సునాక్ సుడి సునామీలా ఉంది..నో వన్ కెన్ స్టాప్!
సుడి బాగుందంటారు చూశారూ..రిషి సునాక్‌కి ఆ సుడి సునామీ రేంజ్లో ఉంది. లేకపోతే ఏంటి..నెలన్నర క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఇంత వేగంగా మళ్లీ తెరపైకొచ్చి బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవ్వడం ఏంటి. ఎవరి అదృష్టాన్ని ఎవరూ చెరపలేరనేందుకు రిషి సునాక్‌కు లభించిన అవకాశమే నిదర్శనం. మొదట రిషిని తప్పుకోమన్న మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తానే రేసునుంచి తప్పుకున్నారు. రేసులో ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు అవసరమైన ఎంపీల్లో మూడోవంతుమంది ఎంపీల మద్దతు కూడా లేదు. ఇక ఉన్నదల్లా వన్ అండ్ ఓన్లీ రిషీనే.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కాకుండా ఇక ఏ శక్తీ అడ్డుకోలేదని అందరికీ అర్ధమైపోయింది. 142 మంది సభ్యుల మద్దతున్న రిషి సునాక్ దెబ్బకి పెన్నీ మోర్డాంట్ చేతులెత్తేశారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు రిషి సునాక్. మళ్లీ బోరిస్ జాన్సన్ తెరపైకి రావటంతో గట్టిపోటీ తప్పదనుకున్నారు. అయితే బోరిస్‌కి తత్వం బోధపడింది. రిషితో పోటీపడి గెలవలేనని అర్ధంకావటంతో రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
లిజ్ ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్‌తో ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడింది. పౌండ్ ధర రికార్డు స్థాయిలో పతనమైంది. రాజకీయ అనిశ్చితితో ప్రభుత్వ రుణ వ్యయాలు పెరిగిపోయాయి. అయితే ప్రధాని ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు జాన్సన్ ప్రకటించడంతోనే పౌండ్ మళ్లీ పుంజుకుంది. రిషి సునాక్ అవకాశాలు మెరుగుపడటంతో సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో డాలర్‌పై బ్రిటన్ పౌండ్ పుంజుకుంది. రుణ పరపతి వ్యయాలు తగ్గుముఖం పట్టాయి. రిషి సునాక్‌కి అన్నీ మంచి శకునాలే.