మగ మహరాజులూ.. కొంపలంటుకుంటున్నాయ్‌!

By KTV Telugu On 21 November, 2022
image

పురుషులందు ధాతు పురుషులు వేరయా!

మోడ్రన్‌ యుగం. హైటెక్‌ అలవాట్లు. ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడటం. పగలూ రాత్రీ తేడాల్లేవు. ప్రకృతి ధర్మాన్నే సవాలు చేస్తున్నట్లుగా ఉంది ఈకాలపు మనిషి జీవనశైలి. ఒకప్పుడంటే అంతా న్యాచురల్‌. మగాళ్లకి పాతికలోపే పెళ్లి. ఏడాది తిరిగేసరికి తండ్రి హోదా. సంతానలేమి సమస్య అత్యంత అరుదుగా కనిపించేది. కానీ ఇప్పుడో… అదే ప్రధాన సమస్య. దీంతో కృత్రిమ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఆ ముచ్చట తీరిందనుకుంటున్నారు.
ఇప్పుడో సర్వే పురుష పుంగవులకు వార్నింగ్‌ బెల్‌ మోగిస్తోంది. విశ్వవ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే పురుషుల్లో కొన్నేళ్లుగా స్పెర్మ్‌ కౌంట్‌ అంటే వీర్య పుష్టి గణనీయంగా తగ్గిపోతోంది. భారత్‌ కూడా ఈ జాబితాలో ఉందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది.

వీర్య పుష్టిలో క్షీణతను మానవ పునరుత్పాదక లోపంగానే కాకుండా, పురుషుల ఆరోగ్యకోణంలోనూ చూడాల్సి ఉంటుందంటున్నారు సర్వేజనులు. వీర్య పుష్టి తగ్గితే తలెత్తే తొలిసమస్య సంతానలేమి. మగాడేకానీ ఓ బిడ్డకు తండ్రి కావడం కష్టం. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్‌, జీవితకాలం తగ్గుదలలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయంటున్నారు. ఆధునిక పర్యావరణ పరిస్థితులు, మారిన జీవనశైలిని పరిశోధకులు ప్రపంచ సంక్షోభంగా అభివర్ణిస్తున్నారు. 53 దేశాల నుంచి సేకరించిన ఈ అధ్యయనం వివరాలు ‘హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ అప్‌డేట్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గత 46 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావంతో 50 శాతం వీర్య పుష్టి తగ్గిందని తేల్చారు. ఇటీవలికాలంలో ఈ క్షీణత వేగంగా ఉందట! నాగరికత వెర్రితలలు వేస్తే తలెత్తే విపరిణామాల్లో దీన్నికూడా ఓ ప్రధాన సమస్యగా చూస్తున్నారు.