తడబాటా.. ఆలోచనా.. రాజకీయ అనివార్యతా…

By KTV Telugu On 28 May, 2022
image

పార్టీ వారికి ఆయన యువరాజు… ప్రత్యర్థులకు ఆయన పప్పు… ప్రశంసించే వాళ్లూ ఉంటారు. ఓ ఆటాడుకునే వాళ్లూ ఉంటారు. బాబు నువ్వే కావాలి.. నువ్వే రావాలి అని వేడుకునే వాళ్లుంటారు. ఆయనొస్తే కాంగ్రెస్ కొట్టు కట్టేయడమే. దేశం అథోగతిపాలు కావడమే.. అనే వాళ్లూ ఉంటారు. ప్రత్యర్థుల కామెడీలకు తగ్గట్టుగా.. రాహుల్ గాంధీ తరచూ తడబడుతుంటారు. ఒకటి మాట్లాడబోయ్ మరోటి మాట్లాడేస్తారు. ఇప్పుడు ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో రాహుల్ సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీజేపీకి మంచి అవకాశం దొరికితే.. సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది..

ఆమె అడిగిందేమిటి ?

రాహుల్ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక ఇంటర్వ్యూ జరిగింది. భారతీయ సమాజంలో హింస – అహింస అనే అంశంపై ఒక ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రాహుల్ కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయారు. కొంత సమయం తీసుకున్నారు, తనకు క్షమాపణ అనే అర్థం గుర్తొస్తున్నట్లు చెబుతూ మళ్లీ ఆగిపోయారు. సమాధానం చెప్పేందుకు ఆలోచిస్తున్నానని రాహుల్ చెప్పడంతో నవ్వులు విరిశాయి. తర్వాత ఆయన తనకు తోచిన సమాధానం చెప్పారు…

ఈ వీడియోను బీజేపీ నేతలే ఎక్కువగా షేర్ చేశారు. రాహుల్ పై విమర్శలు గుప్పించారు. ముందే రాసుకున్న స్పీచ్ లేకపోతే ఆయనకు ఇబ్బంది ఎదురువుతుందన్నారు. బీజేపీకి కాంగ్రెస్ కౌంటరిచ్చింది. రాహుల్ .. క్షమాపణ అనే ఒక మాటతో బదులిచ్చారన్నారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అహింస అనే గాంధీ సిద్ధాంతాన్ని తక్కువ చేయొద్దంటూ రణదీప్ సుర్జేవాలా విమర్శలను తిప్పికొట్టారు.

తడబాటా.. సుదీర్ఘ ఆలోచనా..

ప్రత్యర్థుల విమర్శల సంగతి సరే.. నిజానికి రాహుల్ సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయారనే చెప్పాలి. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత వచ్చే అనుబంధ ప్రశ్న ఎలా ఉంటుందనే ఆలోచన రాహుల్ కు వచ్చి ఉండొచ్చు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రశ్నలు ఎటు వెళ్తాయో తెలీదు. తర్వాత ఇబ్బంది పడాల్సి రావచ్చు.

రాహుల్ నానమ్మ, తండ్రి ఉగ్రవాద హింసకు బలయ్యారని రణదీప్ సుర్జేవాలా గుర్తుచేస్తూ… కాంగ్రెస్ యువరాజు మనసులోని మాటను చెప్పకనే చెప్పారు. రాహుల్ గాంధీ హత్య కేసులో దోషి పేరరివలన్ విడుదలకు సుప్రీం కోర్టు అనుమతించిన కొద్ది రోజులకే రాహుల్ ను ఈ ప్రశ్న అడిగారు. హింస – అహింస అనే ప్రశ్నకు సమాధానం చెబితే.. తర్వాత వచ్చేది పేరరివలన్ కు సంబంధించిన ప్రశ్నే. అనుబంధ ప్రశ్న అంటూ తలెత్తితే ఎలా సమాధానం చెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయిన కారణంగానే రాహుల్ కాసేపు మాట్లాడలేదని కాంగ్రెస్ వర్గాల సమాచారం…

డీఎంకేను వదులుకోవడం ఇష్టం లేకే..

కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దక్షిణాదిన పార్టీ ఉనికి అంతంతమాత్రంగానే ఉంది. తమిళనాడులో డీఎంకే భాగస్వామిగా కొనసాగుతోంది. రాహుల్ అంటే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు అభిమానం ఎక్కువ. కాబోయే ప్రధాని రాహుల్ అంటూ కూడా ఒకటి రెండు సార్లు ఆయన ప్రకటించారు. అలాగని శ్రీలంక తమిళుల పట్ల తమకున్న అభిమానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి మరిచిపోలేరు. అందుకే ఆయన ఇటీవల పేరరివలన్ ను ఆలింగనం చేసుకున్నారు. శ్రీలంక తమిళుల వ్యవహారాన్ని డీఎంకే ఉగ్రవాదంగా చూడదు. హక్కుల పోరాటంగా పరిగణిస్తుంది. ఆ సంగతి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి బాగానే తెలుసు. ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న తలెత్తితే… చిలవలు పలవలు చేసి… పది విధాలుగా వక్రీకరించే ప్రమాదం ఉందని రాహుల్ పసిగట్టారు. కాసేపు మౌనం వహించి… పప్పు  అంటూ విమర్శలు వచ్చినా ప్రస్తుతానికి గట్టెక్కారు. మరి భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్న తలెత్తితే ఏం చేస్తారో చూడాలి…