ద్వేషం నుంచే ప్రేమ పుడుతుందన్నది పాత సినిమా డైలాగ్. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో కూడా అంతే.. ముందు ప్రత్యర్థులుగా చూస్తారు.. తర్వాత పొత్తు భాగస్వాములవుతారు. వ్యహకర్తల విషయంలో మాత్రం గేమ్ కాస్త మారుతుంటుంది. కాసేపు ప్రేమ పుడుతుంది. అంతలోనే ద్వేషం వచ్చేస్తుంది. తాను చెప్పింది పాటిస్తే ఫలానా పార్టీకి తిరుగులేదని అంటారు. కొన్ని రోజుల తర్వాత మాట మార్చివేసి ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని ప్రకటించేస్తారు. ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ పీకే చేస్తున్నది కూడా అంతే.. కాంగ్రెస్ బాగుపడేందుకు సలహాలిచ్చిన ఆయనే.. ఇప్పుడు తిట్టిపోస్తున్నారు…
కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్.. పీకే రికార్డ్
ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో సెటిలయ్యేందుకు ఒక్కో అడుగు వేస్తున్నారు. తొలుత కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నించి తన డిమాండ్లు నెరవేరకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు బిహార్లోని వైశాలి జిల్లా నుంచి జన్ సూరజ్ యాత్రను ఆయన ప్రారంభించారు. కొందరు అనుచరులు, అభిమానులతో యాత్రకు ఉపక్రమించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. 2011 నుంచి 2021 మధ్య కాలంలో ఏ పార్టీ కోసం రాజకీయ భాగస్వామిగా పని చేసిందీ.. ఎక్కడ ఏం జరిగిందీ వివరించారు. కాంగ్రెస్ పార్టీతో తాను మరోసారి కలిసి పనిచేసే అవకాశం లేదని, ఆ పార్టీతో కలిసి ఉంటే వాళ్లతో పాటు తాను కూడా నిండా మునిగిపోయే ఛాన్స్ ఉందన్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి 2017 యూపీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి దండం అంటూ చేతులు జోడించి నమస్కారం చేశారు. ఇకపై ఆ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలిపేది లేదన్నారు.
ఇప్పుడెందుకంత కసి ?
కాంగ్రెస్ పార్టీ పట్ల పీకేకు ఎందుకంత కసి పెరిగిందన్న ప్రశ్న సాధారణంగానే ఉత్పన్నమవుతుంది. అందుకు కారణాలు లేకపోలేదు. దేశం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే బీజేపీని ఒడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని పీకే ఒక సందర్భంలో విశ్వసించారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఆ పని కాదని, అవి బీజేపీతో లోపాయకారి ఒప్పందాలు పెట్టుకుంటాయని ఆయన చెప్పేవారు. అయితే పూర్తిగా దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీని ఓటరు దేవుళ్లు నమ్మాలంటే.. కొన్ని చిన్న చిన్న అడ్జెస్ట్ మెంట్లు తప్పవని పీకే సూచించారు. పాత కాపులకు విశ్రాంతి ఇచ్చి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రాన్ని బట్టి వ్యూహాం మారాలని హితవు పలికారు. నిత్యం జనంలో ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలని, పార్టీ పదవిని అనుభవించాలనుకునే వారిని ఎంపీ, ఎమ్మెల్యేగా నిలబెట్టకూడదని సలహా ఇచ్చారు. నేర చరితులకు టికెట్లు ఇచ్చే విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని,, ఘోరమైన నేరారోపణలు ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు కేటాయించకూడదని తన నివేదికలో పొందుపరిచారు. సంప్రదాయ మీడియా ఇప్పుడు అధికార పార్టీకి అండగా ఉందని, అందుకే డిజిటల్ మీడియా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు.
పట్టించుకోని కాంగ్రెస్
పీకే సూచనల్లో మెజార్టీ వాటిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. పైగా ముందు పార్టీలో చేరితే తర్వాత మాట్లాడుకోవచ్చన్నారు. దానితో పీకేకు బాగా కోపమొచ్చింది. కాంగ్రెస్ కు దూరం జరిగారు. ఇప్పుడు కూడా పీకేకు కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నరే ఉంది. బీజేపీ ఏకపక్షంగా తయారైందని, దేశాన్ని సంక్షేమ బాటలో కాకుండా తన ఇష్టానుసారం పాలిస్తోందని పీకే ఆరోపిస్తుంటారు. దాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాల్సింది పోయి ఉదాసీనంగా పడుందన్న ఆగ్రహం ఆయనకు ఉంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ అర్థం చేసుకుంటుందో లేదో..