ఆమె ఎవరితోనైనా దెబ్బలాడతారు. న్యాయం కోసం పోరాడే క్రమంలో ఆమె పెద్ద, చిన్నా వ్యత్యాసం చూడరు. నా దారి రహదారి అంటారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో మళ్లీ వార్తల్లో వ్యక్తి అవుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల మీద, పోలీసుల మీద ఆమె విరుచుకుపడుతున్న తీరు చూస్తే మేడమ్ సమరానికి సిద్ధమయ్యారని చెప్పక తప్పదు.. సీఎం పోస్టుపై ఆమె కూడా ఆశలు పెట్టుకున్నారని అనుమానించక తప్పదు..
స్పీడ్ పెంచిన రేణుక
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ రేణుకా చౌదరి కూడా స్పీడ్ పెంచారు. కొంతకాలంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో బిజీగా ఉన్న రేణుక.. ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో ఎంట్రీ ఇస్తూనే… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. చార్మినార్, భాగ్యలక్ష్మీ టెంపుల్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ఇదంతా బీజేపీ మతవాద రాజకీయమని రేణుకా చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ దమ్ము గురించి బండి సంజయ్ ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నది రేణుక కామెంట్స్. చార్మినార్ హైదరాబాద్ ప్రజలది అని అంటూ.. నేను ఒంటరిగా వస్తా.. దమ్ముంటే నువ్వురా తేల్చుకుందాం.. అంటూ బండి సంజయ్‌కు ఆమె సవాలు విసిరారు..
హోమంత్రి ఇంటి ముట్టడి..
హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు రాజకీయంగా కలిసొచ్చింది. హోం మంత్రి మనుమడి ప్రమేయం ఉందని వార్తలు వచ్చిన నేపధ్యంలోనే మహమూద్ అలీని కలిసేందుకు రేణుకా చౌదరి వెళ్లారు. పర్మీషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో రేణుక అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. భుజాల మీద స్టార్లు పెట్టుకోవడం కాదు.. బుర్రలో కూడా ఉండాలంటూ పోలీసులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఒక పోలీసును కొట్టినట్లు, మరోకరిని తోసినట్లు కూడా వీడియోలు చక్కర్లు కొట్టాయి..
పొలిటికల్ టూరిస్టు కాదు…
ఆమె కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా పనిచేసి ఉండొచ్చు. ఆమె పొలిటికల్ టూరిస్టు మాత్రం కాదు. గెలిచినా ఓడినా జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తారు. 1984 నుంచి రేణుకా చౌదరి అనేక పదవులు నిర్వహించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఖమ్మం నుంచి రెండు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. సోనియాగాంధీకి అత్యంత సన్నిహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి రేణుక తనకు నచ్చినట్లుగా మాట్లాడతారు. మన రాష్ట్రం కాదులే అని ఊరుకోరు. ఏ రాష్ట్రం గురించైనా ఆమె కామెంటరీ ఉంటుంది. ఒక సందర్భంలో మంగళూరు ( కర్ణాటక) నగరం తాలిబన్‌ల ప్రదేశంగా మారిపోయిందని ఆమె వ్యాఖ్యానించడంతో నగర మేయర్ రేణుకపై కేసు పెట్టారు. అలాంటి వాటికి తాను భయపడబోనని రేణుక ప్రకటించి మరీ సవాలు చేశారు…
సీఎం కావాలనుకుంటున్నారా..
రేణుకకు కూడా రాజకీయ ఆశయాలున్నాయి. కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్నప్పటికీ.. పదవుల విషయంలో ఎదగలేకపోతున్న బాధ ఆమెను వెంటాడుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని గ్రహించిన ఆమె తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వస్తే చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండొచ్చు. పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టకూడదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే మాత్రం రేసులో రేణుక ముందు వరుసలో ఉంటారు….