ఆడియో టేపులో రఘురామకృష్ణంరాజు టాపిక్..

By KTV Telugu On 29 October, 2022
image

తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభాల కలకలం
ఆడియో కాల్ లో బీజేపీ పెద్దల పేర్లు
ఏపీ ఎంపీ రక్షణ గురించి ప్రస్తావన

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో నిందితులు జరిపిన ఆడియో కాల్ లో… సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే డీల్ జరుగుతుందన్నట్టుగా ఉన్న ఆడియో వైరల్ అవుతోంది. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే ప్రభుత్వం పడిపోతుందంటూ నిందితులు, రోహిత్ రెడ్డితో జరిపిన సంభాషణ కలకలం రేపింది. ఇక, తెలంగాణలో సంచలనంగా మారిన ఈ ఆడియో టేపుల వ్యవహారం ఏపీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇందులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సెక్యూరిటీకి సంబంధించి నిందితులు చెప్పిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కొంత కాలంగా వైఎస్ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను తాజాగా హైకోర్టు కొట్టేసింది. గతంలో ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో ఢిల్లీకి మకాం మార్చారు రాజు. తనకు ఏపీలో రక్షణ లేదని, నియోజకవర్గానికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని కోరడంతో…కేంద్రం వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించింది. ఇదే అంశాన్ని నిందితులు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జరిగిన ప్రలోభాల వ్యవహారంలో తిరుపతిలోని శ్రీమనాథ రాజా పీఠం పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న సింహయాజీ స్వామిజీ కూడా ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుకి రక్షణ కల్పించినట్లుగా పార్టీలో చేరబోయే ఎమ్మెల్యేలందరికీ అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తామంటూ… ఢిల్లీకి చెందిన వ్యక్తులు హామీ ఇస్తున్నట్లుగా ఆ ఆడియో టేపుల్లో ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా, తుషార్, గతంలో కర్ణాటక రాజకీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్ పేర్లతో పాటు…. ఆరెస్సెస్, పశ్చిమ బెంగాల్ రాజకీయ వ్యవహారాలు…. ఈడీ, ఐటీ దాడులు..తదితర అంశాల ప్రస్తావన ఆడియో టేపులో బయటపడింది.