జైల్లో ఉన్న దోషులందరినీ వదిలెయ్యాలని ఆదేశం
కోర్టు తీర్పును తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులందరినీ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం, సోనియా గాంధీ కుటుంబం సానుకూలంగా ఉండటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తమను జైలు నుంచి విడుదల చేయాలంటూ దోషులు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరు ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ధను అనే మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పెరరివాలన్, నళిని, జయకుమార్, ఆర్పీ, రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్ ను దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాది పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆరుగురు దోషులు జైలులో శిక్షను అనుభవిస్తుండగా, ఒక దోషి AG పెరరివాలన్ ఈ ఏడాది మేలో రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాన్ని ఉపయోగించడం ద్వారా జైలు నుంచి విడుదల అయ్యాడు. పెరరివాలన్ దాదాపు 30 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఇప్పుడు మిగతా ఆరుగురు దోషులకు కూడా జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. సుప్రీం కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇది దురదృష్టకరమని, తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ పార్టీ జనరల్ సెక్రటరి జై రామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.