పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనైపోయినట్లేనా ? పార్టీ నేతగా ఆయన వైఫల్యాలను మూటగట్టుకున్నారా ? రెండు ఉప ఎన్నికల్లోనూ ఓటమి రేవంత్ నాయకత్వానికి మచ్చగా మిగిలిందా. ఇప్పుడిక పదవి పోకుండా కాంగ్రెస్ అధిష్టానం మదిలో మంచి పేరు తెచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారా ?
కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీసిన మునుగోడు ఉప ఎన్నిక
పాల్వాయ్ స్రవంతి పరాజయంలో రేవంత్ రెడ్డికి కూడా కష్టాలు
వ్యూహాల్లో రేవంత్ రెడ్డి ఫెయిల్
తిరుగుబాట్లను ఆపలేకపోతున్న పీసీపీ అధ్యక్షుడు
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీసింది. ఓటమి పాలవ్వడంతో పాటు ఆ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. ఒక్కప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలను టీఆర్ఎస్ లాగేసినట్లయ్యింది. ఈ ఓటమితో అభ్యర్థి పాల్వాయ్ స్రవంతి కంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే ఎక్కువ కష్టాలు రాబోతున్నాయి. 2021 జూన్ లో కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయింది. దానితో రేవంతన్న గెలుపు గుర్రం కాదన్న వాదన బలపడుతోంది. ఎన్నికల వ్యూహాల్లో ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు. పైగా పీసీసీలో అసమ్మతి నేతలను, తిరుగుబాటు చేసే బ్యాచ్ ను రేవంత్ కట్టడి చేయలేకపోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు మాట్లాడారని అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని పీసీసీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఇచ్చిన పార్టీకి కష్టాలు
వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అధికార పార్టీలోకి చేరిపోతున్న ఎమ్మెల్యేలు, నిరుత్సాహ పడిపోయిన కేడర్
తెలంగాణ ఇచ్చిన పార్టీగా జనం తమను ఆదరిస్తారని ఎదురుచూసిన కాంగ్రెస్ భంగపడక తప్పలేదు. తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ కే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారు కూడా టీఆర్ఎస్ లో చేరి పోయి పదవులను అనుభవిస్తున్నారు. దానితో పార్టీ డీలా పడిపోయింది. కేడర్ లో జోష్ కనిపించడం లేదు. వారికి దిశానిర్దేశం చేసే వారు లేరన్న అభిప్రాయం కలుగుతోంది.
కాంగ్రెస్లోకి ఆలస్యంగా రేవంత్ ఎంట్రీ
వ్యతిరేకవర్గంలో కోమటిరెడ్డి, శశిథర్ రెడ్డి, దాసోజు శ్రవణ్
సొంత నిర్ణయాలతో ముందుకెళ్తున్నారన్న ఆరోపణలు
పార్టీలో వ్యతిరేకవర్గానిదే పైచేయి ?
కాంగ్రెస్ లోకి రేవంత్ చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదని కాంగ్రెస్ తో చేయి కలిపారు. మల్కాజ్ గిరి లోక్ సభా నియోజకవర్గంలో రేవంత్ గెలవడం ఆయన ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ కు నిదర్శనం. కేసీఆర్ ను ప్రశ్నించే గొంతుక ఒకటి ఉండాలని జనం ఆయనకు ఓటేశారు. అంతవరకు బాగానే ఉన్నా అధిష్టానం ఆయనకు పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టిన తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా పీసీసీలో ఓ వ్యతిరేకవర్గం ఉంటుంది. పైగా బయట నుంచి వచ్చి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి అసమ్మతి ఎక్కువగానే ఉండటం సహజ పరిణామమే అవుతుంది. కోమటిరెడ్డి బ్రదర్శ్ ఏకుకి మేకై కూర్చున్నారు. దాసోజు శ్రవణ్ నేరుగా రేవంత్ పైనే ఆరోపణలు చేస్తూ బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడాయన టీఆర్ఎస్ లో ఉన్నారు. మర్రిశశిథర్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
పదవిని కాపాడుకునేందుకు పాట్లు తప్పవా
సోనియా, రాహుల్ ఆశీస్సులే ప్రధానమా
అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ పదవిలో ఉంటారా
రేవంత్ కు ఇప్పుడే అసలు సమస్య మొదలవుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ఆయన తన పదవిని కాపాడుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అయ్యే అవకాశం వస్తుంది. అది కష్టమైన పని అనిపించినా రాజకీయాల్లో రేపు ఏమి జరుగుతుందో చెప్పలేమన్న సామెతను గుర్తు పెట్టుకుని రేవంత్ పనిచేయాలి. సోనియా, రాహుల్ ఆశీస్సులుంటేనే పదవిలో కొనసాగే అవకాశం ఉండటంతో వారిని ఆయన ప్రస్తుతం పొగడ్తలతో మంచెత్తుతున్నారు. అయినా సరే ఓటమి తెచ్చిన కష్టాల నుంచి గట్టెక్కడం మాత్రం కష్టమేనని చెప్పాలి. పీసీసీ పదవి కోసం కనీసం డజను మంది నేతలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో రేవంత్ ను ఆ పదవిలో కొనసాగించడం కుదరకపోవచ్చు. అలా జరిగితే మాత్రం అదో అద్భుతంగానే పరిగణించాలి. రేవంత్ రెడ్డి మంగళవారం తన జన్మదినాన్ని జరుపుకున్నారు. రాజకీయంగా కూడా ఆయనకు శుభం కలగాలని ఆశిద్దాం.