*5G సేవలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోది
*5G టెక్నాలజీతో ఏం జరగబోతోంది ?
*రీచార్జి చార్జీలు ధరలు పెరుగుతాయా…? తగ్గుతాయా ?
మన దేశ సాంకేతిక రంగంలో మరో ముందడుగు పడింది. టెలికమ్యూనికేషన్ పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్న 5G సేవలను ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభించారు. మొదటగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 5G సేవలను ప్రారంభించబోతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మనదగ్గర 5G టెక్నాలజీ కాస్త ఆలస్యమైందనే చెప్పవచ్చు. మూడేళ్ల క్రితం కొన్ని దేశాల్లో ప్రయగాత్మకంగా 5జీ సేవలు మొదలయ్యాయి కూడా. మొట్టమొదటిగా 5G సేవలను ప్రారంభించిన ఘనత మాత్రం దక్షిణా కొరియాకు దక్కుతుంది. అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ సౌదీ అరేబియా వంటి దాదాపుగా 72 దేశాల్లో 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
అసలింతకూ 5G నెట్‌వర్క్ అంటే ఏంటి? దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? 4G కి 5G కి మధ్య తేడాలేంటో చూద్దాం. ఇప్పుడున్న 4G అంతకుముందున్న 3G కంటే 8 రెట్లు వేగవంతమైనది. దీని స్పీడ్ గరిష్టంగా 150mbps.
ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 5G నెట్‌వర్క్ 10Gbps డౌన్‌లోడ్ వేగాన్ని అందించగలదు, ఇది 4G సామర్థ్యం కంటే అనేక రెట్లు ఎక్కువ. 5Gతో పూర్తి నిడివి గల HD సినిమాలను సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోగలరు. 4జీ కేవలం ఒకే శ్రేణి రేడియో తరంగాలతో పనిచేస్తే.. 5జీ ఏక కాలంలో మూడు రకాల తరంగాలతో పనిచేయగలదు.
కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీతో వినియోగదారులకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సేవలు అందుతాయి. 4జీలో లాటెన్సీ గరిష్టంగా 98 మిల్లీసెకన్లయితే 5జీలో ఇది మిల్లీ సెకను కంటే తక్కువ. అంటే అంటే ఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. డౌన్‌లోడింగ్ వేగాలు చూస్తే 4జీలో 1సెకనుకు 100 మెగాబైట్ల నుంచి ఒక గిగాబైట్ వరకూ ఉంటుంది. 5జీలో 1సెకనుకు కనీసం పది గిగాబైట్ల నుంచి గరిష్ఠంగా 20 గిగాబైట్ల వరకూ ఉంటుంది. 4G లో ఒక్కో మొబైల్ టవర్ ద్వారా 400 మందికి సేవలందితే.. 5జీలో వంద రెట్లు ఎక్కువగా సేవలందించవచ్చు. 5G నెట్‌వర్కుతో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయడం సులభతరం అవుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ మరింత మెరుగు పడుతుంది. భవిష్యత్తులో 5జీ వల్ల స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీ కి ప్రాధాన్యత పెరుగుతుంది. దేశ భద్రత, నిఘా వ్యవస్థల్లోనూ 5జీ కీలకపాత్ర పోషించనుంది. 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కస్టమర్‌లు తమ సిమ్ కార్డ్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సిమ్ స్వాప్ మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 5G నెట్‌వర్క్ టారిఫ్ వివరాలు ఇంకా తెలియదు. అయితే ప్రస్తుతం 4G కోసం మనం చెల్లిస్తున్న దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.