రాహుల్‌ యాత్రకి ట్వీట్లతో బ్రేకులు పడతాయా!?

By KTV Telugu On 3 October, 2022
image

* రాహుల్‌ నడిస్తే వీళ్లకేం నొప్పో! చల్‌నేదో యార్‌!
* ట్వీటుల్లో కమలం పార్టీ కల్పితాలు వేరయా..

కాంగ్రెస్‌కి పోయిన ప్రాణం లేచొస్తోంది. నీరసించిన పార్టీ శ్రేణులకు సెలైన్‌ ఎక్కిస్తోంది రాహుల్‌గాంధీ యాత్ర. భారత్‌ జోడో అంటూ మొదలుపెట్టిన పాదయాత్ర కాంగ్రెస్‌లో కొత్త ఆశలు నింపుతోంది. సామాన్యులతో మమేకం అవుతూ, అందరినీ పలకరిస్తూ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు కాంగ్రెస్ యువరాజు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా లేనంటూనే కాంగ్రెస్‌ని ఒడ్డునపడేసేందుకు అమ్ములపొదిలోని చివరి అస్త్రాన్ని రాహుల్‌గాంధీ బయటికి తీశారు.
రాహుల్‌ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ఆ అభిమానం ఓట్లరూపంలోకి మళ్లుతుందో లేదో తర్వాత. చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో మళ్లీ ఉత్సాహం ఉరకలేస్తోంది. మొదట్లో రాహుల్‌ పాదయాత్రని పెద్దగా సీరియస్‌గా తీసుకోని బీజేపీ తప్పులెన్నే పనిలో పడింది. రాహుల్‌ని టార్గెట్‌ చేస్తూ పాదయాత్రని నీరుగార్చాలనే ప్రయత్నం జరుగుతోంది. దేశవ్యతిరేక శక్తుల్ని కలిశారంటూ రాహుల్‌పై మాటలదాడి మొదలైంది. ఒకప్పుడు పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు చేసిన యువతిని రాహుల్‌ని హత్తుకున్నారని ఓ బీజేపీ నేత ట్వీటారు. ఇంకేముందీ కాషాయనేతలు పోటీలుపడి దాన్ని ప్రచారం చేశారు.
సీఏఏ నిరసనల సమయంలో బెంగళూరులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్యని రాహుల్‌ కలిశారనేది బీజేపీ ప్రచారం. తీరా చూస్తే కాంగ్రెస్‌ అగ్రనేతను కలిసిన అమ్మాయి తనుకాదు. ఈ అమ్మాయి మివా జోలీ. కేరళ కాంగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యురాలు. కాస్త పోలికలున్నాయంతే. ఆల్ట్ న్యూస్ సెర్చ్‌లో అసలు విషయం తెలిసేసరికి గోబెల్స్‌ ప్రచారం జరిగిపోయింది.
యాత్ర మొదలైనప్పటినుంచీ రాహుల్‌ రాజకీయ ప్రత్యర్థులకు ఏదోలా టార్గెట్‌ అవుతూనే ఉన్నారు. పాదయాత్రలో రాహుల్ వేసుకున్న టీషర్ట్‌ని కూడా వదలకుండా విమర్శలు చేశారు. ఆయన వేసుకున్న ఇంపోర్టెడ్‌ టీషర్ట్‌ విలువ 41వేల పైమాటేనని బీజేపీ నేతలు దెప్పిపొడిచారు. ఓ మతానికి చెందిన ప్రార్థనామందిరాన్ని సందర్శించి హిందూమతాన్ని నిర్లక్ష్యంచేశారని మరో ప్రచారం కూడా జరిగింది. తీరా ఆయన అన్ని మందిరాలను సందర్శించారని తెలియటంతో నాలుక కరుచుకున్నారు.
దేశద్రోహులను అక్కున చేర్చుకుంటున్నారని రాహుల్‌పై ఆరోపణలుచేసిన బీజేపీ నేత శశికుమార్‌ అసలు విషయం తెలిసి ట్వీట్‌ని డిలిట్‌ చేశారు. కానీ అప్పటికే దాన్ని నేతలు పోటీలుపడి షేర్‌ చేశారు. కామెంట్లు పెట్టేశారు. తొందరపడి ట్వీట్లు చేసి తర్వాత వాటిని డిలిట్‌ చేసేసరికే వేలమందికి అది షేర్ అయిపోతుంది. కొందరు బీజేపీ నేతల అత్యుత్సాహం రాహుల్‌ పాదయాత్రకు మరింత ప్రచారం తెచ్చిపెడుతోంది.