ఆ పార్టీలో డిసెంబరు టెన్షన్

By KTV Telugu On 18 April, 2022
image

వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. అయినా ఏదో వెలితి, ఏదో భయం. అసలు చోటే పరువు పోతుందన్న బెంగ…ఈసారి ఓటరు దేవుళ్లు మద్దతివ్వరన్న అనుమానం. అదే బీజేపీ పార్టీ. అదే గుజరాత్ రాష్ట్రం. అదే డిసెంబరులో జరగబోయే ఎన్నికల భయం….

షెడ్యూల్ ప్రకారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులో జరగాలి. ఒకటి రెండు నెలల ముందు కూడా జరిగే వీలుంది. ఈ నేపథ్యంలోనే మోదీ అమిత్ షా వ్యూహాలు ఈ సారి గుజరాత్లో పనిచేయకపోవచ్చన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. అధికార పార్టీ పట్ల సహజంగా ఉండే వ్యతిరేకత ఈ సారి గట్టిగా పనిచేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా దేశంలో పెరిగిపోతున్న ధరలు ఈ ఏడాది చివరి దాకా కొనసాగితే ప్రజాగ్రహం పెల్లుబికే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు…

బీజేపీ వ్యూహాల్లో కొన్ని ఈ సారి పనిచేయకపోవచ్చన్న వాదన బలపడుతోంది, కొన్ని వర్గాలను రెచ్చగొట్టి, మతాల మధ్య విభేదాలు సృష్టించి ఏదో బావుకుందామన్న ప్రయత్నం బెడిసి కొట్టే ప్రమాదమూ ఉంది.
గుజరాత్ పర్యటనకు వెళ్లిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీని జనం అడ్డుకోవడాన్ని ఈ దిశగానే చూడాలి.
ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఒవైసీ వెళ్లగా… కొందరు ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడి నల్లజెండాలూ చూపారు. అసద్ గో బ్యాక్ అంటూ నినాదాలిచ్చారు. ఆయన బీజేపీ ఏజెంట్ అంటూ నినదించారు.
యూపీలో ఘోరంగా ఓడిపోయిన ఎంఐఎం…ఇప్పుడు గుజరాత్‌పై దృష్టి పెట్టింది. ఇఫ్తార్ విందు పేరుతో తన గుజరాత్ పర్యటనలు ప్రారంభించాలనుకున్న ఒవైసీకి జనం నిరసనలతో స్వాగతం పలికారు. ఏడెనిమిది నెలల ముందే ఎన్నికల వేడి ప్రారంభమైందనేందుకు కూడా ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. పైగా ఏదో వంక పెట్టి బీజేపీనే ఆయన్ను గుజరాత్ పంపిందన్న అనుమానాలూ ఉన్నాయి…

ద్విముఖ వ్యూహమే కరెక్టా !

గుజరాత్‌లో బీజేపీ 27 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా శక్తిమంతమైన పార్టీగానే కొనసాగుతోంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించినా.. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా… బీజేపీని ఓడించలేకపోయింది. ఈ సారి సమీకరణాలు మారుతున్నాయి. దానితో బీజేపీ కూడా జాగ్రత్త పడుతోంది. గుజరాత్‌లో బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని పాటిస్తోంది. క్షేత్రస్థాయిలో అసంతృప్తికి కారణాలు తెలుసుకుంటూ.. వాటిని పరిష్కరించేందుకు బీజేపీ టీమ్ ఒకటి పనిచేస్తోంది. ఎక్కడెక్కడ అసంతృప్తి ఎక్కడ ఉందో తెలుసుకుని, అక్కడ బీజేపీ ప్రతినిధులు ఎంటరైపోయి.. లోటు పాట్లను సరిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాల లోటును వెంటవెంటనే తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. సీనియర్లకు విశ్రాంతినిచ్చి.. యువతకు అవకాశమిచ్చే ప్రయత్నం బీజేపీ పాటించబోతున్న రెండో వ్యూహం. కనీసం 60 మంది ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంతో గుజరాత్ పర్యటన సందర్భంగా మోదీ స్వయంగా ఈ సంకేతాలిచ్చారు. కొందరికి కన్నీరు తెప్పించే నిర్ణయాలు తప్పవని మోదీ చమత్కరించినప్పటికీ, వారిని సాగనంపుతున్నామని ఆయన చెప్పకనే చెప్పారు. కొందరు సీనియర్ మంత్రులు, మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. 60 ఏళ్లు వయసు దాటి… నాలుగు సార్లు ఆ పైన ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి ఈ సారి టికెట్ ఇవ్వబోమని రాష్ట్ర స్థాయి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

