షర్మిలకు మోడీ ఫోన్.. నిజమెంత?

By KTV Telugu On 6 December, 2022
image

గుజరాత్‌ ఎన్నికలైపోయాయి. ఇప్పుడు కమలంపార్టీ దృష్టంతా సౌత్‌పైనే. తెలుగురాష్ట్రాల్లో తెలంగాణ బీజేపీ నెక్ట్స్ టార్గెట్‌. కర్నాటకలో అధికారాన్ని కాపాడుకుంటూనే తెలంగాణలో పాగా వేయాలన్న వ్యూహంతో బీజేపీ ఉంది. కేసీఆర్‌తో కయ్యం మొదలైంది. అది ఎంతదూరం వెళ్తుందో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో తెలీదు. కాంగ్రెస్‌ ఎలాగూ బీజేపీకి అంటరాని పార్టీనే. అందుకే తెలంగాణలో బీజేపీ కొత్త లెక్కలేసుకుంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేవారిని దువ్వుతోంది. వేణ్ణీళ్లకు చన్నీళ్లలా చిన్నాచితకా రాజకీయశక్తులు తమవైపున్నా టీఆర్‌ఎస్‌ని దెబ్బకొట్టొచ్చన్నది బీజేపీ ప్లాన్‌.

వైస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మోడీ ఫోన్‌ చేశారన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. షర్మిలకు స్వయానా ప్రధాని ఫోన్‌ చేయడమేంటని కొందరు హాశ్చర్యపోతున్నా బీజేపీ రాజకీయం తెలిసినవాళ్లకి మాత్రం మ్యాటర్‌ అర్ధమైపోతోంది. తెలంగాణలో పాదయాత్ర చేస్తూ టీఆర్‌ఎస్‌మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు షర్మిల. నర్సంపేటలో షర్మిల యాత్రపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేశాయి. హైదరాబాద్‌లో షర్మిలని అరెస్ట్‌ చేసి జడ్జిముందుకు తీసుకెళ్లేదాకా వెళ్లింది. ఈ పరిణామాల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దేనికైనా రెడీ అంటున్నారు షర్మిల.
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు షర్మిల. షర్మిల పాదయాత్రపై దాడి, ఆమె అరెస్ట్‌ని బీజేపీ ఖండించింది. షర్మిల కమలం వదిలిన బాణంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. అయితే ఎవరికోసమో తానెందుకు యాత్రలు చేస్తానని షర్మిల తిప్పికొట్టారు. మళ్లీ యాత్రకు సిద్ధమయ్యారు. తెలంగాణలో ప్రజాసంగ్రామయాత్రతో బీజేపీ క్యాడర్‌లో బండి సంజయ్‌ జోష్‌ పెంచుతున్నారు. షర్మిలకు సంఘీభావం తెలపటం ద్వారా భవిష్యత్తులో ఆమెను తమవైపు తిప్పుకునే ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకే స్వయానా ప్రధానితోనే మాట్లాడించి మా మద్దతు ఉంటుందనే సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది.

షర్మిలకు మోడీ ఫోన్‌ చేశారన్న ప్రచారంతో టీఆర్‌ఎస్‌ కూడా ఉలికిపడి ఉండాలి. అయితే అటు బీజేపీనుంచిగానీ, ఇటు షర్మిల క్యాంప్‌గానీ మోడీ కాల్‌ని ధృవీకరించకపోవడం అసలు ట్విస్ట్‌. అవును ఆయన మాట్లాడారని షర్మిలన్నా చెప్పాలి. మా ప్రధాని ఆమెను పరామర్శించారని బీజేపీలో పెద్ద నాయకుడెవరన్నా చెప్పాలి. అప్పటిదాకా ఇది అనధికారిక సమాచారమే. అయితే మోడీ ఫోన్‌ ముచ్చట మాత్రం తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది.