దక్షిణాదిపై బీజేపీ త్రిశూల వ్యూహం

By KTV Telugu On 8 July, 2022
image

దక్షిణాదిపై దండయాత్రకు బీజేపీ అన్ని దారులు వెదుకుతోందా ? ఇప్పుడు రాజ్యసభకు దక్షిణాది నుంచి నలుగురిని నామినేట్ చేయడం కూడా అందుకేనా ? మొత్తం ఉత్తరాది పెత్తనమే అన్న అపవాదును పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారా ? మరి తెలంగాణ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం వెనుక కారణమేదైనా ఉందా ?

రాజ్యసభకు నలుగురిని రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ చేసిన కేంద్రంఈసారి దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది. వారి పేర్లను ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. దర్శక జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తర్వలో రాజ్యసభకు వెళతారు. తన సంగీత జ్ఞానంతో దక్షిణాది చిత్రసీమను ఏలిన ఇళయరాజాకు ఇప్పుడు గుర్తింపు లభించింది. ఇక అథ్లెటిక్స్ లో దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టిన పీటీ ఉషతో పాటు ఆధ్యాత్మిక సేవలో ప్రజలకు నాలుగు మంచి మాటలు చెప్పడం, వారిని సంస్కరంచడంలో ముందున్న హెగ్గడేకు కూడా రాజ్యసభ నామినేషన్ దక్కింది…

ఆయన పేరులోనే విజయం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా చలించకుండా ముందుకు వెళ్లే తత్వం ఉంది. నిజాయతీగా బతకాలన్న పట్టుదల ఉంది. ఆయనే కోడూరి విశ్వ విజయేంద్రప్రసాద్‌. ఆయన స్వస్థలం కొవ్వూరు. ‘షోలే’ చూసిన తర్వాత జంట రచయితలు సలీం-జావేద్‌లా తను కూడా మంచి రచయితగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అన్నయ్య శివశక్తి దత్తాతో కలసి కొన్ని చిత్రాలకు రచన చేసి, తర్వాత సొంతంగా రచయితగా ఎదిగి, ఇండియాలోనే అగ్ర శ్రేణి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. జానకిరాముడు, బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు సమర సింహారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే తొలి నాళ్లలో చాలా హిట్స్ ఉన్నాయి.  తనయుడు రాజమౌళి దర్శకుడయ్యాక.. విజయేంద్ర ప్రసాద్‌ ఆలోచనలను తెరపై అద్భుతంగా చూపడం ప్రారంభించారు. ‘సింహాద్రి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా వరుసపెట్టి విజయాలతో సత్తా చాటారు. ముఖ్యంగా.. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో జాతీయంగానే కాక, అంతర్జాతీయ స్థాయిలోనూ రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌ ప్రాచుర్యం పొందారు. తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లి ‘బజరంగీ భాయిజాన్‌’, ‘మణికర్ణిక’ వంటి చిత్రాలకు కథలు అందించి విజయాలు సాధించారు విజయేంద్రప్రసాద్‌. రచయితగా అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత దర్శకత్వం మీద కూడా దృష్టి పెట్టి ‘శ్రీకృష్ణ 2006’, ‘రాజన్న’, ‘శ్రీవల్లి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

తమిళనాడుకు చెందిన విశ్వ సంగీత మానవుడు ఇళయరాజాను కూడా రాజ్యసభ్య సభ్యత్వం వరించింది. తేణి జిల్లా వన్నయపురంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఇళయరాజా.. దేశంలోనే పేరెన్నికగన్న సంగీత స్వరకర్తల్లో ఒకరు. ఆయన అసలు పేరు ఆర్‌.జ్ఞానదేశిగన్‌. తండ్రి బడిలో వేసేటప్పుడు ఆయన పేరు రాజయ్యగా రాయించారు. ధనరాజ్‌ మాస్టర్‌ వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేటప్పుడు.. ఆయన రాజయ్య అనే పేరును రాజాగా మార్చారు. సినీ కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఒడుదొడుకులను, కులవివక్షను ఎదుర్కొన్న ఇళయరాజా..  వాటన్నింటినీ తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడి గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినిమా పోస్టర్‌ మీద సంగీత దర్శకుడి ఫొటో వేయడం ఇళయరాజాతోనే మొదలైంది. దాదాపు ఐదు దశాబ్దాల స్వరప్రస్థానంలో 1400కి పైగా చిత్రాల్లో 7000కు పైగా పాటలను

స్వరపరిచారు. 400కు పైగా పాటలు ఆలపించారు.  ఐదుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. పద్మవిభూషణ్ పురస్తారం కూడా అందుకున్నారు.

కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్గడే ఇరవై ఏళ్ల వయసులోనే ధర్మస్థల క్షేత్ర ధర్మాధికారిగా బాధ్యతలు స్వీకరించి, నాటి నుంచి అదే పదవిలో కొనసాగుతూ అద్భుతంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ సంఘ సేవకుడు. గ్రామీణాభివృద్ధికి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ఐదు దశాబ్దాలకు పైగా ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఒక సంస్థను నిర్వహిస్తున్నారు.ఆయన చేపట్టిన ‘శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు’లో 6 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలు, 49 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అలాగే.. ‘శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ ద్వారా 25 పాఠశాలలు, కళాశాలలు స్థాపించి వేలాది మందికి నాణ్యమైన విద్యను చౌకగా అందిస్తున్నారు. ఇక కేరళలోని కోళికోడ్‌ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించిన పీటీ ఉష భారతదేశం గర్వించ దగ్గ అథ్లెట్ గా గుర్తింపు పొందారు.  పయ్యోలీ ఎక్స్‌ప్రెస్ గా పేరొందిన పీటీ ఉష పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి పతకాలు సాధించి పెట్టారు. వరల్డ్‌ జూనియర్‌ ఇన్విటేషనల్‌ మీట్‌, ఏసియన్‌ చాంపియన్‌ షిప్స్‌, ఏసియన్‌ గేమ్స్‌ల పతకాలు సాధించారు. ఒలింపిక్స్ పతకాన్ని తృటిలో చేజార్చుకున్న పీటీ ఉష… రిటైర్మెంట్‌ తర్వాత ‘ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌’ స్థాపించి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో నిర్వహిస్తూ వేలాది మంది ప్రతిభావంతులకు శిక్షణనిస్తున్నారు.

ఉత్తరాదిన హిందీ బెల్టును ఊడ్చేసిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ.. మిగతా రాష్ట్రాల్లో ప్రాబల్యం పెంచుకోలేకపోవడంతో ఇక్కడి ఓటరు దేవుళ్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దిశగానే ఇప్పుడు అకస్మాత్తుగా నలుగురు దక్షిణాది ప్రముఖులకు రాజ్యసభ నామినేషన్లు కట్టబెట్టింది.పైగా తమిళ వేర్పాటువాదం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో వారిని చల్లబరిచేేందుకు ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వమిచ్చినట్లు భావించాల్సి వస్తోంది. హైదరాబాద్లో జాతీయ కార్యవర్గం అనంతర బహిరంగ సభకు జనం భారీగా తరలిరావడంతో.. దక్షిణాది ప్రజలను ఆకట్టుకునేందుకు ఇదో తగిన తరుణమని బీజేపీ నిర్ణయించుకుంది. వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగించలేకపోయిన లోటును కూడా ఈ విధంగా తీర్చారని చెప్పుకోవాలి….

నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురిని ఎంపిక చేసినా… తెలంగాణకు మాత్రం ఛాన్స్ రాలేదు. విజయేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లో పుట్టి.. వృత్తి రీత్యా హైదరాబాద్ కు మారిన వ్యక్తి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ కుమార్..ఇక్కడ అధికారపార్టీపై విరుచుకుపడటమే గానీ… ఢిల్లీలో ఆయన బండి కదలదని విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కళాకారులు, సమాజ సేవకులు ఉన్నప్పటికీ ఈసారి ఎందుకో శీతకన్నేశారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఓబీసీ మోర్ఛా అధ్యక్షుడు డాక్టర్ కే, లక్ష్మణ్ ను ఇటీవలే ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. బహుశా అలా లెక్కచూపించాలనుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతోంది. అయితే రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేయాల్సి ఉండగా. ఇప్పుడున్న ఏడు ఖాళీల్లో నాలుగు మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన మూడింట్లో

ఒకటి తెలంగాణకు ఇస్తారని మరో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి…..