పొలిటికల్ చౌరస్తాలో చెప్పుల వార్

By KTV Telugu On 19 November, 2022
image

కొట్టేదెవరూ.. కొట్టించుకునేదెవరూ

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానన్న పవన్ కల్యాణ్
బీజేపీ ఎంపీని చెప్పుతో కొడతా చంపుతా బిడ్డ అంటున్న కవిత ధర్మపురి అర్వింద్ పై కవిత ఫైర్.
నిజామాబాద్ చౌరస్తాలోనే కొడతానంటున్న కేసీఆర్ తనయ. కెమెరా సాక్షిగా వైసీపీ నేతలకు చెప్పుచూపించిన పవన్.
అలుపొచ్చేదాకా తిడుతూనే ఉన్న జనసేనాని.
నేతల్లో పెరుగుతున్న ఓటమి భయం.
మారుతున్న సమీకరణాలతో ఆందోళన
భవిష్యత్తుపై అభద్రతా భావం. ఫైర్ బ్రాండ్ అనిపించుకునేందుకు కూడా తిట్లు.

కాలికి ఉండాల్సిన చెప్పు చేతికెందుకు వస్తుందో ? చెప్పుతో కొడతామని నేతలు ఎందుకు అంటున్నారో ? భాష, భావం, ఉద్వేగం అన్ని మారిపోవడానికి కారణం ఏమిటి ?

అక్కడ పవన్, ఇక్కడ కవిత చేసిందేమిటి ?

రెండు రాష్ట్రాల్లో రాజకీయ వైరుద్యం ఉంది. భాషలో తేడా ఉంది. యాసలోనూ మార్పు ఉంది. రాజకీయాలు చేసే శైలిలో వైవిధ్యం ఉంది. పార్టీలు వేరుగా ఉన్నాయి. అయినా ఒక్క అంశంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంది. అదే బూతు పంచాంగం. తిట్టుకోవడంలో రెండు రాష్ట్రాల మధ్య ఏదో కనిపించని ఐకమత్యం ఉంది. నువ్వు తిడితే నేను తిడతా. నువ్వు కొడతానంటే నేను కొడతా అన్నట్లుగా తయారైందీ రాజకీయ సంస్కృతి. ఆడా, మగ, పెద్ద, చిన్నా తేడా లేకుండా సాగుతోందీ మాటల యుద్ధం. గల్ఫ్ వార్ లో పేలిన స్కడ్ల కంటే ఘోరంగా ఉందీ నాయకుల మాట తీరు..

కల్వకుంట్ల కవిత.. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ. సీఎం కేసీఆర్ కన్న కూతురు. తెలంగాణ సంస్కృతికే అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను ఏటా నిర్వహిస్తూ అందరితో శభాష్ అనిపించుకునే భూమీ పుత్రిక. బీదసాదలకు అవసరమైన వారికి సాయం చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకునే సామాజిక మార్గదర్శి. అలాంటి కవిత నోరు జారారు. సారీ నోరు పారేసుకున్నారు. నిజామాబాద్ లోక్ సభా నియోజకవర్గంలో తనను ఓడించిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పై ఒక రేంజ్ లో ఎగిరెగిరిపడ్డారు. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా, చంపుతా బిడ్డ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ వదిలారు. కాంగ్రెస్ లో చేరేందుకు మల్లిఖార్జున ఖర్గేతో కవిత మాట్లాడారని ఆరోపించినందుకు అరవింద్ కు చెప్పుదెబ్బలు తప్పేలా లేవు. శాంపిల్ గా ముందే ఆయన ఇంటిని టీఆర్ఎస్ నేతలు పగులగొట్టారు. అరవింద్ కూడా తక్కువేమీ తినలేదు. నన్ను కాదు నీ అయ్యను కొట్టు చెప్పుతో అని సమాధానమిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చెప్పుకు ఉన్న విలువ అలాంటింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాదరక్షల ప్రయోగానికి సిద్దమయ్యారు. వైసీపీ నాయకులు ఆయన్ను పదే పదే ప్యాకేజీ స్టార్ అన్నందుకు పవన్ కు కోపం పతాకస్థాయికి చేరింది. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పుతీసుకుని పళ్లు రాలగొడతా నా… ఒక్కొక్కరికీ చెబుతున్నా.. అరే సన్నాసుల్లారా, చవటల్లారా.. దద్దమ్మల్లారా.. సన్నాసులారా నా సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించిందీ అంటూ ఓపిక ఉన్నంత సేపు పవన్ తిట్టేశారు. పవన్ కు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటరిచ్చారనుకోండి.

రాజకీయాలు మారిపోతున్నాయి. గెలుపుపై ధీమా తగ్గిపోతోంది. ఓటమి భయం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అర్థం కాని అయోమయ స్థితి రోజురోజుకు పెరుగుతోంది. దానితో వచ్చిన అసహనమే ముందు వెనుకా చూసుకోకుండా తిట్ల దండకం అందుకోవడానికి కారణమవుతోంది. రెండు రాష్ట్రాల్లో బహుముఖ పోటీ ఖాయమనిపిస్తోంది వైఎస్ షర్మిల. ఆర్ఎస్ పవన్ లాంటి కొత్త రాజకీయ క్రీడాకారులు రంగంలోకి దిగుతున్నారు. ఏపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారు. జనం ఎవరి పొత్తును ఆదరిస్తారో అర్థం కావడం లేదు.. అందుకే రాజకీయ నాయకుల్లో భయం పెరిగింది. తమ భవిష్యత్తుపై అభద్రతాభావం కూడా పెరిగింది. తిట్లలో ఇంకో కోణం కూడా ఉంది. ఫైర్ బ్రాండ్ అనిపించుకునేందుకు కూడా తిడుతున్నారు. తిడితేనే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని విశ్వసిస్తున్నారు. టైమ్ చూసుకుని పబ్లిసిటీ వచ్చే లెక్కలేసుకుని మరీ తిడుతున్నారు. ఏదేమైనా త్వరలోనే చెప్పులకు పనిపడేటట్టుగా ఉంది.