కాంగ్రెస్ ధైర్యమేంటి ? హస్తం పార్టీ ఇబ్బందులేమిటి ?

బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్న వారంతా తమకు ఓటేస్తారని కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. అధికార పార్టీపై ఉన్న ప్రజాగ్రహమే తమకు వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని విశ్వసిస్తోంది.ధరల పెరుగుదుల, బీజేపీ వారి ఆశ్రిత పక్షపాతం లాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా వినియోగించుకోబోతోంది.అయితే దివంగత అహ్మద్ పటేల్ లాంటి వ్యూహకర్తలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది.. అహ్మద్ పటేల్ అంగబలం, అర్థబలాన్ని సృష్టించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువ నేత హార్దిక్ పటేల్ అలిగారు. అప్పట్లో పటేల్ రిజర్వేషన్ కోసం పోరాడి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఆయన… తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. తాను రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీమాట చెల్లుబాటు కావడం లేదని, ఎలాంటి నిర్ణయాలు తన దృష్టికి రావడం లేదని హార్దిక్ పటేల్ అంటున్నారు. ఇటీవల భారీస్థాయిలో పార్టీ నియామకాలు జరిగినప్పుడు హార్దిక్ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. దానితో ఆయన తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ఏకంగా 75 మంది ప్రధాన కార్యదర్శులు, 25 మంది ఉపాధ్యక్షులను నియమించిన అధిష్టానం తనకు మాట మాత్రమైనా చెప్పలేదని హార్దిక్ ఆవేదన చెందుతున్నారు.

దూసుకొస్తున్న ఆప్

పంజాబ్ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌పై దృష్టి పెట్టారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చి..తనదిగా మార్చుకునేందుకు ఆప్ వ్యూహం పన్నుతోంది. బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తే తమకు పెట్టుబడి అవుతుందని ఆప్ భావిస్తోంది. ఆప్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ.. ప్రజలకు చేరువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కేజ్రీవాల్ కూడా తన గుజరాత్ పర్యటనలు ప్రారంభించబోతున్నారు…కాంగ్రెస్ అసంతృప్తి పరులను తన వైపుకు తిప్పుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. పార్టీలో చేరాలని హార్దిక్ పటేల్ కు ఓపెన్ ఆఫరిచ్చింది. 182 స్థానాలున్న గుజరాత్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 58 స్థానాలు దక్కించుకోగలమని ఆప్ అంటోంది. బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రం పోటీ కాదని, తామే ప్రత్యామ్నాయమవుతామని వాదిస్తోంది..

సీన్లోకి ఎంటరైన పీకే

ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు గుజరాత్ ఎన్నికల సీన్ లోకి ఎంటరయ్యారు. ఆయన కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేసేందుకు అంగీకరించారు. కాంగ్రెస్ లో చేరాలన్న ఆహ్వానాన్ని పక్కన పెట్టి 2024 లోక్ సభ ఎన్నికల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చిన పీకే.. అంతకంటే ముందు గుజరాత్ లో ఆ పార్టీ తరపున పనిచేయాలని నిర్ణయించుకున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకుని, జనంలో అసంతృప్తిని తొలగించడం, కుల సమీకరణాలను లెక్కగట్టి అభ్యర్థులను సూచించడంలో పీకే దిట్ట.. ఈ సారి గుజరాత్లో ఆయన ఏం చేయబోతున్నారో చూడాలి..