ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కాక రేపుతోంది. 12వ తేదీన మోదీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా పలుచోట్ల వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. చేనేతపై విధించిన జీఎస్టీ ని వెనక్కి తీసుకున్న తర్వాతే మోదీ తెలంగాణలో అడుగు పెట్టాలంటూ.. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’ అంటూ ఇతర చోట్ల కూడా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు మోదీ పర్యటనను అడ్డుకుంటామని కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు చేస్తున్న హెచ్చరికలు తెలంగాణలో మరింత కాకరేపుతున్నాయి. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలుకుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చామని తెలిపారు. గతంలో కూడా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. జూలైలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు కూడా ‘సాలు మోదీ – సంపకు మోదీ’ అంటూ టీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్ ను ప్రారంభించింది.