జగన్‌ ఫ్రస్ట్రేషన్‌కు కారణం అదే !

By KTV Telugu On 9 April, 2022
image

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి భాషలో అధికార గీత దాటిపోతున్నారు. ఆయన బయట రాజకీయ నాయకుడు కావొచ్చు కానీ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ముఖ్యమంత్రి. ఆ పదవి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ సీఎం జగన్ విద్యార్థులతో సభ పెట్టి దారుణమైన భాష మాట్లాడుతున్నారు. దీంతో జగన్‌లో ఎందుకింద అసహనం పెరిగిపోయిందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో ప్రారంభమయింది. ఆ అసహనానికి ఒక్కటే కారణం కనిపిస్తోంది. అదే టీడీపీ- జనసేన కలవడం.

టీడీపీ – జనసేన కలుస్తుందేమో అని భయపడుతున్న జగన్ !

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని ప్రకటించారు. అప్పట్నుంచి వైసీపీ నేతలు శివాలెత్తిపోతున్నారు. వారి లక్ష్యం ఒకటే. జనసేన పార్టీని బీజేపీతోనే ఉంచడం లేదా ఒంటరిగా పోటీ చేసేలా చేయడం. దమ్ముందా పవన్ అని ప్రారంభించి.. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే మగాడు లేడు అని చాలెంజ్‌లు విసరడం వరకూ వెళ్లింది. వారి లక్ష్యం అంతిమంగా ఒక్కటే.. రెచ్చగొట్టే.. మరొకటో చేసి వారు కలవకుండా చేయడం. ఎవరికి వారు పోటీ చేయడం. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయేలా చూసుకోవడం. అందులో దాపరికమేమీ లేదు. కానీ వారి ట్రాప్‌లో టీడీపీ, జనసేన పడటం లేదు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే అసలు ఇప్పటికీ టీడీపీ – జనసేన మధ్య పొత్తు లేదు. అయినప్పటికీ సీఎం జగన్ కూడా వారిద్దరిని కలిపి తిడుతున్నారు. వారిద్దరూ దెయ్యాలంటున్నారు. కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరంటున్నారు. అంటే.. క్లియర్‌గా అర్థమయ్యేదేమిటంటే.. వారిని చూసి జగన్ ఆందోళన చెందుతున్నారనేది.

కేంద్రం నుంచి కూడా సహకారం రాదని తేలిపోయిందా ?

ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఆర్థిక పరిస్థితులపై సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని.. అప్పులు ఇవ్వవొద్దని బ్యాంకులకు ఇచ్చిన ఆదేశాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నేరుగా జగన్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో అమిత్ షాతో భేటీలో రాజకీయపరమైన చర్చలు జరిపారని.. అవి అక్కడ అంతగా వర్కవుట్ కాలేదని అటున్నారు. బీజేపీతో జనసేన పొత్తులో ఉందని.. ఆ పార్టీని టీడీపీ వైపు వెళ్లకుండా చూడాలని .. పవన్ పై గట్టిగా ఒత్తిడి చేయాలని కోరారని చెబుతున్నారు. అయితే ఆ విషయంలోనూ సానుకూల సంకేతాలు రాకపోవడంతో తిరిగి వచ్చినప్పటి నుండి పవన్, చంద్రబాబుపై ఘాటు విమర్శలు ప్రారంభించారని అంటున్నారు.

జగన్ భయపడుతున్నారన్న అభిప్రాయం !

నిజానికి బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయి. ఓట్లు చీలనివ్వబోనని పవన్ చెబుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని ఎక్కడా చెప్పలేదు. కానీ పొత్తు పెట్టుకుంటారు.. తన సీటుకు ఎసరు వస్తుందని జగన్ ఇప్పటి నుండే భయపడుతున్నారని అందుకే ఆయన తన పార్టీ నేతలతో అదే పనిగా విమర్శలు చేయిస్తున్నారని.. ఇప్పుడు తానే రంగంలోకి దిగారని భావిస్తున్నారు. స్వయంగా ఇద్దరూ కలిసినా తనను ఏం చేయలేరని చాలెంజ్‌లు చేయడం ప్రారంభించారు. సమయం , సందర్భం కూడా చూసుకోకుండా ఆయన మాటలు చాలా మందిని ఆశ్చర‌్యపరుస్తున్నాయి. ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పి పోయారని ఇది ఖచ్చితంగా ఓటమి భయమేనని అభిప్రాయం బలపడుతోంది.

ఎన్నికల పొత్తులు ఇబ్బందికరమే !

టీడీపీ- జనసేన కలిసినప్పుడు వైసీపీ ఓడిపోయింది. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసింది. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కలసి వచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు జనసేన, టీడీపీ కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయడం కష్టం కాదు. బహుశా జగన్‌లో భయం పెరగడానికి అదే కారణం కావొచ్చు.