ఇటు వారాహి యాత్ర అటు నారాహి యాత్ర

By KTV Telugu On 23 January, 2023
image

అటు  పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బట్టలు సర్దుకుంటే ఇటు లోకేష్ నారాహి యాత్రకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. యాత్రలతోనే అధికారం వచ్చేస్తుందన్న సెంటిమెంటు రాజకీయ పార్టీల్లో పెరిగిపోతోంది. ఒక విధంగా ఆ సెంటిమెంటులో నిజం లేకపోలేదనిపిస్తోంది. యాత్రలతో  అధికారం చేతికి చిక్కుతుందా?

ఈ నెల 24నుండి వారాహి రథయాత్ర  ప్రారంభించబోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. మూడు రోజుల తర్వాత జనవరి 27 నుండి నారా లోకేష్ యువగళం పేరిట 400రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. 2024 ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న తరుణంలో  ఇటు జనసేన అటు టిడిపిలకు చెందిన ఈ ఇద్దరు నేతలు జనంతో మమేకం కావడానికే  యాత్రలకు ముస్తాబవుతున్నారు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న టిడిపి-జనసేన పార్టీలు రెండూ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.

ఆలోచనలు చేయడమే కాదు ఇంచుమించు నిర్ణయానికి వచ్చేసినట్లే అంటున్నారు రాజకీయ పండితులు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని  అధికారంలోకి రానీయకుండా అడ్డుకోవాలంటే పొత్తులు తప్పవని  రెండు పార్టీలూ నమ్ముతున్నాయి. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పార్టీలు ఇప్పట్నుంచే జనంలో తిరుగుతూ వారి సమస్యలు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాలని తమ పార్టీలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి. యాత్రల వల్ల నిరంతరం జనం నోళ్లల్లో నానుతూ ఉండడంతో పాటు జనానికి ఏం కావాలో తెలుస్తుంది. దానికి అనుగుణంగా వ్యూహాలు రచించుకుంటూ సాగితే అధికారం సొంతమవుతుందని భావిస్తున్నారు. యాత్రల వల్లనే ముఖ్యమంత్రులు అయిపోవచ్చా అంటే అయిపోవచ్చునని కొందరు నేతలు చాటి చెప్పారు కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

2004 ఎన్నికలకు  ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ నేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ నెలలో నిప్పులు చెరిగే ఎండల్లో పాదయాత్ర మొదలు పెట్టారు వై.ఎస్.ఆర్. ఎండల్లో పాదయాత్ర ఎందుకు కష్టం కదా అని అయినవాళ్లు వారిస్తే ఇపుడు వెళ్తేనే ప్రజల కష్టాలు తెలుస్తాయి. అయినా రైతులు కార్మికులు ఇవే ఎండల్లో పనిచేయడం లేదా అని ప్రశ్నించారు వై.ఎస్.ఆర్. పాదయాత్ర లో అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. పాదయాత్రలోనే జనం సమస్యలను వారి నోటనే విన్నారు. అప్పుడే మేనిఫెస్టోకి రూపకల్పన చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో జనం వై.ఎస్.ఆర్.కు బ్రహ్మరథం పట్టారు. అఖండ విజయంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పాదయాత్రలో అనుకున్న ఆలోచనల్లోంచే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలకు శ్రీకారం చుట్టిన వై.ఎస్.ఆర్.కు ప్రజలు 2009 ఎన్నికల్లోనూ గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు.

2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయి పదేళ్లపాటు ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఎన్నికల కోసం చంద్రబాబు ముందస్తుగానే పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర మహిమకు నరేంద్ర మోదీ హవా పవన్ కళ్యాణ్ మద్దతు తోడై 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.
2014 ఎన్నికల్లో తృటిలో అధికారం మిస్ అయిన వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  2018లో తన తండ్రిబాటలో ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించనంతటి భారీ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. 175 నియోజక వర్గాలున్న ఏపీలో ఏకంగా 151 స్థానాలు దక్కించుకోవడమే కాకుండా ఇంచుమించు 51 శాతం ఓట్లు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు.

ఇపుడు  నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లు కూడా తమ యాత్రలతో తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు. అయితే ఇద్దరి ఆకాంక్షల్లో ఎవరో ఒకరిదే నిజం కావచ్చు. లేదంటే ఇద్దరి అంచనాలు తల్లకిందులు కావచ్చు. లేదా అధికారాన్ని పంచుకుంటే ఇద్దరి యాత్రలూ సక్సెస్ అయి ఇద్దరూ ప్రభుత్వంలో భాగస్వాములు కావచ్చు.
అయితే యాత్రలు చేసినంత మాత్రాన అధికారం వస్తుందన్న గ్యారంటీ అయితే ఏదీ ఉండదంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్.షర్మిల కూడా పాదయాత్ర చేశారు. తన తండ్రి తరహాలోనే పట్టుదలగా యాత్ర చేపట్టారు. దానికి అపూర్వ స్పందనా లభించింది. అయితే ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది.

2018 లో తెలంగాణ ఎన్నికల్లోనూ కొందరు నేతలు వ్యక్తిగతంగా యాత్రలు నిర్వహించారు. అయితే అవి వర్కవుట్ కాలేదు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ పార్టీలు కూడా పాదయాత్రా స్పెషల్స్ నడుపుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇ.ఎం.ఐ.లు చెల్లించినట్లు విడతల వారీగా యాత్రలు నడుపుకొస్తున్నారు. తెలంగాణాలో సొంతంగా పార్టీ పెట్టిన వై.ఎస్.షర్మిల ఇప్పటికే చాలా రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అనుమతితో పి.సి.సి. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైతే తాను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కోమటి రెడ్డి వెంకట రెడ్డి తాజాగా ప్రకటించారు. ఇవన్నీ ఒకెత్తు అయితే దేశ వ్యాప్తంగా నెహ్రూగారి మునిమనవడు ఇందిరాగాంధీ మనవడు రాజీవ్ గాంధీ గారి తనయుడు రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రతో అదరగొట్టారు. అయితే ఆ యాత్రే 2024లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేస్తుందా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా అంటే ఇపుడే చెప్పలేం. అంచేత యాత్రలనేవి ప్రజలకు నేతలు పరిచయం కావడానికి ప్రజల మనసులో ఏముందో నేతలు తెలుసుకోడానికి మాత్రమే పనికొస్తాయి ఆతర్వాత ఎన్నికల్లో గెలవడానికి పార్టీలు కానీ నేతలు కానీ చాలా చేయాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. దానికి చాలా సమీకరణలు కూడా తోడుకావలసి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. యాత్ర చేశాం కాబట్టి సిఎంని చేసేయండి అంటే జనం ఒప్పుకోరంటున్నారు పొలిటికల్ సెటైరిస్టులు.