సర్కారు వారి పాట సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బ్యాంకుల స్కాములు మాత్రం చర్చకు వచ్చాయి. ఓ రైతు అప్పు తీసుకుని కట్టలేదంటూ బ్యాంక్ కోర్టుకెళ్లిన అంశంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య కూడా హైలైట్ అయింది. ముందు బడాబాబుల వద్దకు వెళ్లాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అసలు బడా బాబులు వేల కోట్లు ఎగ్గొడుతున్నా బ్యాంకులు ఎందుకు నోరు మెదపడం లేదు…? కనీసం ఎవరు ఎగ్గొడుతున్నారో ఎందుకు చెప్పడం లేదు ? ఇది ఇప్పటికీ మిస్టరీగా మారిపోయింది.
రూ. 50 కోట్ల కంటే ఎక్కువ అప్పు ఎగ్గొట్టిన వారి పేర్లను చెప్పాలని గతంలో ఆర్టీఐ ఆదేశం !
బ్యాంకులకు రూ. 50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారి వివరాలను ప్రజలకు ఇవ్వాలని మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార హక్కు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆదేశించారు. 2017లో నే భారత సుప్రీంకోర్టు కూడా అదే తరహా ఆదేశాలిచ్చింది. బ్యాంకులకు అప్పు పడి.. అప్పు కట్టని వాళ్ల పేర్లు చెప్పమని.. ఆదేశించింది. దేశంలోని బ్యాంకుల వ్యవహారాలన్నింటినీ నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్. సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా… ఆర్బీఐ.. ఇప్పటికీ.. అలా డబ్బులు ఎగ్గొట్టిన వారి వివరాలను బయటపెట్టలేదు. దీనికి సంబంధించి ఆర్బీఐ చెబుతున్న సాకు ఏమిటంటే.. దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది అని.. వేల కోట్ల అప్పు తీసుకుని.. బ్యాంకుల్ని ముంచి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతూంటే.. పేరు చెప్పడానికి ఆర్బీఐ ఎందుకు వెనుకాడుతోంది..? . అలా వెల్లడించడం వల్ల దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఏ విధంగా విఘాతం కలుగుతుంది. .? అంటే ఎవరి దగ్గరా సమాధానం ఉండదు.
ప్రజల సొమ్మునే దోచేస్తున్నా ఎందుకు పట్టించుకోరు !?
బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వారి పేర్లు చెప్పడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి..? ఇదంతా ప్రజల సొమ్మే కదా..?. వేల కోట్లు అప్పులు తీసుకున్న వారు పార్లమెంట్‌లో కూర్చుంటున్నారు. ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ ఉంటే పోటీకి అనర్హత అంటున్నారు. అదే ఇరవై వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టినా… పోటీకి అనర్హుడు కాదు. భారతదేశంలో ఎవరైనా ఓ వంద కోట్లు.. వెయ్యి కోట్లు అప్పు తీసుకుని.. బ్యాంకులకు ఎగ్గొడితే.. పోటీకి అనర్హుడిగా ప్రకటించే చట్టం ఎందుకు చేయరు. ఎవరూ ఒప్పుకోరు. ఎందుకంటే.. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వంద కోట్లు అప్పు ఇస్తే 10 కోట్లు నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయి. ఇప్పటికి బ్యాంకులకు 15 లక్షల కోట్లకుపైగా నిరర్థక ఆస్తులు తేలాయి. ఇలా అప్పులు చేసి ఎగ్గొడుతున్న వారి జాబితాతో ఏమిటో చెప్పమంటే.. మాత్రం చెప్పడం లేదు.
బ్యాంకుల్లో పేదలకు ఓ భాష.. బడాబాబులకు ఓ భాష !
బ్యాంకింగ్‌లో కూడా.. చిత్రమైన భాష ఉంటుంది. ఎవరైనా ఖాతాదారుకు లబ్ది చేకూరిస్తే.. సబ్సిడీ అంటారు. అదే పారిశ్రామిక వేత్తలకు అయితే ఇన్సెంటివ్స్ అంటారు. అదే రైతులకు అప్పులు మాఫీ చేస్తే రుణమాఫీ అంటారు. అదే పారిశ్రామిక వేత్తలకు చేస్తే కార్పొరేట్ డెబిట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఎంత గౌరవం చూపిస్తారో..?. అప్పులు తీసుకుని ఎగ్గొడుతున్న వాటికి.. నిరర్థక ఆస్తులు అని పేరు పెట్టారు. వీటిని నియంత్రించే అధికారం కూడా.. ఆర్బీఐకి ఉంది. సెక్షన్ సెవన్ ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ పై అధికారం చెలాయిస్తున్న .. కేంద్రం.. అదే సెక్షన్ ప్రకారం… ఆ డబ్బులు ఎగ్గొట్టిన వారి పేర్లను ఎందుకు అడగదు అంటే ఎవరి దగ్గరా సమాధానం ఉండదు.
భారతదేశంలో బడా కార్పొరేట్ వ్యక్తులు.. వ్యవస్థలన్నీ బ్యాంకుల దగ్గర వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టినవే. ఒక్కొక్కరు వందలు కాదు వేల కోట్లలోనే ఎగ్గొట్టారు. ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇలా ఎంత కాలం చేస్తారో కానీ.. దేశం మునిగిపోయేవరకూ మేలుకోకపోతే.. ప్రజలు మాత్రం శ్రీలంక సన్నివేశాల్ని రిపీట్ చేయడం ఖాయం.