“పెట్రో” పాపం ఎవరిది ? కేంద్రమేనా రాష్ట్రాలెందుకు తగ్గించడం లేదు ?

By KTV Telugu On 23 May, 2022
image

దేశంలో ఇప్పుడు పెట్రో ధరలపై చర్చ జరుగుతోంది. గత దీపావళి పండుగ రోజు లీటర్‌పై రూ. పది వరకూ తగ్గించిన కేంద్రం.. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో దించింది. కానీ అప్పట్లో తగ్గించినప్పుడు ఉన్న రేటుకంటే ఇప్పుడు లీటర్‌ రూ. ఇరవై పెరిగింది. అది వేరే విషయం. కానీ ఎంత పెంచినా కాస్త తగ్గింపు ఇస్తున్నారు. పెట్రోలుపై పన్నులు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా వసూలు చేస్తున్నాయి. మరి కేంద్రం ఒక్కటే తగ్గిస్తోంది. రాష్ట్రాలు ఎందుకు తగ్గించడం లేదనే వాదన వినిపిస్తోంది. పెంచుతోంది కేంద్రమే కాబట్టి.. కేంద్రమే తగ్గించాలని రాష్ట్రాలంటున్నాయి. అయితే రాష్ట్రాల్లో కూడా వ్యాట్ ఎక్కువగా ఉంది.. రాష్ట్రాలు కూడా తగ్గించాలని ప్రధాని కూడా కోరుతున్నారు. ఇంతకీ పెట్రో పాపం ఎవరిది ? రాష్ట్రాలు మాత్రమే ప్రజలకు అన్యాయం చేస్తున్నాయా ?

భరించలేని స్థాయికి వెళ్లినప్పుడు పెట్రో ధరలు కొంత తగ్గిస్తున్న కేంద్రం !

కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్‌ , డీజిల్ పై  సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. గతంలో  కేంద్రం తగ్గించినప్పుడు బీజేపీ పాలిత, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో కాకపోయినా కొంత తగ్గిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలూ తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. పెట్రో ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోయింది కేంద్రమే కాబట్టి… మరింత ఉపశమనం కూడా కేంద్రమే ఇవ్వాలని తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలు వాదిస్తున్నాయి.  ఏపీ ప్రభుత్వం అయితే ఎవరికి కోపం వస్తుందోనని.. అసలు స్పందించడమే మానేసింది. కానీ తమ వాదన మాత్రం వివిధ విభాగాల ద్వారా తెరపైకి తెస్తోంది. కేంద్రమే ఎక్కువ వసూలు చేస్తోందని.. రాష్ట్రాం కాదని చెబుతోంది.

సింహభాగం కేంద్రమే వసూలు.. తమకు స్వల్పమే నంటున్న రాష్ట్రాలు !

కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్‌లపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో  పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో 1.78 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఇది రెట్టింపు కంటే ఎక్కువైంది. మొత్తం 3.72 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. కారణం కేంద్రం పన్నులు భారీగా పెంచడమే. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాలి. అంటే  అంటే ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 3.72 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాల వాటా కింద కేంద్రం రూ.1,52,520 కోట్ల రూపాయలను చెల్లించాలి.  కానీ  కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది రూ. 19,972 కోట్లు మాత్రమే. ఎందుకంటే కేంద్రం సెస్‌ల రూపంలో ఎక్కువ వసూలు చేస్తోంది. సెస్‌లలో వాటా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పని లేదు.  బేసిక్‌ ఎక్సైజ్‌ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది.  ఈ పద్దు కింద చూపే దాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సెస్సుల రూపంలో వచ్చే దాంట్లో పైసా కూడా రాష్ట్రాలకు దక్కదు. గంపగుత్తగా వచ్చినదంతా కేంద్ర ఖజానాను వెళుతుంది.

కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి తాము వ్యాట్ తగ్గించేది లేదంటున్న రాష్ట్రాలు !

పెట్రో ధరలు ఇప్పటికీ గరిష్ఠంగా ఉన్న రాష్ట్రాల్లో  ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ కూడా టాప్ ఫైవ్‌లో ఉంది.  ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 35.77 శాతం, డీజిల్‌పై 28.08 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. రోడ్ సెస్ అదనం. తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై 35.2శాతం, డీజిల్‌పై 27.3శాతం వసూలుచేస్తున్నాయి. పన్ను పెంచింది కేంద్రం కాబట్టి కేంద్రమే తగ్గించాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కానీ కేంద్రం పన్నులు పెంచిన ప్రతీ సారి రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగింది. పెట్రోల్ రేటు యావరేజ్ గా ఒక 100 రూపాయలు ఉంటే అందులో రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్ 31 శాతం అంటే 31 రూపాయలు టాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అదనపు వ్యాట్ నాలుగు శాతం, రోడ్ సెస్ రూపాయి కూడా ఉన్నాయి. అంటే 36 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. అంటే కేంద్రం రేట్లు పెంచి వంద దాటించడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. గత నాలుగైదేళ్ల కాలంలో రాష్ట్రాలకు పెట్రో టాక్స్‌లపై వచ్చిన ఆదాయాన్ని బయటకు వెల్లడిస్తే వాస్తవం బయటపడుతుంది.