పొన్నం ప్రభాకర్‌కు గడ్డు పరిస్థితే ! ఎలాంటినేత ఎలా అయిపోయాడు ?

By KTV Telugu On 10 June, 2022
image

వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఇంకెప్పుడూ గెలవలేమనుకుంటున్న కాంగ్రెస్ కీలక నేతలు ముందు తాము గెలవడంపై దృష్టి పెట్టారు.  స్ట్రాటజిస్ట్‌లను పెట్టుకుని మరీ ఎప్పటికప్పుడు సర్వేలకు పురమాయిస్తూ నేతలు చేయాల్సిన హోంవర్క్ కూడా చేసుకుంటున్నారు. మిగతా వాళ్ల సంగేతమో కానీ.. కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్ పరిస్థితి మాత్రం ఎటూ కాకుండా  పోతోంది. ఆయనకు సీటు కూడా గ్యారంటీ లేని పరిస్థితి కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

పొన్నంకు పోటీగా కోమటి రెడ్డి !

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేతలు ప్రచారం లేకపోయినా కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో కి వెళ్లి రచ్చబండ పెట్టి రైతు డిక్లరేషన్ గురించి చెబుతున్నారు. కరీంనగర్‌ నుంచి గత ఎన్నికల్లో పార్టీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలపై గతంలో మాదిరిగానే కన్నేసి ఉంచారు.  అయితే అసెంబ్లీ, కాకుంటే పార్లమెంట్‌ అన్న ఆలోచనతోనే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌తో రచ్చబండ కార్యక్రమాల్లో తిరుగుతున్న పొన్నం ఇదే నియోజకవర్గంలో పోటీ చేసే ఆసక్తితో క్రియాశీల రాజకీయాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.  తాను పోటీ చేస్తానంటున్నారు. అయితే నగర అధ్యక్షుడు కాబట్టి నగరానికే పరిమితం కావాలని పొన్నం ఒత్తిడి చేస్తున్నారు.

రేసులోకి ఎమ్మెస్సార్ కుమారుడు !

కరీంనగర్‌లో ఎమ్మెస్సార్ ప్రభావం గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెస్సార్ తర్వాత ఆయన కుటుంబం నుంచి మనవడు రోహిత్ రావు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ నుంచి టికెట్‌ ఆశించి తన రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. ఆయన ఇటీవల వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభకు తన ఇంటి వద్ద నుంచి జనాన్ని తీసుకువెళ్లడం, ఆ ర్యాలీని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించడం కాంగ్రెస్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కవ్వంపల్లి ఆశీస్సులు రోహిత్‌రావుకు ఉన్నాయని, పొన్నం ప్రభాకర్‌ కూడా తాను పోటీలో లేని పక్షంలో రోహిత్‌రావుకే టికెట్‌ ఇవ్వాలని సూచించే అవకాశాలున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది.  వీరే కాకుండా కేసీఆర్‌కు సమీప బంధువు, ఆయనపై రాజకీయంగా ఎదురుదాడి చేస్తూ  సంచలనాలకు కేంద్రమవుతున్న రేగులపాటి రమ్యారావు కూడా కరీంనగర్‌ నుంచే పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు. ఆమె తనకు టికెట్‌ ఇవ్వని పక్షంలో తన కుమారుడు రితీష్‌రావుకు చాన్సివ్వాలని అంటున్నారు.

వీళ్లే కాదు ఇంకా రేసులో పలువురు !

జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  మాజీ అధ్యక్షుడు పద్మాకర్‌ రెడ్డి కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారని సమాచారం. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటాపోటీగా అభ్యర్థులు సిద్ధమవుతుండగా మరో ఇద్దరు ముఖ్య నేతలు కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. వారిద్దరు ప్రస్తుతం పార్టీలో లేరని, అయినా వారు పార్టీ రాష్ట్ర అధిష్టానవర్గ నేతలతో ఇప్పటికే సత్సంబంధాలు పెట్టుకొని చక్రం తిప్పుతున్నారని అటు కాంగ్రెస్‌ వర్గాలు, ఇటు జిల్లా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారిద్దరిలో ఎవరో ఒకరు పార్టీలో చేరి టికెట్‌ పొందే అవకాశం లేకపోలేదని చర్చలు జరుగుతున్నాయి. బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీరు కాంగ్రెస్‌లో చేరితే కరీంనగర్‌ నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీకి కలిసి వచ్చే అవకాశాలుంటాయని స్ట్రాటజిస్టులు లెక్కలు వేస్తున్నారు. ఇవి హైకమాండ్ వరకూ చేరాయి.

కాంగ్రెస్ సీనియర్ నేతగా పొన్నం ప్రభాకర్‌కు సీటు అనేది చిన్న విషయం కావాలి. కానీ.. ఇక్కడ ఆయన సీటు కోసం పోటీ పడేవారు .. పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో.. చివరికి పొన్నం కూడా టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ పని చేసుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు.