ధైర్యానికి, మేకపోతు గాంభీర్యానికి మధ్య…. ప్రస్తుతానికి చేతులెత్తేసిన ప్రశాంత్ కిషోర్

By KTV Telugu On 9 May, 2022
image

అల్లు అర్జున్ స్టయిల్లో తగ్గేదేలే అన్నారు. రజనీ స్టయిల్లో ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అన్నారు. ఇదిగో వచ్చేస్తున్నా, ఒక పార్టీలో చేరేదేమిటి.. నేనే పార్టీ పెడతా అన్నారు. దీంతో రాజకీయ ప్రక్షాళన ఖాయమని జనం ఎదురు చూశారు. ఆయన నర్మగర్భమైన ట్వీట్లతో జనం ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆయన మాట మార్చారు. ఇప్పుడు కాదులే అంటున్నారు… రాజకీయాల్లోకి రావడం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు నాయకుల్లా పాదయాత్ర చేస్తానంటున్నారు.

రియల్ మాస్టర్స్ , ది పీపుల్ అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేయడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు డిసైడైపోయారని భావించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వస్తుందని ఎదురు చూశారు. అంతలోనే సీన్ మారింది. రాజకీయాల్లోకి రావడం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బిహార్ బాగా వెనుకబడిపోయిన రాష్ట్రమని అక్కడి పరిస్థితులు అర్థం చేసుకునేందుకు త్వరలో పాదయాత్ర చేస్తానని పీకే ప్రకటించారు. మొత్తం 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానన్నారు. 30 ఏళ్లుగా బిహార్ వెనుకబాటుతనానికి లాలూ, నితీషే కారణమని పీకే దుమ్మెత్తిపోశారు. బిహార్ సమస్యలను అవగాహన చేసుకున్న 18 వేల మంది తనకు తెలుసని వారితో చర్చించేందుకు ప్రయత్నిస్తానని పీకే చెప్పారు. సెప్టెంబరు నాటికి ఆ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. బిహార్ సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీ పెట్టాల్సి వస్తే అందుకు వెనుకాడబోనని చెప్పుకున్నారు. అప్పుడది ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదని, ప్రజల పార్టీ అవుతుందని ప్రకటించేశారు…

వాస్తవాలు అర్థమయ్యాయా…

కొందరు ధైర్యం నటిస్తారు. మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు… ధైర్యంగా నిర్ణయాన్ని జనం ముందుంచాల్సిన తరుణంలో మాత్రం చేతులెత్తేసి రెండు అడుగులు వెనక్కి వేస్తారు. పీకే కూడా అంతేననుకోవాలి. వృత్తిరీత్యా పీకే ఎన్నికల వ్యూహకర్త. ఐ ప్యాక్ సంస్థను నిర్వహిస్తూ.. దేశంలోని పలు పార్టీలకు వ్యూహాలు రచించారు. వారి బలాలు, బలహీనతలు బేరీజు వేస్తూ.. పీకే ఇచ్చిన సలహాలతో లబ్ధి పొందారు. అందులో బీజేపీ, టీఎంసీ, డీఎంకే, వైసీపీ లాంటి పార్టీలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు సలహాలు ఇవ్వడం వేరు.. రాజకీయాల్లో వచ్చి రాణించడం వేరు అని పీకే అర్థం చేసుకున్నట్లున్నారు. వ్యూహకర్తగా ఇంతకాలం గుర్తించిన రాజకీయ నాయకులే.. రేపు తనను ఒక ఆట ఆడుకుంటారని అర్థం చేసుకున్నారు. శక్తిమంతమైన పార్టీలతో ఢీకొనడానికి అవసరమైన అంగబలం, అర్థబలం, ప్రజాబలం తనకు ఉందన్న విశ్వాసం ఆయనకే కలగలేదనుకోవాలి….

మోదీకి భయపడ్డారా…
ప్రశాంత్ కిషోర్ తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. పార్టీ ప్రక్షాళనకు బ్లూ ప్రింట్ తయారు చేసి సోనియా బృందానికి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. పార్టీలో చేరితే ఎంపవర్డ్ గ్రూపులో ఉండాలని సోనియా సూచించారని, అందుకు అంగీకరించలేకే ఆ పార్టీకి దూరంగా ఉన్నానని పీకే చెప్పుకున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, తనంతటతానుగా పునరుజ్జీవం పొందగలదని పీకే విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీలో అంటకాగే ఆలోచన లేదని తేల్చేశారు. గతంలో జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేసి చేతులు కాల్చుకున్న సంగతి ఆయనకు గుర్తుంది. పైగా బీజేపీని ఓడించడం, కమలాన్ని బలహీన పరచడం అంత సులభం కాదని గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పీకే తేల్చిచెప్పారు. దేశం మొత్తాన్ని కలిపి లెక్కలు వేస్తే 30 శాతం పైగా ఓటు షేర్ ఉన్న కమలనాథులను మట్టి కరిపించడం ఇప్పటికిప్పుడు అసాధ్యమన్నారు. మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ దేశంలో పాతుకుపోయి ఉంటుందన్నారు. బీజేపీని ఓడించగలనని రాహుల్ గాంధీ కలలు కంటున్నారని, అది మంచినీటి ప్రాయం కాదని తేల్చేశారు…. బహుశా బీజేపీని, మోదీ బాలాన్ని చూసిన తర్వాతే పీకే వెనక్కి తగ్గారనుకోవాలి..

కేడర్ ను పెంచుకోవడం కష్టమేనా…

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి కేడర్ ను డెపలప్ చేసుకోవడం అంత సులభం కాదు. భారీగా కేడర్ బలమున్న బీజేపీని ఢీకొట్టడం అయ్యే పని కూడా కాదు. బీజేపీకి సొంత పార్టీ కేడర్.. ఆరెసెస్, వీహెచ్పీ, హిందూ సేన కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు. వాళ్లు చేయాలనుకున్న పనులు, వారి ప్రచార కార్యక్రమాలు క్షణాల్లో జనంలోకి వెళ్లిపోతాయి. పైగా బడా పారిశ్రామికవేత్తలు ఇప్పుడు బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. మోదీ పార్టీకి ఎంత మొత్తంలో నిధులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు బీజేపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పెద్ద వ్యూహకర్త. ఆయన ఎవరినైనా తమ వైపుకు తిప్పుకోగలరు. బీజేపీతో పోటీ పడటం ఇప్పటికిప్పుడు అసాధ్యమని పీకే గుర్తించారు. తన స్వరాష్ట్రం బీహార్లో సైతం బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని నిర్ణయానికి వచ్చి ఉంటారు. బిహార్లో సీఎం నితీశ్ కుమార్ ని సైతం దించే సత్తా బీజేపీకి ఉందని గ్రహించి.. కొన్ని రోజులు ఆగితే బెటరని పీకే ట్రాక్ మార్చారు….

కేజ్రీవాల్ టైప్ ఆలోచన ?

పీకే మదిలో మరో ప్లాన్ కూడా ఉండి ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన ఏడాదిన్నర పాటు జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ క్రియాశీలంగా పనిచేయలేదు. నితీశ్ పై అలిగి బయటకు వచ్చిన తర్వాత పార్టీలకు వ్యూహకర్తగా కొనసాగుతున్నారు. పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టైపులో ఎంట్రీ ఇచ్చే ఆలోచన వచ్చి ఉండొచ్చు. కేజ్రీవాల్ తొలుత ఉద్యమాల్లో ఉన్నారు. అన్నాహజారేతో చేతులు కలిపిన కేజ్రీవాల్… అవినీతి వ్యతిరేకోద్యమంలో కీలక పాత్ర పోషించారు. తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీ సీఎం అయ్యారు. పీకే తీరు కూడా అలాగే ఉంది. ప్రస్తుతానికి బిహార్లో ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు. అదీ మూడు వేల కిలోమీటర్లు బిహార్ అభివృద్ధి కోసం పాటు పడాలనుకున్న వారితో కలిసి పనిచేస్తారు పార్టీ పెడతారో లేదో ఇప్పుడే చెప్పలేం….