంటున్నారు. జనసేన పార్టీకి అస్థిత్వమే లేదని.. తమది జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి.. జనసేన తాము చెప్పినట్లుగానే చేయాలన్నట్లుగా ఏపీ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపించింది. కానీ బీజేపీ ఎక్కడా చూపించలేదు. ఇప్పుడు జనసేన ఓడటం.. ఓడించడం… అధికార పార్టీని గెలిపించడం అవుతోంది. బీజేపీకి కావాల్సింది కూడా ఇదే అన్నట్లుగా మారింది.

కింది స్థాయిలో కలసిపోయిన టీడీపీ – జనసేన !

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన నేతలు స్థానికంగా కలసిపోయి పోటీ చేశారు. టీడీపీ – జనసేన స్థానిక నేతలు పొత్తులు పెట్టుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయి. కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తుతో జనసేనకు ఒక్క ఓటు ఎక్కువ రాలేదు. బీజేపీతో పొత్తు పరిస్థితీ అదే. పైగా పవన్ ఫ్యాన్ బేస్‌లో కీలకమైన ముస్లిం వర్గాలు దూరమయ్యాయి. బీజేపీతో వద్ద బాబోయ్ అని క్యాడర్ ఇప్పటికే గొంతెత్తుతోంది.

ఈ సారి ఎన్నికల్లో ఉనికి కాపాడుకోకపోతే జనసేనకు కష్టమే !

సరైనపార్టీతో జత కడితేనే జనసేనకు కాస్త బలం వస్తుందని .. ఈ సారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వస్తుందని లేకపోతే.. మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న అంచనా జనసేనలో ఉంది. కులాల రాజకీయాల్లో కొట్టు మిట్టాడుతున్న ఏపీలో పవన్ సపోర్ట్ ఉంటేనే అధికారంలోకి రాగలమని టీడీపీ కూడా భావిస్తోంది. ఈ పరిస్థితి అంచనా వేసుకుంటేనే ఎవరికైనా భవిష్యత్ ఉంటుంది. తమ బలంతో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. అలా జరగకూడదని…అనుకుంటే.. తమ బలం కూడా తరిగిపోతుందన్న విషయాన్ని జనసేన గుర్తుంచుకుని అడుగు ముందుకేస్తే .. ఉభయతారకంగా ఉంటుందనేది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే తెలిసే విషయం. దీనిపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ?