“డిక్లరేషన్‌”తో గోల్ సెట్ – ఇప్పుడే కాంగ్రెస్ ముందు అసలు సవాళ్లు!

By KTV Telugu On 7 May, 2022
image

ఏదైనా సాధిచాలంటే ముందు గోల్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఆ గోల్ ను అందుకునేందుకు మార్గాలను వెదుక్కోవాలి. ఉన్న వాటిలో ఏ దారిలో అయితే దగ్గరిగా చేరుకుంటారో ఆ దారిని ఎంచుకోవాలి. ఆ తర్వాత నడక ప్రారంభించాలి. ప్రయత్నాలు చేయాలి. గాలివాటంగా ప్రజలు గెలిపించేస్తారని ఇంత కాలం ఆశపడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా ట్రాక్‌లోకి వచ్చింది. వరంగల్ సభకు రాహుల్ గాంధీని తీసుకురావడంతోనే ఓ మూమెంటం సృష్టించే ప్రయత్నం చేసింది. దానికి “వరంగల్ డిక్లరేషన్‌”ను జత చేశారు. దీనిపై ప్రజల్లో విస్తత చర్చ జరిగేలా ప్రణాలికలు సిద్ధం చేశారు.

రైతులను ఆకట్టుకునేలా డిక్లరేషన్ !

వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. రైతులకు సంబంధించిన కీలకమైన సమస్యలన్నింటికీ ఈ డిక్లరేషన్‌లో పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ, రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. పదిహేను వేల పెట్టుబడి సాయం, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి రైతు కూలీకి ఎటా రూ. పన్నెండు వేల ఆర్థిక సాయం, గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు, నకిలీ విత్తనాల నివారణకు కఠిన చట్టం, నూతన వ్యవసాయ విధానం, రైతు కమిషన్ ఏర్పాటు వంటితో పాటు రైతులను గోస పెడుతున్న ధరణి చట్టాన్ని కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఇక రైతులకు ప్రతీ సీజన్‌లోనూ సమస్య అయ్యే మద్దతు ధరలను వాణిజ్య పంటలకు కూడా ప్రకటించడం రైతుల్లో చర్చకు కారణం అయ్యే అవకాశంది.

డిక్లేరేషన్‌ పత్రం కాదు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అన్న రాహుల్ !

రైతు డిక్లరేషన్ కేవలం కాగితం కాదని.. అది రైతులకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్న గ్యారంటీ కార్డు అని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. మరోసారి డిక్లరేషన్ చదవండీ… రైతులందరితో చదివించండి.. ప్రతి అంశంపై చర్చించండి.. కాంగ్రెస్‌ గ్యారెంటీ అని ఇంటింటికీ తిరిగి చెప్పాలన్నారు. రైతులు బలహీన పడితే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో నడవలేదని రాహుల్ గుర్తు చేశారు. అలాంటి సందర్భంలో రైతులకు అండగా ఉండేందుకే ఈ డిక్లరేషన్ ప్రకటించాం. రెండుసార్లు టీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. రైతులకు, అన్ని వర్గాల వారికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌పై రాజకీయవర్గాల్లోనూ విస్తృత చర్చ జరిగుతోంది. ఈ ఎన్నికల్లో రైతు ఎజెండాను తీసుకుని వెళ్తున్నందున వ్యవసాయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రణాళిక మొత్తం ఈ డిక్లరేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా అన్ని అంశాలను ఈ డిక్లరేషన్‌లో పొందు పరిచారు.

సభ వ్యూహం .. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోంది. బహిరంగసభ ద్వారా అటు ప్రజలకు.. ఇటు పార్టీ నేతలకు ఇవ్వాల్సిన సందేశాన్ని.. హెచ్చరికలను రాహుల్ గాంధీ ద్వారా తెలివిగా పంపించగలిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వమని రాహుల్ గాంధీ అడిగారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని రేసులో నిలబెట్టడానికి.. ప్రజల్లో నమ్మకం కలిగించడానికి రేవంత్ రెడ్డి ఎలాంటి ఎఫెక్ట్ కోరుకున్నారో రాహుల్ గాంధీ అలాంటి ఎఫెక్ట్ ఇచ్చారు. పూర్తిగా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన ఈ సభ నిర్వహణ రాహుల్ గాంధీని కూడా ఆకర్షించింది. సభకు భారీగా జన సమీకరణ చేస్తే రేవంత్‌కు ఎక్కడ పేరు వస్తుందో అనికొంత మంది నేతలు లైట్ తీసుకున్నా.. జన సమీకరణలో ఎక్కడా తగ్గలేదు. రాహుల్ గాంధీ ఇమేజ్‌ను పక్కాగా వాడుకుంటున్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి ఓ దారి చూపినట్లే.

ఈ టెంపోను కొనసాగిస్తేనే … లేకపోతే శ్రమంతా వృధానే !

ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ నేతలు మాత్రం తమలో తాము కొట్లాడుకుని పక్క పార్టీలను గెలిపిస్తారనే పేరు ఉంది. అందుకే రాహుల గాంధీ ఈ సారి సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సిద్దాంతాలను ప్రశ్నించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఇలా బహిరంగసభా వేదికపై నుంచి వార్నింగ్ ఇవ్వడం కొత్త. ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధమేనని పార్టీ గెలుపే ముఖ్యమని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్పారు. ముందు పార్టీ గెలిస్తేనే ఆ తర్వాత పదవుల గురించి పోటీ పడవచ్చు. కాంగ్రెస్ గెలవకపోతే పదవులు రావు. ఈ విషయాన్ని కాంగ్రె‌స్ నేతలు గుర్తు పెట్టుకుని అన్నీ వదిలేసి.. రాహుల్ పర్యటనతో వచ్చిన ఊపును కొనసాగించడానికి ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. లేకపోతే మళ్లీ పరిస్థితి మొదటికే వస్తుంది.