ఐ నో ఎవ్రీ థింగ్.. అంటే ఏమిటో..

By KTV Telugu On 12 November, 2022
image

ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ మొక్కుబడిగా సాగిందా ? పవన్ చేసిన ప్రతీ ఫిర్యాదుకు అన్ని నాకు తెలుసు అన్నట్లుగా ప్రధాని అడ్డు తగిలారా ? అందుకే ప్రెస్ తో జనసేనాని ఎక్కువ సేపు మాట్లాడలేదా ? పవన్ తో పొత్తుకు మోదీ ఇష్టపడుతున్నట్టా లేదా.

దాచాలన్నా దాగవులే. దాగుడు మూతలు సాగవులే.
అరగంట పైగా సాగిన భేటీలో సాధించిందీ శూన్యమా.
పవన్ ఫిర్యాదులను సీరియస్ తీసుకోని మోదీ
ఐ నో ఇట్ ఆల్సో .. అంటూ దాటవేశారా.

తెలుగు మీడియాలో ఇప్పుడు రాత్రికి రాత్రి రెండు కొటేషన్లు చాలా పాపులర్ అవుతున్నాయి. ఐ నో ఎవ్రీ థింగ్ అనేది ఒకటైతే, ఐ నో ఇట్ ఆల్సో అనేది రెండోది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన్ను కలిసిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై అనేక ఫిర్యాదులు చేశారు. ప్రతీ మాటకు మోదీ నుంచి వచ్చిన సమాధానం అదే  రెండు ఇంగ్లీష్ పదాలతో ఆయన పవన్ ను సరిపెట్టారు, జగన్ ను ఏసేద్దాంలే అనే తీరుపై మోదీ ఎక్కడా స్పందించకపోవడంతో పవన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇదేమిటి నేనెందుకు వచ్చాను, నేనేమి చెబుతున్నాను ఈయన ఇలా ఎందుకు స్పందిస్తున్నారని పవన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు దానితో ప్రెస్ మీట్ ను ఒక్క నిమిషంలో ముగించి వెళ్లిపోయారు. మోదీతో తన భేటీ ఆంధ్రప్రదేశ్ కు మంచి చేస్తుందని కామన్ స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చేశారు.

విశాఖ భూఆక్రమణల నుంచి ఇప్పటం వరకు అన్నీ ప్రస్తావన
పవన్ ను గెలుపు గుర్రంగా బీజేపీ గుర్తించడం లేదా.
బీజేపీ కోర్ కమిటీలో జనసేన ప్రస్తావన రాలేదా.
క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టారా.

మోదీ సమక్షంలో పవన్ కల్యాణ్ అనేక అంశాలను ప్రస్తావించారు. వైసీపీ అరాచకాలను వివరించారు. విశాఖ భూ ఆక్రమణలు, ఆలయాలపై దాడులు, ఇప్పటంలో కూల్చివేతలు ప్రతి అంశాన్ని పవన్ చెబుతున్నప్పుడు మోదీ యథాలాపంగా స్పందించారు. కాసేపటికే జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలోనూ పవన్ ప్రస్తావన వచ్చిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మోదీ దిశా నిర్దేశం చేశారు. వైసీపీ వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్తాయి వరకు ప్రచారం చేసేందుకు ఛార్జ్ షీటు రూపొందించాలని మోదీ ఆదేశించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీపై సంతకాల సేకరణ ప్రారంభించాలన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటితో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు ఊరూరా ప్రచారం చేయాలని సూచించారు.

పవన్ పై బీజేపీ అసంతృప్తిగా ఉందా.
బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కోపంగా ఉందా.
చంద్రబాబు, పవన్ ప్రత్యేక భేటీ కమలానికి నచ్చలేదా.
వ్యూహాత్మకంగా దూరం పెట్టాలని నిర్ణయించిందా.

పవన్ పై బీజేపీ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వలేదంటూ ఆయన రాష్ట్ర బీజేపీని నిలదీసిన తీరు వారికి సుతారమూ నచ్చలేదు. పైగా పవన్ రెచ్చిపోయిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి ఆయనతో భేటీ కావడం కూడా జనంలో రాంగ్ సిగ్నల్స్ ఇస్తోందని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబుతో దోస్తీ పేరుతో పవన్ తమను బ్లాక్ మేయిల్ చేస్తారని అనుమానిస్తోంది. అందుకే దగ్గరకు చేర్చుకున్నట్లే నటిస్తూ పవన్ ను వ్యూహాత్మకంగా దూరం పెడుతున్నట్లు భావిస్తున్నారు. మోదీతో భేటీ టైమ్ లో కూడా పవన్ కు ఎలాంటి హామీ రాలేదు.

పొత్తులపై బీజేపీకి ఆసక్తి తగ్గిందా.
సొంత బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టిందా.
కాస్త ఆలస్యమైనా ఇబ్బంది లేదనుకుంటోందా.

ఏపీలో పొత్తులపై బీజేపీకి ఆసక్తి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఎప్పటికైనా సొంత బలంపై పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అందుకే క్షేత్రస్తాయిలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలను మోదీ ఆదేశించారు. ఇతరులతో చేయి కలిపే కంటే సొంతబలాన్ని పెంచుకోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఆ సంగతి అర్థం చేసుకుని పవన్ బీజేపీకి దూరంగా జరగాల్సిన టైమ్ వచ్చేసిందనుకోవాలి. ఇంకా బీజేపీపై ఆశలు పెట్టుకుంటే మాత్రం కూరలో కరివేపాకులా నిర్వీర్యమైపోవాల్సిందే.